పాఠశాలల హేతుబద్ధీకరణ విద్యాహక్కును ఉల్లంఘించటమే

ABN , First Publish Date - 2021-07-14T05:51:26+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పుడు జీవో 6 ద్వారా హేతుబద్ధీకరణ పేరిట పాఠశాలలను...

పాఠశాలల హేతుబద్ధీకరణ విద్యాహక్కును ఉల్లంఘించటమే

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పుడు జీవో 6 ద్వారా హేతుబద్ధీకరణ పేరిట పాఠశాలలను ఎప్పుడు మూసివేద్దామా అనే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగా 100లోపు విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలలను, 30 లోపు విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను, 20లోపు పిల్లలు ఉన్న ప్రాథమిక పాఠశాలలను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం 1585 ఉన్నత, 429 ప్రాథమికోన్నత, 5851 ప్రాథమిక పాఠశాలలు కలిపి మొత్తం 7వేల పైచిలుకు మూతపడతాయి. అదే జరిగితే ఉన్నత పాఠశాలల్లో 9 వేలమంది, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో 4వేల మంది ఉపాధ్యాయులు అదనంగా ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం ద్వారా విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నామనే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాతే హేతుబద్ధీకరణకు సిద్ధం కావాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో నివాసానికి ఒక కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, 5కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు అందుబాటులో ఉండాలన్న అంశాన్ని మరచిపోకూడదు. ఒక గ్రామంలో బడిఈడు పిల్లలు ఎందరు, వారంతా ప్రభుత్వ లేదా ప్రైవేటు బడులకు వెళ్తున్నారా లేదా, ఆ గ్రామం నుంచి పక్క గ్రామాలు, పట్టణాలలోని ప్రైవేటు, కార్పొరేటు బడులకు స్కూలుబస్సుల్లో ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు అనే అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని హేతుబద్ధీకరణ జరపాలి.


బస్సుల్లో 10, 15 కి.మీ. దూరం వరకు చిన్నారి విద్యార్థుల తరలింపు చట్టవిరుద్ధం. అలా తరలించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో పాఠశాలలను మూసివేస్తే ఇలాంటి ప్రమాదాలకు మరింత అవకాశం ఇచ్చిన వారవుతారు. ఎంతో మంది విద్యార్థులను బలిగొన్న మాసాయిపేట వంటి ఘటనలను రోజూ చూడాల్సి వస్తుంది. హాజిపూర్‌ వంటి సంఘటనల కారణంగా బాలికలను తల్లిదండ్రులు ప్రక్క గ్రామాల బడులకు పంపరు. ఫలితంగా వారు చదువులకు దూరమవుతారు. అసలే తెలంగాణ రాష్ట్రంలో అక్షరాస్యత దేశ అక్షరాస్యత సగటు 77.7శాతం కంటే తక్కువగా, 72.8శాతం ఉంది. 


2020లో తెలంగాణ జనాభా 3.92 కోట్లు. జనాభా పెరుగుదల ననుసరించి పిల్లల సంఖ్య పెరుగుతుంటే పాఠశాలల అవసరం ఎందుకు తగ్గుతున్నది? ఉన్న పాఠశాలలను ఎందుకు మూసివేయాల్సి వస్తున్నది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం గతంలోని 668 గురుకులాలకు తోడుగా, కొత్తగా 433 గురుకులాలు 119 మైనార్టీ ఉర్దూ మీడియం పాఠశాలలను ఏర్పాటు చేసింది. గురుకులాల్లో ఒక్కో విద్యార్థి పైన ఏటా రూ.1,32,000 ఖర్చు చేస్తున్నారు. అంటే రాష్ట్రంలోని సుమారు 65 లక్షల మంది పిల్లల్లో కేవలం 5 లక్షల మంది గురుకుల పాఠశాలల విద్యార్థులకు మాత్రమే కార్పొరేట్‌ స్థాయి వసతులు కల్పిస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలను మాత్రం పట్టించుకోవడం లేదు.


పాఠశాలల మూత విషయంలో ఉపాధ్యాయసంఘాలు ప్రజలను చైతన్యపరచాలి. తమ పిల్లలను తమ ఊరిలోని ప్రభుత్వ పాఠశాలకు పంపి వారికి అవసరమైన విద్యను పొందగలిగే విధంగా ఆ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులదే అనే విషయాన్ని చెప్పాలి. ఏ సమాజ అభివృద్ధి అయినా విద్యాపరమైన అభివృద్ధిని బట్టే లెక్కగడతారు. ఒకపక్క ప్రజల్లో ధనికులు తమ పిల్లలకు కార్పొరేట్‌ విద్యను అందిస్తుంటే, బీద, మధ్యతరగతి ప్రజల పిల్లలు విద్యకు దూరమయ్యే పరిస్థితి తలెత్తకూడదు. అసమానతలు లేకుండా దేశమంతా ఒకే విద్యావిధానం అమలు చేయాలి. కరోనా ప్రభావంతో అన్నిటికంటే ఎక్కువగా నష్టపోయింది విద్యారంగమే. ముఖ్యంగా బీద ప్రజల పిల్లలు ఆన్‌లైన్‌ విద్యాబోధనను అందుకోలేక నష్టపోయారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకోకుండా అన్ని వర్గాలతో చర్చించి చర్యలు చేపట్టాలి.  

పులి సరోత్తం రెడ్డి

పి.ఆర్‌.టి.యు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు

Updated Date - 2021-07-14T05:51:26+05:30 IST