మాంద్య భారత్‌కు మార్గాంతరం

ABN , First Publish Date - 2020-03-24T06:05:58+05:30 IST

అంటువ్యాధులు మనుషులనే కాదు, ఆర్థిక వ్యవస్థలనూ అవస్థల పాలు చేస్తాయి. కరోనా మహమ్మారి ఇందుకు ఒక తాజా తార్కా ణం. దేశ ఆర్థిక వ్యవస్థపై ఇది పెను ప్రభావాన్ని చూపి, మన ఆర్థిక జీవనానికి భారీ నష్టం కలిగించనున్నది....

మాంద్య భారత్‌కు మార్గాంతరం

కరోనా కల్లోలం మనకు ఒక సువర్ణావకాశాన్ని కల్పించింది. ఆర్థిక వ్యవస్థల ప్రపంచీకరణలో పరిపూర్ణ భాగస్వామి కావాలనే ఆరాటంలో మనం గత రెండు దశాబ్దాలుగా అనుసరించిన తప్పుడు విధానాలను ఇప్పటికైనా త్యజించాల్సిన అవసరమున్నది. ఇందుకు మనం కరోనా సంక్షోభాన్ని సద్వినియోగం చేసుకోవాలి.


అంటువ్యాధులు మనుషులనే కాదు, ఆర్థిక వ్యవస్థలనూ అవస్థల పాలు చేస్తాయి. కరోనా మహమ్మారి ఇందుకు ఒక తాజా తార్కా ణం. దేశ ఆర్థిక వ్యవస్థపై ఇది పెను ప్రభావాన్ని చూపి, మన ఆర్థిక జీవనానికి భారీ నష్టం కలిగించనున్నది. విదేశీ పర్యాటకుల రాక ఇప్పటికే తగ్గిపోయింది. త్వరలోనే పూర్తిగా తగ్గిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మన ఎగుమతులు తీవ్ర ఒత్తిళ్ల నెదుర్కొంటున్నాయి. ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ మొదలైన దేశీయ పరిశ్రమలు చైనా నుంచి ఆటో విడి భాగాలు, ముడి పదార్థాలను దిగుమతి చేసుకోలేక పోతున్నాయి. తత్కారణంగా ఈ పరిశ్రమలు సమీప భవిష్యత్తులోనే తీవ్ర సమస్యలను ఎదుర్కోవలసిరావడం ఖాయం. మరి మార్గాంతరమేమిటి? దిగుమతి ప్రత్యామ్నాయమే (ఇంపోర్ట్ సబ్ స్టిట్యూషన్ - స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా విదేశీ దిగుమతులను తగ్గించుకునే విధానం). ఇదొక ఆదర్శ పరిష్కారం. మరి స్వదేశీ ఉత్పత్తులు పెంచుకోవాలంటే దేశీయ పరిశ్రమల్లో మదుపులు భారీగా చేయాలి. కరోనా కల్లోలం కారణంగా చైనా నుంచి మనం దిగుమతి చేసుకోలేక పోతున్న ఆటోమొబైల్స్ విడి భాగాలు, ముడి రసాయనాలను దేశీయంగా తయారు చేసే పరిశ్రమలను అభివృద్ధిపరచాలి. ఇందుకు అవసరమైన పెట్టుబడులు వాటికి సమకూరేందుకు ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పడాలి. 


ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో మన దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన స్థాయిలో ఏకీకరణ అయింది. ఈ భాగస్వామ్యాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ఇందుకు, కరోనా కల్లోలాన్ని మనం ఒక అవకాశంగా మార్చుకోవాలి. మన ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేకుండా చేసుకోవాలి. అంతేకాక భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారుల ప్రభంజనాలే కాకుండా యుద్ధాలు, సునామీలు మొదలైన విపత్తుల పర్యవసానాలను సైతం సమర్థంగా ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధమవ్వడం చాలా ముఖ్యం. ఇదే సమయంలో దేశీయ, విదేశీ కార్పొరేట్ సంస్థల నుంచి మన సూక్ష్మ, చిన్న తరహా, మధ్యతరహా పరిశ్రమలను పరిరక్షించేందుకు కూడా మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తీరాలి. ఇది ఏకకాలంలో రెండు ప్రభావాలను నెరపుతుంది. ఒకటి- మన ఆర్థిక వ్యవస్థను ప్రపంచ సరఫరాల పరంపర నుంచి వేరుపరచి, భవిష్యత్తులో అలాంటి నష్ట దాయక పరిణామాల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. రెండు- అది ఉద్యోగిత, డిమాండ్‌ను సృష్టిస్తుంది- ముఖ్యంగా సూక్ష్మ, చిన్న తరహా, మధ్యతరహా పరిశ్రమల రంగంలో. అప్పుడే మనం స్వయం సంపూర్ణ ఆర్థికాభివృద్ధి నమూనాను అనుసరించ గలుగుతాము.


నిజానికి దిగుమతి ప్రత్యామ్నాయ విధానం మన ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి వ్యయాల పెరుగుదలకు దారితీస్తుంది. అంతర్జాతీయ విపణిలో ఒక విద్యుత్ బల్బు రూ.100కే లభిస్తుంది. అదే విద్యుత్ బల్బును మన దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రూ.125 ఖర్చుతో ఉత్పత్తి చేస్తాయి. ఉత్పత్తి వ్యయం అధికమే అయినప్పటికీ, మనకొక సానుకూలత సమకూరుతుంది. భవిష్యత్తులో మనకు సదరు సరుకుల సరఫరాలకు అంతరాయమేర్పడదు. ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి సంక్షోభాలు సంభవించినా మన స్వయం సంపూర్ణ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ప్రమాదం వాటిల్లదు. రెండో ప్రభావం దేశీయ పరిశ్రమల్లో ఉద్యోగాల సృష్టి వల్ల కార్మికుల ఆదాయం పెరుగుతుంది. సహజంగా వారి కొనుగోలు సామర్థ్యమూ అధికమవుతుంది. కొనుగోళ్ళ పెరుగుదల అనివార్యంగా మార్కెట్‌లో మరింత డిమాండ్‌ను సృష్టిస్తుంది. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని దిగుమతుల పైన ప్రభుత్వం సుంకాలు పెంచాలి. తద్వారా దేశీయ ఉత్పత్తికి ప్రేరణ కలిగించాలి. అదే సమయంలో, అధునాతన సాంకేతికతలను సమకూర్చుకునేందుకు చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనివ్వాలి. ఇది జరిగినప్పుడే కాలం చెల్లిన సాంకేతికతల గుదిబండలను మనం వదిలించుకోగలుగుతాము.


మన పరిశ్రమలు అధునాతన సాంకేతికతలను సమకూర్చుకునేందుకు వీలుగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు టి ఓ) నుంచి మన దేశం వైదొలగడమే మంచిదని నేను భావిస్తున్నాను. వివిధ రంగాల అభివృద్ధికి దోహదం చేసే అధునాతన సాంకేతికతలను సృష్టించాలని ప్రతిష్టాత్మక ‘వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనా మండలి’ (సి ఎస్ ఐ ఆర్), ‘భారత వ్యవసాయ పరిశోధనా మండలి’ (ఐ సి ఎ ఆర్), భారత వైద్య పరిశోధనా మండలి (ఐ సి ఎమ్ ఆర్) ప్రయోగ శాలలు, విశ్వవిద్యాలయాలను ప్రభుత్వం ఆదేశించాలి. దిగుమతి ప్రత్యామ్నాయ వస్తువులకు బదులు దేశీయంగా తయారైన సరుకులకు మనం ప్రాధాన్యమివ్వాలి. ఈ దిశగా ప్రభుత్వ వ్యయాల పెరుగుదల కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు తోడ్పడుతుంది. అంతేగాక భావి ఆర్థిక పురోతికి పునాది అవుతుంది.


ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని నేను కోరడం లేదు. మీరు పొరపాటున కూడా అలా అర్థం చేసుకోకూడదు. ప్రపంచీకరణ ప్రక్రియ నుంచి వైదొలగడం కాకుండా నేను కోరుతున్నదల్లా పరిమిత స్థాయిలో మాత్రమే భాగస్వాములం కావాలన్నదే నా వాదన. విశ్వ ఆర్థిక వ్యవస్థ నుంచి ఉపసంహరించుకున్నప్పటికీ మనం ఇంకా సాప్ట్ వేర్ మొదలైన సేవల ఎగుమతిని కొనసాగిస్తాం. అలాగే ఫాస్ఫేట్, ఎరువులు, వంటనూనెలు మొదలైన వాటిని దిగుమతి చేసుకుంటాం. ఈ ఎగుమతి దిగుమతులు అనివార్యం. అయితే మనం దేశీయంగా ఉత్పత్తి చేయగల విద్యుత్ బల్బులు మొదలైన వాటి విషయంలో విదేశీ వాణిజ్య లావాదేవీలను తగ్గించుకోవాలి. మన దేశంలో సదరు వస్తువుల ఉత్పత్తి వ్యయం ఎంత అధికంగా ఉన్నప్పటికీ వాటిని మనం విదేశాల నుంచి ఎట్టి పరిస్థితులలోనూ దిగుమతి చేసుకోకూడదు గ్లోబల్ మార్కెట్లలో గట్టి పోటీ నిచ్చేందుకు మన ఎగుమతిదారులకు రాయితీల రూపేణా ఆర్థిక సహాయమందించాలి. అధిక దిగుమతి సుం కాల నుంచి ఆర్జించిన ఆదాయంలో కొంత భాగాన్ని ఎగుమతి సబ్సిడీలు చెల్లించడానికి వినియోగించాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే మనం మన తలుపులు మూసేసుకుని, కొన్ని నిర్దిష్ట కిటికీలు మాత్రమే తెరవాలి.


గత నెలలో సెన్సెక్స్ బాగా పడిపోయింది. అది ఇప్పటికీ స్వేచ్ఛా పతనంలోనే వున్నది. అయితే దీని గురించి భయపడవలసిన అవసరం లేదు. గత కొద్ది సంవత్సరాలుగా స్థూల దేశియోత్పత్తి వృద్ధిరేటు తగ్గిపోతుండగా సెన్సెక్స్ మహా జోరుగా వుంటోంది. కారణమేమిటి? ఆర్థిక వ్యవస్థ మొత్తంగా కుంచించుకు పోతున్నా కార్పొరేట్ కంపెనీలు లాభాలను ఆర్జిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ సంకోచం వృద్ధి రేటు తగ్గుదలకు, కార్పొరేట్ సంస్థల లాభాలు సెన్సెక్స్ పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇప్పుడు మనం ఈ ప్రక్రియను తలకిందులు చేయాలి. అధిక జీడీపీ వృద్ధిరేటు, సెన్సెక్స్ తగ్గుదలకు దారితీసే విధానాలను మనం అనుసరించాలి. సూక్ష్మ, చిన్న తరహా, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా దీన్ని సాధించవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యేందుకు ఆర్థిక వ్యవస్థల ప్రపంచీకరణ (ఇది, నిజంగా ఆవశ్యకమని నేను భావించడం లేదు) లో పరిపూర్ణ భాగస్వామి కావాలనే ఆరాటంలో మనం గత రెండు దశాబ్దాలుగా అనుసరించిన తప్పుడు విధానాలను త్యజించాల్సిన అవసరమున్నది. ఇందుకు, కరోనా కల్లోలం మనకు ఒక సువర్ణావకాశాన్ని కల్పించిందనడంలో సందేహం లేదు. మరి మనం ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలి.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2020-03-24T06:05:58+05:30 IST