ముగిసిన నామినేషన్ల పర్వం

ABN , First Publish Date - 2021-02-24T05:59:51+05:30 IST

నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు చివరి రోజు భారీగా 28 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 16న నా మినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, మంగళవారంతో ముగిసింది. మొత్తం 76 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

ముగిసిన నామినేషన్ల పర్వం
నామినేషన్‌ సందర్భంగా నల్లగొండ కలెక్టరేట్‌ వద్ద సందడి

ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీకి 76 మంది ఆసక్తి

చివరి రోజు 28 నామినేషన్లు దాఖలు

నేడు పరిశీలన, 26న ఉపసంహరణ


నల్లగొండ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు చివరి రోజు భారీగా 28 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 16న నా మినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, మంగళవారంతో ముగిసింది. మొత్తం 76 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన జరగనుండగా 26వ తేదీన ఉపసంహరణ ఉంటుంది. బరిలో మిగిలేది ఎవరో 26వ తేదీ సాయంత్రానికి తేలనుంది. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 30 నామినేషన్లు దాఖలుకాగా, 22 మంది బరిలో నిలిచారు. కాగా, ఈమారు పెద్దల సభ ఎన్నిక సాధారణ ఎన్నికలను మరిపించేలా నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా ఓటర్ల నమోదు మొదలు, ప్రచారం, భారీ ర్యాలీలు, డప్పు చప్పులు, కళాకారుల ఆటపాటలు, బైక్‌, కార్‌ ర్యాలీలు, రోడ్‌ షోలు, అన్ని ప్రధాన పార్టీలు బరిలో ఉండటం, ఆయా పార్టీల కీలక నేతలు నల్లగొండ నడివీధుల్లో కవాతు, బహిరంగ సభల్లో మాటల తూటాలు పేల్చడం సాధారణ ఎన్నికలను తలపించింది. గత ఎన్నికలో 2.50లక్షల మంది ఓటర్లు కాగా, 1.50 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి 5లక్షల మంది ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు. గత ఎన్నికల్లో 30 నామినేషన్లు దాఖలు కాగా ఈసారి 76 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు.  చివరి రోజు అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి, సీపీఎం బలపరిచిన సీపీఐ అభ్యర్థి జయసారధిరెడ్డి భారీ ర్యాలీ నడుమ నామినేషన్లు వేశారు. పల్లా నామినేషన్‌ సందర్భంగా మూడు జిల్లాలకు చెందిన మంత్రులు జగదీ్‌షరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌, మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌తో పాటు పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఉదయాన్నే మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాసానికి పల్లా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. నామినేషన్‌కు ముందే సభ నిర్వహించారు. జయసారధిరెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి సీపీఎం, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్ములు తమ్మినేని వీరరఽభదం, చాడా వెంకటరెడ్డి హాజరయ్యారు.మూడు జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు హాజరు కాగా, నామినేషన్‌ అనంతరం సభ నిర్వహించారు. స్వత్రంత్ర అభ్యర్థి సూదగాని హరిశంకర్‌గౌడ్‌ సోమవారం భారీ వాహన ర్యాలీతో నామినేషన్‌ వేయగా, మంగళవారం తన అనుచరులతో కలసి రెండో సెట్‌ దాఖలు చేశారు. ఒకే సమయంలో కలెక్టరేట్‌ వద్దకు పల్లా, జయసారధి ర్యాలీలు చేరుకోవడంతో ట్రాఫిక్‌జాం అయింది. కలెక్టరేట్‌ ఎదుటే అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సభకు అనుమతి ఇవ్వడంతో ఆ ట్రాఫిక్‌లో జయసారధిని బలపరిచే నేతలు చిక్కుకుపోయారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐదు నిమిషాలు ఓపికపట్టాలని నచ్చజెప్పారు. అయితే పది నిమిషాలైనా ఫలితం లేకపోవడంతో ఇదేంతీరంటూ పోలీసులను మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్మి మల్లు లక్ష్మి నిలదీశారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. ఆ తరువాత వామపక్ష కార్యకర్తలు గొల్లగూడెం వైపు వారి సభ వద్దకు వెళ్లారు. ఇదే అంశంపై కలెక్టర్‌ పీజే పాటిల్‌కు ఫిర్యాదు చేసినట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు తుమ్మల వీరారెడ్డి తెలిపారు. అధికార పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి బహిరం గ ప్రాంతాల్లో ప్లెక్సీలు, తోరణాలు, జెండాలు ఏర్పాటు చేశారని, క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో డీజే పెట్టి, పెద్ద సంఖ్యలో మతాబులు పేల్చారని, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు విధుల్లో ఉండగానే టీఆర్‌ఎస్‌ నేతల డీజే ర్యాలీ కోర్టు ముందుగా వెళ్లిందని, వీటిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, అందుకు సంబంధించిన ఫొటో, వీడియో ఆధారాలు సహా రిటర్నింగ్‌ అధికారికి బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు నూకల నర్సింహారెడ్డి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నాయకులు అనుమతి కోరినా ఇవ్వలేదని, డీజే వాహనాన్ని ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయాన్ని రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - 2021-02-24T05:59:51+05:30 IST