ఓటీఎస్‌పై అధికార పక్షం ఆగ్రహం

ABN , First Publish Date - 2021-12-01T06:43:30+05:30 IST

ఓటీఎస్‌ పథకంపై నూజివీడు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో వాడీవేడీ చర్చ సాగింది.

ఓటీఎస్‌పై అధికార పక్షం ఆగ్రహం
కౌన్సిలర్‌గా ప్రమాణస్వీకారం చేస్తున్న గాజుల సీతాకుమారి

నూజివీడు మున్సిపల్‌ సమావేశంలో వాడీవేడి చర్చ  

నూజివీడు టౌన్‌, నవంబరు 30: ఓటీఎస్‌ పథకంపై నూజివీడు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో వాడీవేడీ చర్చ సాగింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామిశెట్టి శ్రీవేణి దుర్గ అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్‌ సమావేశాన్ని జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం గృహ నిర్మాణశాఖ పరిధిలో ప్రవేశపెట్టిన ఓటీఎస్‌ పథకంపై అధికార పక్షం సభ్యులే వ్యతిరేకతను తెలిపారు. 1983 నుంచి హౌసింగ్‌ రుణాలను ఇవ్వగా నాటి నుంచి వసూళ్లు చేయకుండా నేడు కట్టమంటే లబ్ధిదారులు ఏవిధంగా కడతారంటూ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పగడాల సత్యనారాయణ మున్సిపల్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి నుంచి నేటి వరకు గృహాలు చేతులు మారాయని, కొందరు లబ్ధిదారులు మృతి చెందారని, అలాంటి వారి వద్ద నుంచి ఓటీఎస్‌ ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు. సంబంధిత రుణాలను ప్రభుత్వాలు ఎప్పుడో రద్దు చేశాయనే అపోహలో లబ్ధిదారులు ఉన్నారని, కనీసం లబ్ధిదారుల వద్దకు వెళ్లే ముందు అధికారులు కౌన్సిలర్స్‌ దృష్టికి తీసుకురాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో మూడు వేలకు పైగా లబ్ధిదారులు ఉంటే కేవలం 587 మందికి మాత్రమే నోటీసులు జారీ చేసినట్లు ఆయన అధికారులు తెలిపారు. ఇటీవల 27వ వార్డు కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గాజుల సీతాకుమారితో చైర్మన్‌ రామిశెట్టి త్రివేణి దుర్గ ప్రమాణం చేయించారు. 


Updated Date - 2021-12-01T06:43:30+05:30 IST