స్పందన అంతంతమాత్రం

ABN , First Publish Date - 2021-03-02T06:02:37+05:30 IST

జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమైన రెండో దశ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.

స్పందన అంతంతమాత్రం

రెండో దశ కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం

60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం

ముందుకు రాని జనం

1800 మందికిగాను కేవలం 280 మంది మాత్రమే రాక

అపోహలు వీడాలని సూచిస్తున్న అధికారులు

వైరస్‌ మళ్లీ విజృంభిస్తున్నందున ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని హితవు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 


జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమైన రెండో దశ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. గత నెలన్నరగా మొదటి దశలో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. సోమవారం నుంచి రెండో విడత కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ దఫా 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందించాలని అధికారులు నిర్ణయించారు. అయితే, మొదటిరోజైన సోమవారం 1800 మందికి స్లాట్‌ ఇవ్వగా...280 మంది మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకునేందుకు వచ్చారు. నాలుగు వంతులకుపైగా వ్యాక్సినేషన్‌కు దూరంగా వుండడంపై వైద్యులు, అధికారులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల మేలే తప్ప...ఇబ్బందులు వుండవని చెబుతున్నా ప్రజలు అపోహలు వీడకపోవడం దురదృష్టకరమని పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు. 


ప్రైవేటులో జాప్యం


రెండో విడత వ్యాక్సినేషన్‌కు పలు ప్రైవేటు ఆస్పత్రులను కూడా ఎంపిక చేశారు. జిల్లాలో 45 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అనుమతులు ఇచ్చారు. ఈ కేంద్రాల్లో వ్యాక్సిన్‌ తీసుకునేవారు డోసుకు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సోమవారం సాయంత్రం వరకు అధికారులకు అందిన సమాచారం ప్రకారం జిల్లాలో ఒక్క ప్రైవేటు ఆస్పత్రిలో కూడా రెండో విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరగలేదు. ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన వుండదన్న ఉద్దేశంతో ఆయా ఆస్పత్రులు వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని చేపట్టేలేదని తెలుస్తోంది. 


అపోహలతోనే దూరం


రెండో విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మొదటిరోజైన సోమవారం వ్యాక్సిన్‌ తీసుకున్న కొద్దిమందిలోను ఉన్నత విద్యావంతులే అధికంగా వున్నట్టు అధికారులు చెబుతున్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు, రిటైర్డ్‌ వైద్యులు వంటి వారే ఎక్కువగా వున్నట్టు చెబుతున్నారు. మిగిలిన సాధారణ ప్రజానీకం ఎక్కువ మంది అపోహలతో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు దూరంగా ఉండిపోయారంటున్నారు.

Updated Date - 2021-03-02T06:02:37+05:30 IST