మృగాలను క్షమించకూడదు

ABN , First Publish Date - 2021-07-24T04:51:13+05:30 IST

మృగాలను క్షమించకూడదు

మృగాలను క్షమించకూడదు

- అత్యాచారాలు చేసేవారు భూమిపై ఉండేందుకు వీల్లేదు

- దిశ యాప్‌ అవగాహన సదస్సులో స్పీకర్‌ తమ్మినేని సీతారాం

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూలై 23: ‘మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారు భూమిపై ఉండేందుకు వీల్లేదు. అలాంటి మృగాలను క్షమించకూడద’ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పోలీసు, మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘దిశ’ యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. స్పీకర్‌  సీతారాం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘ఔట్‌ ఆఫ్‌ ది లా’ అమలు చేస్తేనే సమాజంలో న్యాయం జరుగుతుందని తెలిపారు. దిశ యాప్‌తో మహిళల భద్రతకు భరోసా లభిస్తుందన్నారు. ‘సమాజానికి రక్షణగా ఉండాల్సిన మగాడు మృగంగా మారితే క్షమించకూడదు. ఎక్కడో ఒక దగ్గర మహిళపై దాడులకు ఫుల్‌స్టాప్‌ పడాలి. మహిళలు ఆత్మన్యూనతా భావాన్ని విడనాడాలి. వారిని రక్షించేందుకు దిశ చట్టం ఉంది. పురుషుల ఆలోచనా ధోరణి కూడా మారాలి. అత్యాచార దోషులకు శిక్ష పడాల్సిందే’ అని స్పీకర్‌ సీతారాం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ప్రతి మహిళ దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు. యాప్‌ వినియోగంపై మహిళా పోలీసులతో అవగాహన కల్పించాలన్నారు. అక్రమ మద్యం నివారించడంలోనూ మహిళా పోలీసుల సేవలను వినియోగించాలని ఆయన సూచించారు. ప్రయాణ సమయంలో పోలీసు శాఖ నంబర్లు అవసరమని.. అవి దిశ యాప్‌లో ఉన్నాయని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌ మాట్లాడుతూ... జిల్లాలో 6 లక్షల మంది వద్ద స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయని, 2.90 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. మహిళలు ఆపద సమయంలో ఫోన్‌ ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కినా.. లేదా ఐదుసార్లు ఫోన్‌ షేక్‌చేసినా తక్షణం సమాచారం పోలీసులకు చేరుతుందని వివరించారు. ప్రతి 16 నిమిషాలకు ఓ మహిళ లైంగిక దాడికి గురవుతున్నట్లు ఓ సర్వే ద్వారా వెల్లడైందని ఎస్పీ అమిత్‌బర్దర్‌ చెప్పారు. దిశ యాప్‌ వినియోగంతో మహిళలకు సామాజిక భద్రత ఉంటుందన్నారు. అనంతరం దిశ యాప్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, పలాస మునిసిపల్‌ చైర్మన్‌ గిరిబాబు, ఐసీడీఎస్‌ పీడీ జయదేవి, మహిళా ఆర్థిక కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బల్లాడ హేమామాలిని, ఏఎస్పీ సోమశేఖర్‌, డీఎస్పీలు మహేంద్ర, శ్రావణి, మహిళా వైద్యులు, పోలీసులు, కండక్లరు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. 

ఫ ఫొటోలు 4218, 42131: కార్యక్రమంలో మాట్లాడుతున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి అప్పలరాజు

4256 : దిశ యాప్‌కు సంబంధించిన పోస్టర్‌లు ఆవిష్కరిస్తున్న దృశ్యం

  

Updated Date - 2021-07-24T04:51:13+05:30 IST