రోడ్డు రాసిచ్చేశారు!

ABN , First Publish Date - 2021-10-03T06:52:03+05:30 IST

ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన గెలాక్సీ గ్రానైట్‌కి చీమకుర్తి మండలం పుట్టినిల్లు. మరెక్కడా ఇది లభించదు. దీంతో మూడున్నర దశాబ్దాల్లో గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాల విక్రయం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని గడించటంతోపాటు అనేకమంది కుబేరులయ్యారు.

రోడ్డు రాసిచ్చేశారు!
ఏపీఎండీసీకి అప్పగించిన కర్కూల్‌రోడ్డు ఇదే

విలువైన గెలాక్సీపై గూడుపుఠానీ 

ఆ భూమి లీజుపై అత్యున్నత స్థాయిలో పథకం 

నాలుగు నెలలక్రితం ఐదు కీలక లీజులు మంజూరు

నేతల అస్మదీయులకే దక్కిన వైనం 

ప్రత్యామ్నాయ రహదారిపై లేని స్పష్టత 

రామతీర్థం పుణ ్యక్షేత్రం దారి మూత 

జిల్లాలో గ్రానైట్‌ నిక్షేపాల విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. ఓ వైపు ఖజానాకు ఆదాయం పెంచడం అని చూపుతూ మరోవైపు విలువైన నిక్షేపాలున్న ప్రాంతాన్ని అస్మదీయులకు కట్టబెట్టేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే అనాదిగా చీమకుర్తి వద్ద గెలాక్సీ క్వారీల మధ్య ఉన్న కర్నూలు-ఒంగోలు (ఆర్‌అండ్‌బీ) రహదారిని మైనింగ్‌ అభివృద్ధి కార్పొరేషన్‌కి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా టెండర్లను ఆహ్వానించి ఆ ప్రాంతాన్ని ఆయా సంస్థలకు లీజుకిచ్చే అధికారం ఏపీఎండీసీకి కట్టబెట్టింది. అయితే ప్రత్యామ్నాయ రహదారిపై ఇంత వరకూ స్పష్టతనివ్వలేదు.  పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థం దేవాలయం వద్దకు వెళ్లేమార్గం మూసుకుపోతున్నా ఆ విష యాన్ని ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదే సమయంలో ఈ రహదారి వెంబడి ఉన్న క్వారీల యజమా నుల నుంచి మరికొంత భూమిని లాక్కునే ప్రయత్నాలకు శ్రీకారం పలికారు. ఈ నేపథ్యంలోనే నాలుగు నెలల క్రితం కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న కొంత భూమి లీజులను ఐదు సంస్థలకు కట్టబెట్టగా, వాటిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అధికారపార్టీ ముఖ్యనేతలకు సంబంధాలు ఉండటం విశేషం. దీంతో తాజాగా ఆర్‌అండ్‌బీ రోడ్డుని మైనింగ్‌ కార్పొరేషన్‌కి బదలాయించటం వెనక ఉన్నత స్థాయిలో కుట్ర దాగి ఉందన్న  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన గెలాక్సీ గ్రానైట్‌కి చీమకుర్తి మండలం పుట్టినిల్లు. మరెక్కడా ఇది లభించదు. దీంతో   మూడున్నర దశాబ్దాల్లో గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాల విక్రయం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని గడించటంతోపాటు అనేకమంది కుబేరులయ్యారు. వేలా ది మంది కార్మికులకు అదే ఉపాధిగా మారింది. ఒక రకంగా రాజకీయాల్లో రాటుదేలేందుకు లేక, రాటుదేలిన వారికి ఆదాయవనరుగా ఈ పరిశ్రమ మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రానైట్‌ పరిశ్రమపై ప్రత్యేక దృష్టిసారించటం, అనేక అంశాలలో పరిశ్రమకు గడ్డుపరిస్థితులు ఎదురుకావటం జరిగింది. ఈ దశలో గ్రానైట్‌ క్వారీల మధ్య ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారిని మైనింగ్‌ జోన్‌ కింద ప్రకటించి మైనింగ్‌ కార్పొరేషన్‌కి ఇవ్వటం, ప్రత్యామ్నాయ రహదారి చూపకపోవడం, చీమకుర్తి పుణ్యక్షేత్రానికి మార్గంపై స్పష్టతనివ్వక పోవటం, ప్రభుత్వ భూమిలో క్వారీయింగ్‌ లీజులు పొందటంలో ఇప్పటికీ ఉన్నతస్థాయి నుంచి పావులు కదుపుతున్న నేపథ్యంతో మున్ముందు పరిస్థితిపై గ్రానైట్‌ వర్గాలలోనే గాక ఆ ప్రాంతంలోని యావత్తు ప్రజానీకంలో ఆందోళన నెలకొంది. 


ఆర్‌అండ్‌బీ రోడ్డు బదలాయింపు 

ఒంగోలు-కర్నూలు రోడ్డులో చీమకుర్తి నగర పంచాయతీ దాటిన తర్వాత సాగర్‌, కారుమంచి బ్రాంచ్‌ కెనాల్‌ అవతల వైపు నుంచి గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాల ప్రాంతం ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి బూదవాడ గ్రామపరిధిలోని కంకర మిల్లుల వరకు రహదారికి ఇరువైపులా భూముల్లో గెలాక్సీ నిక్షేపాలున్నాయి. ఈ మధ్యలో ప్రభుత్వ పరిధిలో ఉన్న ఒంగోలు జాతి పశు క్షేత్రాన్ని గతంలో వేరే చోటుకు తరలించి ఆ ప్రాంతాన్ని రాష్ట్ర మైనింగ్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ)కి గతంలో అప్పగించారు. గ్రానైట్‌ క్వారీల మధ్యలో ఉన్న ఒంగోలు - కర్నూలు రహదారి పరిధిని కూడా నిక్షేపాల వెలికితీతకు కేటాయించాలన్న ప్రతిపాదన గతం నుంచి ఉంది. అయితే వచ్చే ఆదాయం కన్నా ప్రజల అవసరాలు, ప్రస్తుతం ఉన్న పరిశ్రమ రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రతిపాదన అమలులో ప్రభుత్వాలు వెనకడుగు వేశాయి.  వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి  పాలనలో కూడా ఈ విషయంపై ఉన్నతస్థాయిలో చర్చ జరిగినా అడుగుముందుకు పడలేదు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంతోపాటు జిల్లాలో భూగర్భవనరులు ప్రత్యేకించి గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించించింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ లీజులున్న వారిని తప్పించేసి కొత్తగా తమకు కావాల్సిన వారికి లీజులు ఇచ్చుకునే ప్రక్రియకు పరోక్షంగా రాష్ట్రప్రభుత్వం శ్రీకారం పలికింది. ఈ నేపథ్యంలోనే ఆర్‌అండ్‌బీ రహదారిపై కొందరి దృష్టిపడి అది పాలక పెద్దల వరకు చేరింది. వారి ఆదేశాలతో ఆగమేఘాలపై మొత్తం విషయాన్ని పరిశీలించిన అధికారులు ఆర్‌అండ్‌బీ రహదారి స్వాధీనం చేసుకుని నిక్షేపాల వెలికితీతకు లీజులు మంజూరు చేస్తే ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని సూచించారు. వివిధ చర్యల అనంతరం మూడు నాలుగు మాసాల క్రితం ప్రభుత్వంలోని కొందరు పెద్దలు దీనిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. సుమారు ఐదారు కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్డు పరిధిలో గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయని నిగ్గుతేల్చారు. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం ఆ రోడ్డు మార్గాన్ని మైనింగ్‌ కార్పొరేషన్‌కి ధారాదత్తం చేసే చర్యలకు శ్రీకారం పలికింది. పాలనలో ముఖ్యుల ఆదేశాలు ఉండటంతో నెల, నెలన్నర లోనే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చీమకుర్తి దాటిన తర్వాత సాగర్‌ ఒంగోలు బ్రాంచ్‌ కెనాల్‌ కూడా దాటిన తర్వాత కారుమంచి మేజరు కాలువ ఉంటుంది. అక్కడి నుంచి అంటే ఆర్‌అండ్‌బీ 24వ కిలోమీటరు నుంచి నాలుగు కిలోమీటర్ల పొడవుగల రోడ్డుని మైనింగ్‌ కార్పొరేషన్‌కి అప్పగించారు. అంటే అక్కడి నుంచి రామతీర్థం సెంటర్‌ దాటిన తర్వాత కంకర మిల్లులు ప్రారంభయ్యే చోటు వరకు రోడ్డు మొత్తం ఏపీఎండీసీ పరిధిలోకి చేరింది. 


స్థానిక కంపెనీలపై ఒత్తిడి 

 ఈ రోడ్డుమార్గానికి ఒకవైపున పలు కంపెనీలు క్వారీ లను నిర్వహిస్తున్నాయి. ఈ రోడ్డుకి ఎడమవైపున మధు కాన్‌, సదరన్‌, వీరభద్ర, ఆనంద్‌, కృష్ణసాయి ఆ తర్వాత కృష్ణసాయి సంస్థలోని భాగస్తులకే సంబంధించిన మణి కంఠ, ఇంకా ముందుకెళ్తే వీవా లాంటి కొన్ని కంపెనీలు గ్రానైట్‌ క్వారీలను నిర్వహిస్తున్నాయి. ఆ తర్వాత సుమా రు 50ఎకరాల స్థలం వివాదంలో ఉంది. కాగా సమీప గ్రానైట్‌ క్వారీల యజమానులను వారి క్వారీల పరిధిలో రోడ్డువైపు ఉన్న స్థలాన్ని మైనింగ్‌ కార్పొరేషన్‌కి ఇవ్వాలని కూడా ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అధికారపార్టీకి అనుగుణంగా నడిచే ఒక సంస్థ యజమాని పెద్దల మౌఖిక ఆదేశాలకు అనుగుణంగా ఈ క్వారీల భూమిని కార్పొరేషన్‌కి ధారాదత్తం చేసేందుకు అనుగుణ ంగా రాయబారం కూడా నడిపినట్లు సమాచారం. 


ఈ దశలోనే ఐదు లీజులు మంజూరు

ఈ తతంగం నడుస్తున్న దశలోనే ఏపీఎండీసీ తన పరిధిలో ఉన్న భూమికి సంబంధించి క్వారీల నిర్వహ ణకు ఐదు లీజులు మంజూరు చేయటం విశేషం. సుమారు 50ఎకరాలకుపైగా ఉన్న భూమిలో క్వారీయింగ్‌కి ఐదు సంస్థలకు నాలుగు మాసాల క్రితం లీజులు మంజూరయ్యాయి. ఈ ఐదు లీజులలో కూడా అధికార పార్టీకి చెందిన పెద్దల భాగస్వామ్యం పరోక్షంగా లేక ప్రత్యక్షంగా ఉంది.  ఈ నేపథ్యంలో తాజాగా ఏపీఎండీసీకి బదలాయించిన ఆర్‌అండ్‌బీ రహదారి పరిధిలోని లీజుల వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుంది, ఉన్నతస్థాయిలో జరుగుతున్న ప్రణాళిక అనుగుణంగానే ముందుకు సాగుతుందా అన్నది చర్చనీయాంశమైంది.


 పుణ ్క్షత్రానికి వెళ్లే రోడ్డు మూత

చీమకుర్తి నుంచి మూడు, మూడున్నర కిలోమీటర్ల దూరంలో రామతీర్థం ప్రారంభ మవుతుంది. అక్కడి నుంచి ఉత్తరం వైపు వెళ్తే ఆలయం వస్తుంది. నిత్యం భక్తులు తరలివచ్చే ఈ పుణ్యక్షేత్రంలో ఏడాదిలో ఒకసారి ప్రత్యేక ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ గెజిట్‌ ప్రకారం నాలుగు కిలోమీటర్ల రోడ్డుని మైనింగ్‌కి ఇస్తే రామతీర్థం రహదారి మూతపడుతుంది. చీమకుర్తికి తూర్పు వైపున ఉన్న గ్రామాలు సంతనూతలపాడు మండలం, ఒంగోలు ప్రాంతం వారు రామతీర్థంకు వెళ్లే దారే ఉండదు. రామతీర్థం ఉత్సవాలకు చీమకుర్తి నుంచి ప్రతి సంవత్సరం భక్తులు ఏర్పాటు చేసుకునే ప్రభలు అక్కడికి వెళ్లేందుకు కూడా మార్గం ఉండదు. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ రహదారికి ప్రత్యామ్నాయం చూస్తున్న అధికారుల ప్రణాళికలో రామతీర్థం  ప్రస్తావన కూడా ఉన్నట్లు లేదు. దీంతో క్షేత్రాన్ని ప్రభుత్వం విస్మరిస్తుందా లేక  రహదారిని నిర్మిస్తుందా అన్నది వేచిచూడాలి.


ప్రత్యామ్నాయంపై రాని స్పష్టత 

రోడ్డును మూసివేస్తే ఒంగోలు - కర్నూలు రహదారికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గం ఏమిటనే విషయంపై ప్రభుత్వంలో స్పష్టత లేకపోవటం విశేషం. ఇప్పటికే ఉన్న బైపాస్‌లో ఒక పాయింట్‌ నుంచి మార్గాన్ని మార్చి ఆర్‌ఎల్‌ పురం, బూదవాడకు దక్షిణంగా మర్రిచెట్లపాలెం వరకు బైపాస్‌ రోడ్డు నిర్మించే ఒక ప్రతిపాదనను ఆర్‌అండ్‌బీ అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అందుకు కూడా భారీగా వ్యయం అవుతుందన్న అంచనాను కూడా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తక్కువవ్యయంతో ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో చూడమని కూడా ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ప్రత్యామ్నాయ రహదారిపై జిల్లాలోని అధికారులు కిందామీదా పడుతున్నారు. 


Updated Date - 2021-10-03T06:52:03+05:30 IST