స్పందన అంతంతే..

ABN , First Publish Date - 2022-08-09T05:32:31+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఆస్తిపన్ను వసూలు కోసం వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీం కింద ఒకేసారి బకాయిలను చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ చేస్తామని ప్రకటించింది.

స్పందన అంతంతే..

ఆస్తి పన్ను వసూలు కోసం వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీం 

అక్టోబరు 31లోగా చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ 

 కరీంనగర్‌ టౌన్‌, జూలై 16: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఆస్తిపన్ను వసూలు కోసం వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీం కింద ఒకేసారి బకాయిలను చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ పథకంతో కరీంనగర్‌ నగరపాలక సంస్థతోపాటు కొత్తపల్లి, చొప్పదండి, హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సి పాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిదారులకు లబ్ధి చేకూరనుంది. నెలరోజుల క్రితమే ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తేగా ఇప్పటి వరకు 20 నుంచి 25శాతం మంది మాత్రమే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు తెలిసింది. అక్టోబరు 31 వరకు పన్నులను ఏకమొత్తంలో చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ అవుతుందంటూ నగరపాలక సంస్థ, మున్సిపల్‌ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. గడువులోగా బకాయి పన్నులు చెల్లించి వడ్డీ మాఫీ ప్రయోజనాన్ని పొందాలని, నగర అభివృద్ధికి కృషిచేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మూడు కోట్ల వరకు ఆస్తిపన్ను బకాయిలు  ఉన్నాయి. ఏకమొత్తంలో పన్నులు చెల్లించి వడ్డీ మాఫీని ఇంటి యజమానులు వినియోగించు కుంటే నగరపాలక సంస్థకు కోటి నుంచి కోటి 50 లక్షల మేరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.


పన్ను బకాయిలను చెల్లించండి 

మేయర్‌ యాదగిరి సునీల్‌రావు 


వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీం ద్వారా ఆస్తిపన్ను చెల్లించే బకాయిదారులకు 90 శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుంది. ఆస్తి పన్ను బకాయి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ పథకం అమలులో ఉన్నపుడే బకాయిలను చెల్లిస్తే వడ్డీ భారం తగ్గుతుంది. పన్ను చెల్లించడం ద్వారా నగరపాలక సంస్థకు, నగర అభివృద్ధికి సహకరించినవారవుతారు. 

Updated Date - 2022-08-09T05:32:31+05:30 IST