నేరాల సాలెగూడులో పాలక శ్రేణులు

ABN , First Publish Date - 2021-03-26T06:32:33+05:30 IST

‘మినిస్టర్ లోగ్ మేరే పీచే ఔర్ పోలీస్ ‌లోగ్ మేరే జెబ్ మే రెహ్తే హై’ (మంత్రులు నా వెనకాల వస్తారు, పోలీసులు నా జేబులో ఉన్నారు). వాస్తవ జీవిత గమనం...

నేరాల సాలెగూడులో పాలక శ్రేణులు

‘మినిస్టర్ లోగ్ మేరే పీచే ఔర్ పోలీస్ ‌లోగ్ మేరే జెబ్ మే రెహ్తే హై’ (మంత్రులు నా వెనకాల వస్తారు, పోలీసులు నా జేబులో ఉన్నారు). వాస్తవ జీవిత గమనం కంటే హిందీ చలన చిత్ర సీమ (అప్పుడప్పుడు) ముందుండడం కద్దు. బాలీవుడ్ విశిష్ట లక్షణాలలో ఇదొకటి. ఈ కాలమ్ ఆరంభంలో ఉటంకించిన సంభాషణా శకలం 2011లో సూపర్ హిట్ అయిన ‘సింగం’ సినిమా లోనిది. నిజాయితీపరుడైన ఇన్ స్పెక్టర్ బాజీరావు సింగం నుద్దేశించి దుష్టుడైన డాన్ అన్న మాటలవి. సింగం ఆ అభిజాత్యపు మాటలకు ఆగ్రహంతో ఊగిపోతూ సింగం ఇలా ప్రత్యుత్తరమిస్తాడు: ‘ఆతా మజ్హి సతాక్లి! (ఇప్పుడు, నేను మనో స్థిమితాన్ని కోల్పోయాను).


మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు విస్మయం గొల్పుతున్నాయని చెప్పడం వాటిపై సరైన వ్యాఖ్య కాబోదు. వివేచనాశీలురైన పౌరులను అవి అమితంగా కలవరపెడుతున్నాయి. నిరుత్సాహానికిలోను చేస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ఇనస్పెక్టర్ సింగం నైరాశ్య మాటలు ప్రతిధ్వనించకుండా ఉంటాయి? 


రాజకీయ నాయకులు, పోలీస్ బాస్‌లు ఒక అసాధారణ అబద్ధాల, మోసాల, సంభావ్య నేరాల సాలెగూడులో చిక్కుకున్నప్పుడు శాసన నిర్మాతలు, చట్టాలను అమలుపరిచేవారు తమ విధ్యుక్త ధర్మమైన పౌర సేవను త్యజించి వ్యక్తిగత ప్రయోజనాలకు డబ్బు దండుకోవడంలో భాగస్వాములు కాలేదు గదా అనే ఆశ్చర్యాన్ని తప్పక కలిగిస్తుంది. 


కాకపోతే మహారాష్ట్ర హోం మంత్రి అనీల్‌దేశ్ ముఖ్, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ మధ్య మున్నెన్నడూ లేనివిధంగా కొనసాగుతోన్న మాటల యుద్ధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తనను ముంబై పోలీస్ కమిషపర్ పోస్ట్ నుంచి బదిలీ చేసిన వెంటనే పరంబీర్ సింగ్ మంత్రిపై ఆరోపణాస్త్రాలను సంధించడం గమనార్హం. తనకు నెలా నెలా రూ.100 కోట్ల మేరకు వ్యాపారస్తుల నుంచి వసూలు చేసి ఇవ్వాలని మంత్రి ఆదేశించారని పోలీస్ కమిషనర్ ఆరోపించారు. మన్సుఖ్ హిరణ్ అనే వ్యక్తి శవమై కన్పించిన కేసులో తనకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకే పోలీస్ కమిషనర్ తపపై ఈ ఆరోపణలు చేశారని హోంమంత్రి అనీల్ దేశ్ ముఖ్ ప్రత్యారోపణ చేశారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఒక ఇబ్బంది కరమైన సత్యాన్ని వెల్లడించాయి. చేసిన పాపాలు ఎప్పటికైనా బయటపడతాయనేదే ఆ సత్యం. అవును, రాజకీయ నేతలు, పోలీసధికారులు గతంలో చేసిన పాపాలే ఇప్పుడు వారికి సమస్యలుగా పరిణమించాయి. మహారాష్ట్రలో, ఆ మాటకొస్తే యావద్భారతంలో రాజకీయ నాయకులు-పోలీసుల మధ్య న్యాయవిరుద్ధ సంబంధాలు తేటతెల్లంగా బహిర్గతమయ్యాయి. 


కొద్ది సంవత్సరాల క్రితం మహారాష్ట్ర సీనియర్ పోలీసధికారి సంజయ్ పాండే కూడా అమీర్ ఖాన్ టీవీ షో ‘సత్యమేవ జయతే’లో ఇదే విషయాన్ని అంగీకరించారు.. ‘సంఘటిత, సంస్థాగత పరిష్కారాల’ పద్ధతి ద్వారా ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల యజమానులు నెలా నెలా స్థానిక పోలీసధికారులకు నెలానెలా ‘హఫ్తా’ (నిర్ణయించిన మొత్తం)ను చెల్లించవలసివుంటుందని పాండే చెప్పారు. హోంమంత్రి అనీల్ దేశ్ ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణ కూడా సరిగ్గా ఇదే. పోలీసధికారులు నెలా నెలా రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని అనీల్ తమకు నిర్దేశించారని ఆయన తెలిపారు. పరంబీర్ సింగ్ 2020 ఫిబ్రవరిలో ముంబై పోలీస్ కమిషనర్ అయ్యారు. కేవలం 13 నెలలకే హోం గార్డ్స్ విభాగానికి బదిలీ చేశారు. దీంతో ఆయన ఒక ప్రజావేగు (విజిల్ -బ్లోయర్)గా పరిణమించారు. గత ఏడాది పలు కేసుల దర్యాప్తులో పరంబీర్ సింగ్ కు పూర్తి మద్దతునిచ్చిన అనీల్ దేశ్ ముఖ్ ఇప్పుడు ఆయన నిజాయితీని ప్రశ్నిస్తున్నారు. 


ఐదు పర్యాయాలు శాసనసభకు ఎన్నికైన అనీల్ దేశ్ ముఖ్ మాటలను గానీ, మహారాష్ట్రలో సీనియర్ మోస్ట్ పోలీసధికారులలో ఒకరైన పరంబీర్ సింగ్ మాటలను గానీ మనం విశ్వసించనవసరం లేదు. తమ చర్యల పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది వారికి తెలియని విషయమేమీకాదు. మరెందుకీ ధర్మాగ్రహాలు? పోలీస్ కమిషనర్ ను బదిలీ చేయకుండా ఉన్నట్టయితే రాజకీయ నాయకుల ఆదేశాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడి వుండేవారు కాదని నిశ్చితంగా చెప్పవచ్చు. థానే కాలువలో మన్సుఖ్ హిరణ్ శవాన్ని కనుగొని వుండకపోయి వున్నట్టయితే ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసు రచ్చకెక్కేదే కాదు. ఇన్ స్పెక్టర్ సచిన్ వాఝే ఇప్పటికీ ఎవరు ఎలా వ్యవహరించాలో, ఏమి చేయాలో ఆదేశాలు జారీ చేస్తుండేవాడు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ కు రహస్య డాక్యుమెంట్లు అందుబాటులో లేని పక్షంలో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మరింత మొండిగా వ్యవహరించివుండేది. 


ఈ ఉదంతపు దుర్గంధం తమకు అంటకుండా ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ దూరంగా ఉండగలరా? ఇన్ స్పెక్టర్ వాఝే ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’గా సుప్రసిద్ధుడు. ఒక బూటకపు ఎన్ కౌంటర్ కేసులో బర్తరఫ్ అయిన తరువాత శివసేనలో చేరాడు. శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర వికాస్ అఘాడి ప్రభుత్వం గత ఏడాది అతడిని మళ్ళీ పోలీసు ఉద్యోగంలో ఎందుకు నియమించింది? శివసేనకు అత్యంత విధేయుడు అవ్వడం వల్లే కాదూ? సరే, శరద్ పవార్ విషయమేమిటి? కాకలు తీరిన రాజకీయ యోధుడు ఆయన. మహారాష్ట్ర రాజకీయాలలో అర్ధ శతాబ్దికి పైగా ఆయనకు అనుభవమున్నది. మరి అటువంటి వ్యక్తికి తమ పార్టీ ( నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)కే చెందిన హోంమంత్రి ఏమి చేస్తున్నాడనే విషయం తెలియకుండా ఉంటుందా? తెలియదని పవార్ అంటున్నారు. అయితే విశ్వసించే వారు ఎంత మంది ఉంటారు? 


ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసిన మాట వాస్తవం. అయితే శివసేన భాగస్వామ్యంతో ముఖ్యమంత్రిగా ఐదేళ్ళ పాటు ఆయనా ఇదే ‘పాలనా వ్యవస్థ’కు నేతృత్వం వహించారన్న వాస్తవాన్ని మనం విస్మరించగలమా? 2019లో మహారాష్ట్ర వికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే రాజకీయవేత్తల -పోలీసుల సంబంధాలు బహిర్గతమయ్యాయని విశ్వసించేవారు ఎవరైనా ఉంటారా? 2006 ప్రకాశ్ సింగ్ కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సిఫారసు చేసిన పోలీసు సంస్కరణలను అమలుపరిచేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందా? బదిలీల విషయంలోనైనా లేదా దర్యాప్తు వ్యవహారాలలోనైనా రాజకీయ ఒత్తిళ్లకులోను కాకుండా పోలీసు వ్యవస్థ స్వేచ్ఛగా పని చేసే పరిస్థితులను కల్పించడం తక్షణ అవసరమన్నది సుప్రీం కోర్టు సిఫారసు చేసిన సంస్కరణల సారాంశం. అయితే ఆ సంస్కరణల అమలును మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు; ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వమూ శ్రద్ధ చూపడం లేదు. అసలు మన ప్రభుత్వాల ప్రాధాన్యతల్లో బహుశా, పోలీసు సంస్కరణలు లేవని చెప్పక తప్పదు. 


అయినా ఏ ప్రభుత్వమైనా తనకు అన్ని విధాల అండగా ఉండే అధికారిక వ్యవస్థకు చెందిన వారిపై కఠినచర్యలు ఎందుకు చేపడుతుంది? బెదిరించి దండుకునే వ్యవహారాలు, లాభదాయక ‘బదిలీ-పోస్టింగ్’ పరిశ్రమ, అంతకంతకూ అవినీతి మయమైపోతున్న రాజకీయవేత్త-పోలీసు సంబంధాలు ప్రభుత్వ వ్యవస్థలను అన్ని విధాల దిగజార్చి వేశాయి. ఎంతగా అంటే మంచి చెడుల మధ్య తేడాను గుర్తించలేనంతగా. వీథుల్లో చిరు వ్యాపారాలు చేసుకునే జనం నుంచి నిర్భయంగా లంచాలు తీసుకునే కానిస్టేబుల్‌తో ప్రారంభమయ్యే ఈ అవినీతి స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆ పైన దిగ్భ్రాంతికరంగా ఐపిఎస్ అధికారులు, వారి రాజకీయ యజమానుల వరకు విస్తరించి ఉన్నది. సీనియర్ ఐపిఎస్ అధికారుల సైతం లాభదాయక పోస్టింగ్‌ల కోసం ‘లాబీయింగ్’ చేసుకోవడమనేది సామాన్య ప్రజలకూ తెలిసిన విషయమే. దీన్ని బట్టి పోలీసు వ్యవస్థలో స్వార్థ ప్రయోజనాలు ఎలా రాజ్యమేలుతున్నాయో విశదమవుతుంది. 


మహారాష్ట్రలో అవినీతి నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలి. స్వార్థ ప్రయోజనాలకు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసధికారులపై కఠిన చర్యలు చేపట్టాలి. ముంబై మాజీ పోలీస్ కమిషనర్, మహారాష్ట్ర హోంమంత్రి ఆరోపణ, ప్రత్యారోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి. దోషులను గుర్తించి శిక్షించాలి. విశ్వసనీయమైన పోలీసధికారులను, అలాగే నిజాయితీపరులైన రాజకీయవేత్తలను రక్షించేందుకు అయోగ్యులు, అవినీతిపరులైన పోలీసధికారుల- రాజకీయవేత్తల మధ్య సంబంధాల గొలుసును తెగతెంచాలి. లేనిపక్షంలో కోపోద్రిక్తుడైన ప్రతి పౌరుడికీ ‘ఆతా మజ్హి సతాక్లి’అని అరిచేందుకు హక్కు ఉంటుంది.


gరాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2021-03-26T06:32:33+05:30 IST