సరైన మార్గం

ABN , First Publish Date - 2022-04-22T05:32:43+05:30 IST

ఇది పరీక్షల కాలం. సంవత్సరమంతా నిర్లక్ష్యంగా, సోమరితనంతో గడిపిన

సరైన మార్గం

ఇది పరీక్షల కాలం. సంవత్సరమంతా నిర్లక్ష్యంగా, సోమరితనంతో గడిపిన వారు హడావిడి పడుతూ ఉంటారు. కొందరు విద్యార్థులు నిద్రాహారాలు మాని... అదే పనిగా పగలూ, రాత్రీ పుస్తకాలను పిండి చెయ్యాలని పరిశ్రమిస్తూ ఉంటారు. ఇంకొందరు విద్యార్థులు సోమరితనాన్ని ఇంకా వదలకుండా... అడ్డదారుల కోసం ఆత్రంగా ఆయాసపడతారు. మరికొందరు ఎప్పటిలాగానే... తమ రోజువారీ కార్యక్రమం ప్రకారం... తగినంత చదువుతూ, తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఇది కేవలం చదువుకొనే విద్యార్థులకే కాదు, వివిధ రంగాల్లో పని చేసేవారందరికీ వర్తిస్తుంది. 


బుద్ధుడి కాలంలో కూడా ఇలాంటి భిక్షువులు ఉండేవారు. కొందరు సోమరుల్లా తిని కూర్చొనేవాళ్ళు. ఆరామాలు వదిలి వెళ్ళేవారు కాదు. ఇంకొందరు ధర్మాన్ని త్వరత్వరగా అందరికీ చేర్చాలని అహోరాత్రులూ తిరుగుతూ శ్రమించేవారు. ఈ ఇద్దరు చేసేదీ సరైనది కాదన్నాడు బుద్ధుడు. అతిగా శ్రమ పడేవాడు అనారోగ్యం పాలై, త్వరలోనే మంచం పడతాడు. పరీక్షల కాలంలో పగలూ రాత్రీ నిద్ర మాని చదివేవారు కూడా అనారోగ్యం పాలవుతారు లేదా పరీక్ష హాల్లో కునుకు తీస్తూ ఉంటారు. కాబట్టి తగినంత పరిశ్రమ చెయ్యాలి, తగినంత విశ్రాంతి పాటించాలి. దీన్నే ‘మధ్యే మార్గం’ అంటాడు బుద్ధుడు. ‘ధమ్మం’ అనే రథానికి శీలం (మంచి నడవడిక) ఒక ఇరుసు అయితే... ‘మధ్యమ మార్గం’ అనేది ఆ రథాన్ని నడిపే పోలు (కొయ్య) లాంటిది. ఇదే విషయం మీద ఆ రోజుల్లో... బుద్ధుడితో రాజగృహ నగరానికి చెందిన సింహుడు అనే ఒక సంగీత విద్వాంసుడు చర్చించాడు.


అప్పుడు బుద్ధుడు... ‘‘సింహా! నీవు ఈ నగరంలోనే గొప్ప వైణికుడివి. వీణను వాయించడంలో మేటివి. నీ వీణకు ఉన్న తీగలు వదులు వదులుగా ఉన్నాయనుకో. నాదం పుడుతుందా?’’ అని అడిగాడు.

‘‘భగవాన్‌! పుట్టదు’’ అన్నాడు సింహుడు. 

‘‘మరి ఆ తీగలనే చాలా గట్టిగా బిగించావనుకో... ఏమవుతుంది?’’ అని ప్రశ్నించాడు.

‘‘భగవాన్‌! నాదం పుడుతుంది. కానీ మీటుతూ ఉంటే తీగలు తెగిపోతాయి’’ అని బదులిచ్చాడు.

‘‘సింహా! నాదం పుట్టడానికి తీగలను ఎంత వరకూ బిగించాలో అంతవరకే బిగించావనుకో. అప్పుడు...’’

‘‘అప్పుడు అతి మధురమైన నాదం పుడుతుంది. మనకు కావలసిన రాగం పలుకుతుంది. వీణ వీణగా ఉంటుంది’’ అన్నాడు సింహుడు.



‘‘వీణ అయినా అంతే... మనిషైనా అంతే! ఏ విషయంలోనైనా మనం ఆ చివరకో, ఈ చివరకో పోయి... అక్కడే అంటిపెట్టుకొని ఉండకూడదు. మనం మధ్యలో... మధ్యమ మార్గంలో ఉండాలి. అదే సరైన మార్గం’’ అని చెప్పాడు బుద్ధుడు.

బుద్ధుడి ఈ ఉపదేశం సర్వమానవాళికీ సర్వకాల సర్వావస్థలలో శిరోధార్యం.



అతిగా శ్రమ పడేవాడు అనారోగ్యం పాలై, త్వరలోనే మంచం పడతాడు. పరీక్షల కాలంలో పగలూ రాత్రీ నిద్ర మాని చదివేవారు కూడా అనారోగ్యం పాలవుతారు లేదా పరీక్ష హాల్లో కునుకు తీస్తూ ఉంటారు. కాబట్టి తగినంత పరిశ్రమ చెయ్యాలి.

 బొర్రా గోవర్ధన్‌



Updated Date - 2022-04-22T05:32:43+05:30 IST