సంపన్నులు...ఛలో సింగపూర్‌!

ABN , First Publish Date - 2021-06-20T20:37:09+05:30 IST

డబ్బుంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్‌ చేయొచ్చు. ఆయా కాలాలను బట్టి విహార యాత్రలను ఎంచుకోవచ్చు. ప్రతీ దేశానికి కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఈ కోణంలో చూస్తే ఎప్పటి నుంచో సింగపూర్‌ ధనవంతులకు స్వర్గధామంగా కనిపిస్తూనే ఉంది. ఇంతకు ముందు ప్రపంచ కు

సంపన్నులు...ఛలో సింగపూర్‌!

డబ్బుంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్‌ చేయొచ్చు. ఆయా కాలాలను బట్టి విహార యాత్రలను ఎంచుకోవచ్చు. ప్రతీ దేశానికి కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఈ కోణంలో చూస్తే ఎప్పటి నుంచో సింగపూర్‌ ధనవంతులకు స్వర్గధామంగా కనిపిస్తూనే ఉంది. ఇంతకు ముందు ప్రపంచ కుబేరులంతా సింగపూర్‌ను ఖరీదైన విహార కేంద్రంగా భావించినప్పటికీ... కరోనా తర్వాత వారిలో చాలామంది అక్కడే సెటిల్‌ అయ్యేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ తాజా పరిణామం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.


కరోనా... ధనవంతులు, పేదవారు అనే తేడాలేకుండా ప్రతీ ఒక్కరు తమ ఆశలను, ఆశయాలను, ఆలోచనలను ఒక్కసారిగా మార్చుకునేలా చేసింది. కంటికి కనిపించని ఒక సూక్ష్మాతి సూక్ష్మ జీవి నుంచి తప్పించుకునేందుకు... సురక్షిత ప్రాంతం ఎక్కడ ఉంటుందనే వెతుకులాట మొదలెట్టారు చాలామంది కుబేరులు. డబ్బు ఉండగానే సరికాదు.. సేఫ్టీగా ఉండటం ముఖ్యం అనే తత్వం బోధపడిన తర్వాత ధనవంతులు అలాంటి గమ్యస్థానాల కోసం తీవ్రంగా గాలించారు. ఈ నేపథ్యంలో వారంతా ‘ఛలో సింగపూర్‌’ అనే పల్లవిని అందుకుంటున్నారు.



ట్రెండ్‌ మొదలయ్యింది... 

కొవిడ్‌-19 తర్వాత సామాజిక, ఆర్థిక పరిణామాలను ఇటీవల ‘బ్లూమ్‌బర్గ్‌ వెల్త్‌’ అనే సంస్థ అంచనా వేసింది. ఇంతకుముందు షాపింగ్‌ కోసమో, కాసినోల్లో ఎంజాయ్‌ చేసేందుకో... విశ్రాంతి కోసమో, వైద్యం కోసమో... షార్ట్‌టర్మ్‌ డెస్టినేషన్‌గా సింగపూర్‌ను ఎంచుకునేందుకు ఇష్టపడిన ధనవంతులు... ఇప్పుడక్కడే స్థిరపడేందుకు మొగ్గుచూపు తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ ట్రెండ్‌ మొదలైనట్టుగా బ్లూమ్‌బర్గ్‌ గుర్తించింది. చాలామంది ధనవంతులు సింగపూర్‌లోనే వ్యాపారం చేసేందుకు, అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. ముఖ్యంగా ధనవంతులైన భారతీయులు, చైనీయులు, ఇండోనేషియన్లు సింగపూర్‌కు క్యూ కడుతున్నవారిలో ముందువరుసలో ఉన్నారు. 


ఎందుకు ఆకర్షిస్తోంది?

సింగపూర్‌లో ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ ప్రపంచస్థాయి వైద్యసేవలు లభిస్తాయి. మిగతా దేశాలతో పోల్చితే కరోనా మరణాలు కూడా అక్కడ తక్కువగా నమోదయ్యాయి. న్యూయార్క్‌ లాంటి ప్రపంచస్థాయి నగరాలతో పోలిస్తే కరోనా నుంచి రక్షణ ఇవ్వడంలో సింగపూర్‌ బెస్ట్‌ అని తేలింది. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఆ దేశం తీసుకున్న జాగ్రత్త వల్లే మరణాల సంఖ్య బాగా తగ్గిందని పలు గణాంకాలు తేల్చాయి. ఈ కారణంగానే కుబేరులు సింగపూర్‌లో స్థిరపడేందుకు సిద్ధపడు తున్నారని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అభివృద్ధి వెనకడుగు వేస్తుంటే... సింగపూర్‌లో మాత్రం రియల్‌ ఎస్టేట్‌ సహా గోల్ఫ్‌క్లబ్బుల్లో కూడా సభ్యత్వ నమోదు శాతం అనూహ్యంగా పెరుగుతోంది. 2019తో పోలిస్తే సింగిల్‌ ఫ్యామిలీ ఆఫీసులు రెట్టింపయ్యాయి.



ప్రైవేట్‌ జెట్‌ పార్కింగ్‌ స్థలాలకు గిరాకీ...

ఆయా దేశాల కుబేరులు తమ సొంత విమానాల్లోనే సింగపూర్‌కు వస్తుంటారు. వాటి కోసం సెలెటర్‌ ఎయిర్‌పోర్టులో కొన్నిరోజులకు ‘హ్యాంగర్‌ స్పేస్‌’ను బుక్‌ చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎయిర్‌పోర్టు ప్రైవేట్‌ జెట్‌ల కోసం పార్కింగ్‌ స్థలాలు కేటాయించ లేకపోతోంది. రెట్టింపు ధరలను వసూలు చేస్తోంది. 


కుబేరులు ఏం కోరుకుంటున్నారు?

డబ్బులు వెదజల్లితే సౌకర్యాలు సమ కూర్చేందుకు ఏ దేశమైనా సిద్ధమవుతుంది. కుబేరులంతా తమ దేశానికి క్యూ కడుతుంటే సింగపూర్‌ కూడా అందుకు తగ్గ సన్నాహాలు చేస్తూ వారికి సకల సౌకర్యాల కల్పనలో బిజీగా ఉంది. ఒక్క భోజనానికి సుమారు 75 వేల రూపాయలు వసూలు చేసే లగ్జరీ హోటల్స్‌ వెలుస్తున్నాయి. 3,500 మంది కొత్త సభ్యులతో పలు వైన్‌ క్లబ్‌లు నవంబర్‌లో ప్రారంభోత్స వానికి సిద్ధం అవుతున్నాయి. ప్రైవేట్‌ బ్యాంకులు కొత్త ఖాతాదారులకు స్వాగతం పలుకుతున్నాయి. ఆయా బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తున్న వారిలో చైనీయులే ఎక్కువగా ఉంటున్నారు. ‘యుబిఎస్‌’ ఇటీవలే 3 వేల మంది సిబ్బందితో సింగపూర్‌లో కొత్త కార్యాల యాన్ని కూడా ఏర్పాటుచేసింది. అక్కడి ప్రసిద్ధ సెంటోసా గోల్ఫ్‌ క్లబ్‌ విదేశీయులకు సభ్యత్వ రుసుమును 5 లక్షల డాలర్లుగా నిర్ణయించింది. గతంతో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. ప్రీమియం కార్లు కొంటున్న విదేశీయులు రోజురోజుకు పెరుగుతున్నారని ‘బ్లూమ్‌బర్గ్‌ వెల్త్‌’ సర్వేలో తేలింది. బెంట్లీ, రోల్స్‌రాయిస్‌ లాంటి లగ్జరీ కార్లు గత ఏడాది 1,300 అమ్ముడయ్యాయి. 2013 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఖరీదైన కార్ల అమ్మకాలు జరగడం ఇదే మొదటిసారి. మరో 70 కార్లకు కూడా అప్పుడే ఆర్డర్లు కూడా వచ్చాయి. 


సుమారు 60 లక్షల జనాభా ఉన్న ఈ చిన్న, సంపన్న దేశంలో సుఖంగా, సురక్షితంగా జీవిం చొచ్చని ధనవంతులు భావిస్తున్నారు. పైగా స్థానికంగా వ్యాపారం చేసేందుకు కేవలం 13.8 కోట్లు పెట్టుబడిగా పెడితే చాలు ఫాస్ట్‌ట్రాక్‌లో శాశ్వత పౌరసత్వం ఇచ్చేందుకు సింగపూర్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే కాబోలు ... అందరూ ‘ఛలో సింగపూర్‌’ అంటున్నారు. 


Updated Date - 2021-06-20T20:37:09+05:30 IST