గెస్ట్‌లతో వ్యభిచారానికి ఒప్పుకోలేదని రిసార్టు రిసెప్షనిస్ట్‌ హత్య

ABN , First Publish Date - 2022-09-25T07:37:55+05:30 IST

ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బీజేపీ నాయకుడి కొడుకు తన రిసార్ట్‌లో పనిచేసే అంకిత భండారీ (19) అనే రిసెప్షనిస్ట్‌ ఉసురుతీశాడు.

గెస్ట్‌లతో వ్యభిచారానికి ఒప్పుకోలేదని రిసార్టు రిసెప్షనిస్ట్‌ హత్య

ఉత్తరాఖండ్‌లో బీజేపీ నాయకుడి కుమారుడి ఘాతుకం

రిసెప్షని్‌స్టను బ్యారేజ్‌లోకి తోసేసి చంపిన పులకిత్‌ ఆర్య

హత్యపై స్థానికుల ఆగ్రహం.. ఎమ్మెల్యే కారుపై దాడి

డెహ్రాడూన్‌, సెప్టెంబరు 24: ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బీజేపీ నాయకుడి కొడుకు తన రిసార్ట్‌లో పనిచేసే అంకిత భండారీ (19) అనే రిసెప్షనిస్ట్‌ ఉసురుతీశాడు. రిసార్ట్‌కు వచ్చ గెస్ట్‌లతో వ్యభిచారానికి ఒప్పుకోలేదని ఆమెను బ్యారేజ్‌లోకి తోసి చంపేశాడు. తనను వ్యభిచారిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని కొన్ని రోజుల క్రితం ఆమె తన ఫ్రెండ్‌కు పంపిన వాట్సాప్‌ మెసేజ్‌ల స్ర్కీన్‌షాట్స్‌ బయటికొచ్చాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ నేత వినోద్‌ ఆర్య కొడుకు పులకిత్‌ ఆర్యకు పౌరీ జిల్లా యమకేశ్వర్‌లో పులకిత్‌ ఆర్యకు రిసార్ట్‌ ఉంది. అక్కడ రిసెప్షని్‌స్టగా పనిచేస్తున్న అంకితను రిసార్ట్‌కు వచ్చే అతిథులతో వ్యభిచారానికి ఒప్పుకోవాలని పులకిత్‌ ఒత్తిడి చేస్తూ వచ్చాడు. అతనికి రిసార్ట్‌ మేనేజర్లు తోడయ్యారు. వ్యభిచారం చేయబోనని ఆమె ఎన్నిసార్లు స్పష్టం చేసినా వారు వేధింపులు ఆపలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఈ నెల 18వ తేదీ (ఆదివారం) రాత్రి నుంచి కనిపించలేదు. ఆమె ఫోన్‌ పనిచేయలేదు. దాంతో ఆమె ఫ్రెండ్‌ ఒకరు పులకిత్‌కు ఫోన్‌ చేసి అడిగాడు. అంకిత తన రూమ్‌కు వెళ్లిపోయిందని అతను నమ్మబలికాడు. మరుసటి రోజు ఫోన్‌ చేస్తే అతని ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేశాడు. రిసార్ట్‌ మేనేజర్‌కు ఫోన్‌ చేస్తే జిమ్‌లో ఉందని చెప్పాడు. చివరకు ఆమె రిసార్ట్‌లో లేదన్న విషయం తెలిసింది. ఆమె అదృశ్యమైన మూడు రోజులకు గానీ పోలీసులు స్పందించలేదు. కుటుంబ సభ్యులు, స్థానికుల ఆందోళనతో దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం పులకిత్‌ను అరెస్ట్‌ చేశారు. అంకితను బ్యారేజ్‌లోకి తోసేసినట్టు అతను ఒప్పుకోవడంతో పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందం గాలింపు చేపట్టారు. శనివారం చీలా కెనాల్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె హత్యకు గురైన విషయం తెలిసి స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. స్థానిక ఎమ్మెల్యే రేణు బిష్ట్‌ కారుపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. పోలీసులు ఆమెను వారి నుంచి కాపాడి తీసుకెళ్లారు. రిసార్ట్‌ వద్ద కూడా స్థానికులు ఆందోళన చేసి రాళ్లు విసిరారు. రిసార్ట్‌ ప్రాంగణంలోని ఓ భవనానికి నిప్పు పెట్టారు. 


నన్ను వ్యభిచారిని చేయాలని ప్రయత్నిస్తున్నారు!

అంకితను వ్యభిచార రొంపిలోకి దింపాలని పులకిత్‌ ఒత్తిడి చేశాడని ఆమె తన ఫ్రెండ్‌కు పంపిన వాట్సాప్‌ మెసేజ్‌లు చెబుతున్నాయి. వీటి స్ర్కీన్‌షాట్స్‌ వైరల్‌ అయ్యాయి. ‘వాళ్లు నన్ను వ్యభిచారిగా మార్చాలని చూస్తున్నారు’ అని ఒక మెసేజ్‌లో ఉంది. సెక్స్‌కి ‘స్పెషల్‌ సర్వీస్‌’ అనే మాట వాడుతున్నారని, దీనికి వీవీఐపీ గెస్ట్‌ల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారని ఆ మెసేజ్‌ల ద్వారా తెలుస్తోంది. స్పా ట్రీట్‌మెంట్‌ ముసుగులో ఈ స్పెషల్‌ సర్వీస్‌ అందిస్తున్నారు. ఎవరీ వినోద్‌ ఆర్య? వినోద్‌ ఆర్య హరిద్వార్‌కు చెందిన బీజేపీ నేత. గతంలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ బోర్డ్‌ అధ్యక్షుడిగా క్యాబినెట్‌ హోదాలో పనిచేశారు. శనివారం ఆయనతో పాటు మరో కొడుకు అంకిత్‌ ఆర్యను బీజేపీ బహిష్కరించింది. అంకిత్‌ను ఓబీసీ కమిషన్‌ ఉపాధ్యక్ష పదవి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. స్థానిక పట్వారీని, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేసింది. రిసార్ట్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. దోషులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ చెప్పారు. అంకిత హత్యపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మహిళలు సురక్షితంగా ఉన్నప్పుడే మన దేశం పురోగతి సాధిస్తుందన్నారు.

Updated Date - 2022-09-25T07:37:55+05:30 IST