బంధువంటాడు.. దోచేస్తాడు

ABN , First Publish Date - 2022-07-27T05:10:42+05:30 IST

టూ లెట్‌ బోర్డులపై ఉన్న ఫోన్‌ నంబర్లను సేకరించడం.. ఆపై బంధువు నంటూ వరసలు కలపడం.. సొంత వ్యక్తిలా మాయమాటలు చెప్పి బురిడీ కొట్టించడం ప్రవృత్తిగా చేసుకున్న ఓ వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. వన్‌టౌన్‌ సీఐ వెంకటరావు మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆ వివరాలు తెలిపారు.

బంధువంటాడు.. దోచేస్తాడు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఐ వెంకటరావు

టూ లెట్‌ బోర్డు నంబర్ల సేకరణ
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

విజయనగరం క్రైం, జూలై 26 :  టూ లెట్‌ బోర్డులపై ఉన్న ఫోన్‌ నంబర్లను సేకరించడం.. ఆపై బంధువు నంటూ వరసలు కలపడం.. సొంత వ్యక్తిలా మాయమాటలు చెప్పి బురిడీ కొట్టించడం ప్రవృత్తిగా చేసుకున్న ఓ వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. వన్‌టౌన్‌ సీఐ వెంకటరావు మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆ వివరాలు తెలిపారు.
బాపట్ల జిల్లా కొప్పలపాలెంకు చెందిన కోటా విజయకృష్ణ టూలెట్‌ బోర్డుపై ఉన్న ఫోన్‌ నంబర్లను సేకరించేవాడు. ఈ విధంగా ఇప్పటివరకు దాదాపు వెయ్యి నంబర్లు సేకరించాడు.  ఆయా నంబర్లకు ఫోన్‌ చేసి దూరపు బంధువుగా పరిచయం చేసుకునేవాడు. కొద్దిరోజులు నిత్యం ఫోన్‌ చేస్తూ సన్నిహిత వ్యక్తిగా మారేవాడు. ఆపై అత్యవసరంగా డబ్బుల అవసరం పడిందని, తాను ఇంటికి దూరంగా ఉన్నానని, సెల్‌ ద్వారా డబ్బులు  పంపితే తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికేవాడు. నిజమేనని నమ్మేసిన వారంతా మోసపోయారు. ఈ విధంగా విజయనగరం కొత్తఆగ్రహారం ప్రాంతానికి చెందిన పి.కాళిదాసు ఫోన్‌చేసిన వ్యక్తి స్వరం తన అల్లుడిదేనని భావించి వేరే ఆలోచన లేకుండా రూ.36 వేల నగదును కృష్ణ చెప్పిన ఫోన్‌పే నంబర్‌కు పంపించాడు. అలాగే శిరిషా అనే మహిళను కూడా అదే తరహాలో ఫోన్‌చేసి నగదు అడగ్గా ఆమె వెంటనే స్పందించి రూ.30 వేల నగదును ఫోన్‌పే చేసింది. వీరితో పాటు రాజాంకు చెందిన మరో వ్యక్తి కూడా కృష్ణ మాటలు నమ్మి రూ.22 వేలు ఫోన్‌పే చేశారు. డబ్బులు పంపాక ఆ వ్యక్తి అడ్రస్‌ లేకపోవడంతో మోసపోయామని గుర్తించారు. వీరిలో కొందరు బాధితులు ఈ నెల 14వ తేదీన వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసునమోదుచేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ టీవీల సహాయంతో నిందితుడిని గుర్తించారు. బాపట్లకు చెందిన కోటా విజయకృష్ణగా నిర్ధారణకు వచ్చి ఆయన గ్రామానికి వెళ్లి ఎస్‌ఐ ఆశోక్‌కుమార్‌, హెచ్‌సీ అచ్చిరాజు, పీసీ శివశంకర్‌లు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకొచ్చి విచరించగా నేరాలను అంగీకరించాడు. అతని వద్ద నుంచి రూ.57 వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. విజయకృష్ణపై ఇతర జిల్లాల్లోనూ కేసులు నమోదయ్యాయి. ఎప్పటికప్పుడు కొత్త జిల్లాలపై దృష్టి పెట్టడం.. ఆపై మోసగించడం పనిగా పెట్టుకున్నాడు.


Updated Date - 2022-07-27T05:10:42+05:30 IST