స్పందన అంతంతే..!

ABN , First Publish Date - 2022-08-08T05:30:00+05:30 IST

‘స్పందనకు వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించండి.

స్పందన అంతంతే..!
స్పందనలో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌

పరిష్కారం కాని సమస్యలు
పదే పదే తిరుగుతున్న అర్జీదారులు


నంద్యాల, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ‘స్పందనకు వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించండి. బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎస్‌లో పడకుండా చూడండి’ ఈ మాట ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించాక అధికారులతో కలెక్టర్‌ చెబుతున్నారు. స్పందన లక్ష్యం అదే. ప్రజల సమస్యలను వెనువెంటనే పరిష్కరించడానికే ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందన గురించి చాలా ఘనంగా ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ క్షేత్రస్థాయి వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. కలెక్టర్‌ మాటను అధికారులు పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. స్పందనలో అర్జీ పెట్టుకున్న తర్వాత కూడా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అర్జీదారుల పదే పదే కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు. వచ్చిన అర్జీలను అధికారులు మొక్కుబడిగా తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేకుండా ఏళ్ల తరబడి స్పందన నిర్వహించినా ప్రయోజనం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో సమస్య మీద ఫిర్యాదుదారులు వారాల తరబడి స్పందన చుటట్టూ తిరుగుతూ ఉండటం దీనికి నిదర్శనం.

పరిస్థితిలో మార్పు లేదు..

స్పందనకు జిల్లాలో ఎక్కువగా రెవెన్యూ పరమైన అర్జీలు వస్తూ ఉన్నాయి. భూముల ఆక్రమణ, అడంగల్‌ సవరణ, మ్యూటేషన్‌ సమస్యలు, పట్టాదారు పాసుపుస్తకాలు, స్థల వివాదాలు, తప్పడు ధృవీకరణ పత్రాలు సృష్టించడం, ఒకరి భూమి మరొకరి పేరు మీద మార్చేయడం.. ఇలా రెవెన్యూపరమైన సమస్యల మీద స్పందనకు ప్రతి సోమవారం లెక్కకు మించి ఫిర్యాదులు వస్తుంటాయి. ఏళ్లపాటు స్థానిక, మండల అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. స్పందనలో అర్జీ పెట్టుకుంటే తమ సమస్య తీరుతుందనుకున్న ఆశ నిరాశే అవుతోంది. అర్జీని పరిశీలించిన కలెక్టరు స్థానిక అధికారులకు అందులోని సమస్యను పరిష్కరించమని సూచించడం, స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం రొటీన్‌గా మారిపోయిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో అర్జీదారులు కాళ్లు అరిగేలా స్పందన చుట్టూ తిరగాల్సి వస్తోంది.
 
సమస్య పరిష్కారమైనట్లు ఆన్‌లైన్‌లో..

అర్జీదారుల సమస్యను పరిష్కరించకుండానే పనైపోయినట్లు అధికారులు ఆన్‌లైన్‌లో చూపుతున్నారు. నిజానికి క్షేత్ర స్థాయిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు వ్యవహారం ఉంటుంది. దీంతో ప్రజలు నెలలు, సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతునే ఉన్నారు. ఇదే విషయాన్ని డీఆర్వోని అడగ్గా సమస్య పరిష్కారం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని, భూ సమస్యలను పరిష్కరించడానికి ఇరు పార్టీలు ముందుకు రావాలని అన్నారు. అలా రానందు వల్లే రెవెన్యూ అర్జీలు అలాగే ఉండిపోతున్నాయని తెలిపారు.

 తగ్గిపోయిన అర్జీదారులు

స్పందనలో అర్జీ పెట్టుకున్నా పనేమీకాదని తేలిపోయినా ప్రతి సోమవారం జరిగే కార్యక్రమానికి ప్రజలు వస్తూనే ఉన్నారు. అయితే ఈ సోమవారం నిర్వహించిన స్పందనలో అర్జీదారులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనలేదు. వ్యవసాయ పనులు మొదలవడం, వర్షం పడుతుండటంతో అర్జీదారులు తక్కువగా వచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవయింది. స్పందన ఫిర్యాదులు ఇచ్చేందుకు బయట ఎవరైనా ఉంటే లోనికి పంపించాలంటూ అధికారులు అటెండర్లతో అనడం గమనార్హం. ఇదే పరిస్థితి ఎస్పీ కార్యాలయం వద్ద కూడా కనిపించింది.

స్పందన సమస్యలను వేగంగా పరిష్కరించండి: కలెక్టర్‌

నంద్యాల టౌన్‌, ఆగస్టు 8 : స్పందనలో అర్జీదారుల నుంచి తీసుకున్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌లోని వైఎస్‌ఆర్‌ సెంటినరీ హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందిన కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌తో పాటు జేసీ నారపురెడ్డి మౌర్య, డీఆర్వో పుల్లయ్య పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 24గంటలు, 48గంటల్లో పరిష్కరించాల్సిన అర్జీలు, టాప్‌ - 4, టాప్‌ -10సర్వీస్‌లకు సంబంధించి దరఖాస్తులన్నింటినీ క్ల్లియర్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. స్పందన పోర్టల్‌లో ప్రతిరోజూ సమీక్షించుకొని సమస్యలు బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా చూడాలని చెప్పారు. రీ ఓపన్‌ కేసులు మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా శ్రద్ధ వహించాలని సూచించారు. నాడు - నేడు పథకం కింద నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు, కిచెన్‌ షెడ్లు, ప్రహరి గోడలకు సంబంధించిన బిల్లుల లావాదేవీలను ప్రతిరోజూ నమోదు చేయాలని వివిధ శాఖాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కోర్టు కేసులకు సంబంధించి ఇంటీరియం ఉత్తర్వులు, కంటెంప్ట్‌, కౌంటర్‌ పైల్‌ తదితరాలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


Updated Date - 2022-08-08T05:30:00+05:30 IST