అమరవీరుల త్యాగాల ఫలితమే!

ABN , First Publish Date - 2022-08-16T07:21:52+05:30 IST

దేశానికి లభించిన స్వాతంత్య్రం ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమేనని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కొనియాడారు. తిరుపతి పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌లో సోమవారం ఉదయం జరిగిన జిల్లాస్థాయి తొలి స్వాతంత్య్ర దిన వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

అమరవీరుల త్యాగాల ఫలితమే!
జెండా ఆవిష్కరిస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

తిరుపతి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): దేశానికి లభించిన స్వాతంత్య్రం ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమేనని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కొనియాడారు. తిరుపతి పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌లో సోమవారం ఉదయం జరిగిన జిల్లాస్థాయి తొలి స్వాతంత్య్ర దిన వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత చేరువైందన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి గురించి అంకెలతో వివరించారు.స్వాతంత్య్ర సమరయోధుడు, తొండవాడకు చెందిన నారాయణరెడ్డి సతీమణి మునెమ్మను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అంతకు మునుపు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను  ప్రారంభించారు.వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలను ప్రదర్శించాక డాగ్‌ స్క్వాడ్‌  సహా పోలీసు శాఖకు చెందిన వివిధ విభాగాలు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించి గౌరవ వందనం సమర్పించాయి. తర్వాత ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖలకు చెందిన 485మంది అధికారులకు, ఉద్యోగులకు మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. చివరగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.కాగా స్వాతంత్ర దిన వేడుకలకు పలువురు ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు.ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు కరుణాకర రెడ్డి,చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మేయర్‌ శిరీష, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులురెడ్డి హాజరు కాగా సత్యవేడు, శ్రీకాళహస్తి, గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి గైర్హాజరయ్యారు.కలెక్టర్‌ వెంకట్రమణా రెడ్డి,జాయింట్‌ కలెక్టర్‌ బాలాజి, డీఆర్వో శ్రీనివాసరావు, కమిషనర్‌ అనుపమ అంజలి తదితర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-16T07:21:52+05:30 IST