స్వప్నంగా మిగిలిన సంక్షేమం!

ABN , First Publish Date - 2022-02-02T06:21:10+05:30 IST

గతంలో బడ్జెట్ సమావేశాలంటే ఎంతో ఉత్కంఠ కలిగేది. ఆర్థిక మంత్రి ఒక్కో ప్రతిపాదనను ప్రకటిస్తుంటే ఆశ్చర్యం కలిగేది. దేశంలో అన్ని వర్గాలూ బడ్జెట్ కోసం ఎదురుచూసేవి...

స్వప్నంగా మిగిలిన సంక్షేమం!

గతంలో బడ్జెట్ సమావేశాలంటే ఎంతో ఉత్కంఠ కలిగేది. ఆర్థిక మంత్రి ఒక్కో ప్రతిపాదనను ప్రకటిస్తుంటే ఆశ్చర్యం కలిగేది. దేశంలో అన్ని వర్గాలూ బడ్జెట్ కోసం ఎదురుచూసేవి. అయితే ఇప్పుడు ఆ ఉత్కంఠ ఏమీ లేకుండా పోయింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో బృహత్తర నిర్ణయాలుంటాయని, తన వైఖరికి భిన్నంగా సాగు చట్టాలను వెనక్కు తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనరంజక ప్రతిపాదనలతో ముందుకు వస్తారని ఊహించిన వారికి ఆశాభంగం ఎదురైంది. ముఖ్యంగా బిజెపి నేతలే ఖిన్నులైనట్లు కనిపిస్తోంది. చూస్తూ ఉండండి.. ‘ఈ బడ్జెట్‌లో కీలక మార్పులుంటాయి. మమ్మల్నందర్నీ జనంలోకి వెళ్లి బడ్జెట్ గురించి చెప్పేందుకు సిద్ధంగా ఉండమని మోదీ గారు చెప్పారు’ అని సీనియర్ బిజెపి నాయకుడొకరు బడ్జెట్ ముందు రోజు అన్నారు. మరి ఇప్పుడు ఏ అంశాల గురించి జనంలోకి వెళ్లాలో వాళ్లే తేల్చుకోవాలి.


గత రెండేళ్లుగా పార్లమెంట్ సమావేశాలు సరిగా సాగడం లేదు. కరోనా దెబ్బకు సమావేశాలు కుంచించుకుపోగా, దాదాపు ప్రతి సమావేశంలో ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చూస్తుంటే పార్లమెంట్ సాగకపోవడం తమకే లాభమని ప్రభుత్వం భావిస్తున్నట్లు అర్థమవుతోంది. 2020 శీతాకాల సమావేశాలు కూడా సాగు చట్టాలపై రైతుల నిరసన ప్రదర్శనల మధ్య స్తంభించిపోయాయి. సాగు చట్టాలపై రాజ్యసభలో ఓటింగ్ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే బలవంతంగా ఆ బిల్లులను ఆమోదించారు. ప్రతిపక్ష సభ్యులను సభనుంచి సస్పెండ్ చేశారు. దీనితో ప్రతిపక్షాలే ఉభయ సభలను స్తంభింపచేశాయి. మొత్తం రాత్రంతా మహాత్మాగాంధీ విగ్రహం ముందు ధర్నా చేశాయి. గత సమావేశాల్లో దాదాపు 12 మంది ప్రతిపక్ష సభ్యులను సభనుంచి సస్పెండ్ చేయడంతో మొత్తం రాజ్యసభ సమావేశాలు స్తంభించిపోయాయి. నిజానికి వర్షాకాల సమావేశాల్లో జరిగిన కల్లోలానికి శీతాకాల సమావేశాలను బలి చేసిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుంది. అంతకు ముందు వర్షాకాల సమావేశాలపై పెగాసస్ నిఘా ఆవరించింది. ఇప్పుడు కూడా న్యూయార్క్ టైమ్స్ కథనం పుణ్యమా అని పెగాసస్ మళ్లీ తెరమీదకు వచ్చింది. పెగాసస్ నిఘా తమ ప్రత్యర్థులపై ప్రయోగించారన్న విషయం అందరికీ తేటతెల్లమైనా ప్రభుత్వం మాత్రం బుకాయిస్తూనే ఉంది.


నిజానికి ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు ప్రభుత్వం జవాబు చెబుతూనే పార్లమెంట్‌ను సజావుగా నడిపించే అవకాశాలున్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం గురించి బయట ప్రతిపక్షాలు ఎంత నిరసన వ్యక్తం చేసినా పార్లమెంట్‌లో గట్టి సమాధానం చెప్పి ప్రభుత్వం వారిని తిప్పిగొట్టే అవకాశాలున్నాయి. దీనివల్ల ఆసక్తికరమైన చర్చకు అవకాశం ఉన్నది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే అటు ప్రభుత్వ పక్షాన, ఇటు ప్రతిపక్షాల తరఫున సమర్థంగా మాట్లాడే నేతలు తగ్గిపోతున్నారు. గతంలో సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ రంగంలోకి దిగితే గ్యాలరీలు కిటకిటలాడిపోయేవి. ఇప్పుడు ఒక్కరు కూడా ఉండడం లేదు. ఆర్థిక సర్వేలోనే ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగిపోతున్న విషయాన్ని ప్రస్తావించారు. గత డిసెంబర్‌లో రిటైల్ రంగంలో ద్రవ్యోల్బణం 5.6 శాతం పెరిగితే, టోకు ధరల ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో 14.2 శాతం పెరిగిందని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. అదే అంశాన్ని ప్రభుత్వం వివరిస్తే అందులో తప్పేముంటుంది? కానీ పార్లమెంట్ సమావేశమయిన ప్రతిసారీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షాలను రెచ్చగొట్టడం, వారు గందరగోళం సృష్టిస్తే నెపం వారిమీదకు నెట్టివేసి తమ ఇష్టారాజ్యంగా బిల్లులను ఆమోదింపచేసుకోవడం ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా రాజ్యసభలో మైనారిటీలో ఉన్న ప్రభుత్వానికి సభ గందరగోళంలో పడితే బిల్లులను ఆమోదింపచేసుకోవడం సులభంగా మారింది. పార్లమెంటరీ ప్రమాణాల గురించి తరుచూ మాట్లాడే రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, ఎంపి కాకముందు మంచి జర్నలిస్టుగా పేరు పొందిన డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తమ కళ్లముందే సభా కార్యక్రమాలు కొట్టుకుపోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘అసలు పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీ రావాలంటేనే మనసు సహకరించడం లేదు. ఒకవైపు శీతాకాలం, వాతావరణ కాలుష్యం; మరోవైపు రాజకీయ కాలుష్యం, గడ్డకట్టినట్లున్న ప్రభుత్వాధి నేతల వైఖరి’ అని ఒక సీనియర్ రాజకీయ నాయకుడు వ్యాఖ్యానించాడు. ‘అయినా తప్పనిసరై పార్టీ రాజకీయ అవసరాలు, తన రాజకీయ భవిష్యత్ రీత్యా ఢిల్లీ రావల్సి వస్తుందని’ ఆయన అన్నారు. వారికే ఇలా ఉంటే పార్లమెంట్ కార్యకలాపాలను రిపోర్టు చేసే విలేఖరులకు, పార్లమెంట్‌కు తప్పనిసరిగా వెళ్లే అధికారులకు ఎలా ఉంటుందో ఊహించవచ్చు.


ప్రతిసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు రాష్ట్రపతి చేసే ప్రసంగం ఒక లాంఛనప్రాయమే అయినా రాష్ట్రపతి ప్రసంగాలకు ఎంతో ప్రామాణికత ఉండేది. మరో నాలుగు నెలల్లో తన పదవీకాలాన్ని పూర్తి చేసుకోబోతున్న రాంనాథ్ కోవింద్ 14వ రాష్ట్రపతిగా వెలువరించిన చివరి ప్రసంగం మొక్కుబడిగా ముగిసింది. ప్రతి రాష్ట్రపతి, తన ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించడం మామూలే కాని, ఇతర రాజకీయ నాయకులు సభలో చేసే ప్రసంగాలు, ఎన్నికల సభల్లో చేసే ప్రసంగాలకు అది భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వ గణాంక వివరాలను ప్రస్తావించడం మాత్రమే కాక, దేశ ప్రజలను చైతన్యపరిచే, వారికి ఆత్మస్థైర్యం కలిగించే, భవిష్యత్ పట్ల ప్రేరణ కలిగించే అనేక అంశాలు ఉంటాయి. కాని రాంనాథ్ కోవింద్ తన చివరి ప్రసంగంలో కేవలం గణాంక వివరాలను మాత్రమే చెప్పి మోదీ సర్కార్‌ను ఆకాశానికెత్తడానికే పరిమితమయ్యారు. బహుశా 15వ రాష్ట్రపతిగా తనను మోదీ కొనసాగించవచ్చునని ఆయన భావిస్తున్నారా? మోదీ మనసులో ఉన్నది ఆయన కేమి ఎరుక?


నిజానికి రాష్ట్రపతి ప్రసంగంలో అరకొర లెక్కలే ఉన్నాయి. ఆయన చెప్పిన విషయాలకూ ఎన్నికల సభల్లో నేతలు చెప్పుకునే అర్థసత్యాలకూ పెద్ద తేడా లేదు. ప్రభుత్వం ఇచ్చిన గణాంక వివరాలే ఆయన చదివారంటే గణాంక వివరాలు తప్ప చెప్పేందుకు ఆయన వద్ద ఏమీ లేదనట్లు కనిపిస్తోంది. నిజానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రతి సందర్భంలోనూ ఈ గణాంక వివరాలు ఉల్లేఖిస్తూనే ఉంటారు. సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారులు కూడా ఈ గణాంక వివరాలను పదే పదే వెల్లడిస్తూనే ఉంటారు. రాష్ట్రపతి ప్రసంగం అంతకంటే భిన్నంగా ఏమీ లేదు. కరోనాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న పోరాటం, వాక్సిన్, ఆరోగ్య వ్యవస్థ గురించి, ఆయుష్మాన్ భారత యోజన, జన ఔషధి కేంద్రాల గురించి చెప్పుకున్నారు. కరోనా పట్టిపీడించిన 2021–22లోనే బడ్జెట్‌ను 35 శాతం తగ్గించారు. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు ఆరోగ్యరంగానికి బడ్జెట్ పెంచితే గత ఏడాది మన ప్రభుత్వం అందులో 1400 కోట్లు తగ్గించింది. జీడీపీలో 3 శాతం ఆరోగ్య రంగానికి కేటాయించాలని ఆర్థిక సర్వే ప్రతిపాదిస్తే ఆరోగ్య బడ్జెట్ మొత్తం జీడీపీలో 1.5 శాతానికే స్తంభించిపోయింది. అంతే కాదు, అనేక ప్రజా సంక్షేమ పథకాలకు, గ్రామీణ రంగాలకు పెట్టుబడులు తగ్గిపోయాయి.


కొత్త విద్యావిధానం వల్ల ఆత్మనిర్భరత పెరిగిందని రాష్ట్రపతి చెప్పుకోవడం హాస్యాస్పదం. విద్యారంగంలో ఆత్మనిర్భరత పెరగాలంటే మంచి అధ్యాపకులను నియమించాలి, మంచి ప్రయోగశాలలను, గ్రంథాలయాలను ఏర్పర్చాలి, మంచి విశ్వవిద్యాలయాలను, కళాశాలలను ప్రారంభించాలి. అయితే మన దేశంలో కేవలం కోట్లాది రూపాయల ఫీజులు వసూలు చేసి కేవలం ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థులకు చదువు చెప్పే విశ్వవిద్యాలయాలు పెరిగాయి కానీ విద్యాప్రమాణాలు మాత్రం పెరగలేదు. కరోనా మూలంగా వేల సంఖ్యలో పాఠశాలలను మూసేశారు. ఆన్‌లైన్ కోర్సులు పూర్తిగా యాంత్రికంగా మారాయి, ఆరోగ్యరంగం మాదిరే విద్యారంగంలో ఆత్మనిర్భరత కూడా ఒక తమాషాగా మారింది. వర్తకరంగంలో ఆత్మనిర్భరత కూడా సమీప భవిష్యత్‌లో ఏర్పడే అవకాశాలు లేవు. ఎగుమతులు పెరుగుతున్నప్పటికీ అంతకంటే ఎక్కువగా దిగుమతులు కూడా పెరగడంతో వర్తకపు లోటు ౧7.94 బిలియన్‌ డాలర్లకు చేరుకోవడం గమనార్హం. నిజానికి 2022 సంవత్సరాంతంలోగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ విషయం రాష్ట్రపతి ప్రసంగంలో ఏ మాత్రం ప్రస్తావనకు రాకపోగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి బృహత్తర ప్రకటనలు ఏమీ లేవు. ఎరువుల ధరలు పెరిగినప్పటికీ సబ్సిడీకి గతంలో ఖర్చు పెట్టిన మొత్తంలో కోత పెట్టారు. దేశంలో రైతులు ఏడాదికి పైగా రోడ్డుపై కూర్చుని ఆందోళన చేసిన తర్వాత ప్రభుత్వం చట్టాలు వాపసు తీసుకుంది, రికార్డు స్థాయిలో కొన్నామని చెబుతుంది కాని ప్రతిసారీ అలా జరగదు, కరోనా సమయంలో అయిదుకిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా పంచుతున్నారు కనుక రైతుల నుంచి అధిక స్థాయిలో ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తున్నారు. కాని అదే సమయంలో రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయంలో చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ప్రభుత్వం ఉచితంగా ఆహారధాన్యాలను పంచుతున్నారని చెప్పుకున్నారు. అయితే గత ఏడాది పోషకాహారానికి బడ్జెట్‌ను 27శాతం- రూ. 37వేల కోట్లనుంచి రూ. 27వేల కోట్లకు తగ్గించారు. అంతర్జాతీయ ఆకలి సూచికలో 116 దేశాల్లో భారత్ 101వ స్థానంలో ఉన్నది. ఈ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.


కేంద్ర బడ్డెట్ ప్రగతిశీలకమని, ప్రజలకు సన్నిహితంగా ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పుకున్నారు, కాని ఏ వర్గం ప్రజలకు సన్నిహితంగా ఉన్నదో, ఎవరికి ప్రగతిశీలకమో బడ్జెట్ ప్రతిపాదనలే స్పష్టం చేస్తున్నాయి. సామాన్యులు, రైతులు, మధ్యతరగతి, నిరుద్యోగుల వరకు ఇది యథాతథ బడ్జెట్. అంటే వారి జీవితాల్లో పెద్దగా మార్పులు ఉదయించే అవకాశాలు లేవు. ప్రభుత్వ పెట్టుబడి వ్యయం పెరగడం మూలంగా అభివృద్ధి రేటు పెరుగుతుందని, నిరుద్యోగం తగ్గిపోతుందని గత కొద్ది సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నారు. సెంట్రల్ విస్టాలు, కారిడార్లతో అభివృద్ధి రేటు పెరిగి, నిరుద్యోగం తగ్గిపోతే ఈ పాటికి దేశంలో నిరుద్యోగం మాయమై ఉండాలి కదా!


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-02-02T06:21:10+05:30 IST