- ఈ ఫొటోలో ఉన్నది కూడేరు మండలం గొట్కూరుకు వెళ్లే రహదారి. ఏళ్ల తరబడి ఇలాగే ఉంది. మరమ్మతులకు నిధులు మంజూరై నెలలు గడుస్తోంది. అనంతపురం నుంచి ఉరవకొండకు వెళ్లే ప్రధాన రహదారి నుంచి గొట్కూరుకు వెళ్లేందుకు రెండు కి.మీ. ఈ దారిలో ప్రయాణించాలి. రెండు నెలల కిందట ఓ కాంట్రాక్టరు అర కి.మీ. కంకర వేసి వదిలేశాడు. ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పడం లేదని గ్రామస్థులు అంటున్నారు. గుంతలు పడిన రోడ్డులో కంకర వేయడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఇదే పంచాయతీ పరిధిలోని పొట్టిచెరువుకు వెళ్లే ప్రధాన రహదారి సైతం దెబ్బతినింది. గ్రామంలోని 104 వాహనం కూడా వెళ్లలేని దుస్ధితి. ఇదే మండలంలోని అరవకూరుకు వెళ్లే రహదారి ఆధ్వానంగా ఉంది.
ప్రయాణం ప్రాణ సంకటం
మూడేళ్లుగా మరమ్మతులు లేవు
నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు
కాంట్రాక్టర్లలో బిల్లులు, కమీషన భయం
అనంతపురం సిటీ, జూన 25: రహదారులు బాగుంటే పల్లె ప్రజలకు సగం కష్టాలు తప్పుతాయి. ప్రతి విషయానికీ సమీప పట్టణంపై ఆధారపడే పల్లె జనం.. నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రైతులు వ్యవసాయ దిగుబడులను మార్కెట్కు తరలించాలన్నా, ఎరువులు, విత్తనాల వంటివి పట్టణం నుంచి కొని పల్లెకు తరలించాలన్నా.. దారి బాగుండాలి. ఇక పాడి రైతులతే రోజూ ఉదయం సాయంత్రం బైకు మీద వచ్చి వెళ్లాల్సిందే. కూలీలను, ప్రయాణికులను తరలించే ప్రధాన వాహనం ఇప్పుడు డీజిల్ ఆటో. అనారోగ్యంతో బాధపడేవారు అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాలన్నా, వారి వద్దకు 108 వాహనం వెళ్లాలన్నా.. కావాల్సింది మంచి దారి. కానీ జిల్లాలో పల్లె దారులు శిథిలమయ్యాయి. ఏళ్ల తరబడి మరమ్మతులు చేయలేదు. దీంతో ప్రయాణం అంటే పల్లె జనం బెంబేలెత్తిపోతున్నారు. ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. డీజిల్ ఆటోలో ప్రయాణించేవారికి ఒళ్లు హూనమౌతోంది. వాహనాలు దెబ్బతింటున్నాయి. నిధుల కొరత కారణంగా జిల్లా వ్యాప్తంగా పంచాయతీ రాజ్ ఆఽధ్వర్యంలో చేపట్టిన రోడ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. గ్రామీణ రహదారుల నిర్వాహణ, అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. అధికార యంత్రాంగం ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. పని చేయాలని పిలిచినా.. కాంట్రాక్టర్లు పలకడం లేదు.
మూడేళ్లుగా..
ఉరవకొండ, శింగనమల, గుంతకల్లు, రాప్తాడు, తాడిపత్రి నియోజకవర్గాలలో గ్రామీణ రహదారులు నరకప్రాయంగా మారాయి. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచింది. ఈ ఏడాది మాత్రమే అరకొరగా నిధులు వచ్చాయి. రెండేళ్లుగా అధికార యంత్రాంగం ప్రతిపాదనలకే పరిమితమైంది. పంచాయతీ రాజ్ అధికారులు జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులు గుర్తించి మరమ్మతులు చేపట్టాలి. కానీ నిధులలేమితో కదల్లేని పరిస్థితి. రెండేళ్లుగా కురిసిన వర్షాలకు జిల్లాలో చాలా గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయి. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రోడ్ల మరమ్మతులకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నుంచి రూ.35.43 కోట్లు కేటాయించి మమ అనిపించింది. అదికూడా తారురోడ్లకు మాత్రమే ఇచ్చింది. సీసీ, గ్రావెల్, మెటల్ రోడ్లకు మోక్షం లభించలేదు.
పలకని కాంట్రాక్టర్లు
ప్రభుత్వ పనులంటే జిల్లాలోని కాంట్రాక్టర్లు హడలెత్తిపోతున్నారు. చేసిన పనులకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో కొత్త పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. రెండేళ్లుగా బిల్లులు రాక కాంట్రాక్టర్లు అల్లాడిపోయారు. రెండు నెలల కిందట బిల్లులు రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కొందరికైతే ఇప్పటికీ ఒక్క బిల్లు కూడా రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాలోని గ్రామీణ తారురోడ్ల మరమ్మతు పనులను చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అరకొరగా నిధులు కేటాయించారని, పనులు చేసినా బిల్లులు సకాలంలో వచ్చేది అనుమానమేనని అంటున్నారు. అందుకే రోడ్ల పనులు ఆగిపోయాయని అధికార యంత్రాంగం అంటోంది. పనులు చేపడితే.. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు కమీషన ఇవ్వాల్సి వస్తుందని, బిల్లులే రాని పనులకు ఎందుకు ఇలా రిస్క్ తీసుకోవాలని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.
ఏళ్లుగా అవస్థలు..
జిల్లా వ్యాప్తంగా గ్రామీణ రహదారులు ఆధ్వానంగా మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ఉమ్మడి జిల్లాకు 2019-20 కింద సీసీ, బీటీ రోడ్ల మరమ్మతులకు రూ.225.51 కోట్లు కేటాయించింది. ఈ పనులు కూడా నత్తనడకనే సాగాయి. ఈ నిధులతో 3,197 రోడ్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇంకా వేల సంఖ్యలో పనులు పెండింగ్లో ఉన్నాయి. నిధుల రాక ఆలస్యం కావడంతో పనులు ఆగినట్లు తెలుస్తోంది. కమీషనలు కూడా 10 నుంచి 15 శాతం డిమాండ్ చేస్తుండటంతో కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదని తెలిసింది. అనంతపురం జిల్లాలో 1,914.3 కి.మీ. గ్రామీణ తారురోడ్లు ఉన్నాయి. వీటిలో 40 శాతం వరకు దెబ్బతిన్నాయి. ఏడాది కిందట అధికార యంత్రాంగం పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక పంపింది. కానీ 105 రోడ్లు మరమ్మతులకు మాత్రమే రూ.35.43 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూడంలేదని తెలిసింది.
త్వరగా రోడ్డు వేయాలి..
మా ఊరి రహదారి గుంతలమయంగా మారింది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రెండు నెలల కిందట ఓ కాంట్రాక్టర్ వచ్చి మరమ్మతు పనులు చేపట్టాడు. కొంత వరకు పనులు చేసి కంకర వేశాడు. దీంతో దారి బాగవుతోందని సంతోషపడ్డాం. ఇంతలోనే ఏమైందో పనులు ఆపేశాడు. ఇప్పుడు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. రోడ్డు పనులు త్వరగా చేపట్టాలి.
- ప్రతాప్, గొట్కూరు
త్వరగా చేపట్టేలా చూస్తాం..
జిల్లాలో గ్రామీణ రహదారుల మరమ్మతు పనులను త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. నిధులు ఉన్నంతలో పనులు చేయిస్తాం. బిల్లులు కూడా త్వరగా వచ్చేలా చేస్తాం. కాంట్రాక్టర్లు వేగవంతంగా పనులు చేసేలా క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేశాం. మధ్యలో ఆగిపోయిన రోడ్లు త్వరగా బాగుచేయిస్తాం. పలు కారణాలతో గతంలో పనులు ఆగిపోయాయి. ఉన్నతాధికారులకు నివేదించాం.
- వై భాగ్యరాజ్, పంచాయతీ రాజ్ శాఖ ఎస్ఈ