Viral video: పుట్టుకతోనే చూపులేని చిన్నారి.. తొలిసారిగా ప్రపంచాన్ని చూసి.. సైన్స్ అంటే ఇదే..!

ABN , First Publish Date - 2022-06-17T00:47:07+05:30 IST

ఆధునిక వైద్య విధానాల్లో ఒకటైన అవయవ మార్పిడి(Organ transplantation) ద్వారా ఓ చిన్నారి తొలిసారిగా ప్రపంచాన్ని చూసింది. కళ్లుముందున్న రంగుల ప్రపంచాన్ని చూస్తూ ఆశ్చర్యపోతున్న ఆ చిన్నారి వీడియో నెటిజన్లను కదిలిస్తోంది.

Viral video: పుట్టుకతోనే చూపులేని చిన్నారి.. తొలిసారిగా ప్రపంచాన్ని చూసి.. సైన్స్ అంటే ఇదే..!

ఇంటర్నెట్ డెస్క్: కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. కళ్లు ఉంటేనే ప్రపంచం..! అందుకే.. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని పెద్దలు అంటారు. కానీ.. కొందరు దురదృష్టవంతులు పుట్టుకతోనే చూపుకు దూరమవుతారు. జన్యుపరమైన సమస్యలు లేదా ఇతరత్రా కారణాల రీత్యా వారి జీవితం మొదట్లోనే చీకటిగా మారుతుంది. ఇక ఇలాంటి సంతానం ఉన్న తల్లిదండ్రుల వేదనను మాటల్లో వర్ణించడం అసాధ్యం. కానీ.. రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న ఆధునిక వైద్య శాస్త్రం..అనేక మంది జీవితాల్లో కొత్త వెలుగును నింపుతోంది. ప్రకృతి విధించిన అనేక పరిమితులను అధిగమిస్తూ అద్భుతాలను సృష్టిస్తోంది. ఇప్పుడిదంతా ఎందుకంటే..  ఆధునిక వైద్య విధానాల్లో ఒకటైన అవయవ మార్పిడి(Organ transplantation) ఓ చిన్నారి జీవితాన్ని మళ్లీ రంగులమయం చేసింది. తాను పుట్టిన తరువాత ఇప్పటివరకూ కనిపించని ఓ ప్రపంచం ఆమెకు కనబడటంతో ఆ చిన్నారి ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. 


ఫైజాన్ అనే మహిళ తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలోని చిన్నారికి ఆపరేషన్ ద్వారా కొత్త కళ్లు అమర్చారు. అయితే ఇటీవలే ఆ చిన్నారి కట్లు విప్పడంతో కళ్లు తెరిచి చూసిన ఆమెకు తొలిసారిగా రంగుల ప్రపంచం సాక్షాత్కారమయింది. దీంతో.. ఆ చిన్నారి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. బాలిక హావభావాలన్ని చూస్తున్న ఆమె తల్లి కూడా కూతురి ఆనందాశ్చర్యాలను చూస్తూ కన్నీటి పర్యంతమైంది. ఈ వీడియో నెటిజన్లను కూడా కదిలిస్తోంది. శాస్త్రీయపరిజ్ఞానం నిజంగానే అద్భుతమంటూ వారు తమ సంతోషాన్ని కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. 



Updated Date - 2022-06-17T00:47:07+05:30 IST