అదే ఆత్మానుభూతి

ABN , First Publish Date - 2020-12-10T09:01:11+05:30 IST

‘శివ మహిమ్న స్తోత్రం’లోనిదీ శ్లోకం. ‘‘కాటుక కొండను పొడి చేసి దాన్ని సాగరమనే సిరాబుడ్డిలో వేసి,

అదే ఆత్మానుభూతి

అసిత గిరి సమం స్యాత్‌కజ్జలం సిన్ధు పాత్రే

సుర తరువర శాఖా లేఖినీ పత్రముర్వీ

లిఖతియది గృహీత్వా శారదా సార్వకాలం

తదపి తవ గుణానామీశ పారం నయాతి

‘శివ మహిమ్న స్తోత్రం’లోనిదీ శ్లోకం. ‘‘కాటుక కొండను పొడి చేసి దాన్ని సాగరమనే సిరాబుడ్డిలో వేసి, కల్పవృక్ష శాఖను లేఖినిగా చేసుకుని, భూమినే కాగితంగా చేసుకుని శారదాదేవి సదా రాస్తూ ఉన్నా.. ఓ పరమేశ్వరా! నీ అనంత కల్యాణ గుణాల అంతు కనుగొనడం అసాధ్యం’’ అని దీని భావం. అనగా పరమాత్మ మనస్సుకు గోచరించేవాడు కాడు. అతడు అనుభవం ఒక్కదానికి మాత్రమే గోచరిస్తాడు. ‘బ్రహ్మవిత్‌ బ్రహ్మైవభవతి’ అనగా బ్రహ్మను తెలుసుకొన్నవాడు బ్రహ్మ స్వరూపుడవుతాడు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మను పొందుతాడు.


‘‘నాలో ఉన్నవాడు, ఆ సూర్యునిలో ఉన్నవాడు ఒక్కడే’’ అనే సత్యం గ్రహించిన వాడు లౌకిక చైతన్యం నుండి విడివడుతున్నపుడు.. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే పంచకోశాలకు అతీతంగా వెళతాడు. మళ్లీ జన్మించక భగవంతునిలో ఐక్యం కాగలడు. సృష్టిలోని సకల జీవరాశులలో ఆత్మజ్ఞానం పొందే అవకాశం ఒక మనిషికే ఉంది. 

అనియంత్రితమైన మనసు.. ‘ఇంద్రియ భోగములు, అహంకార తృప్తి, ధన సంచయం’ అనే మూడు క్షేత్రాల్లోనే సుఖాన్ని వెతుక్కుంటుంది. మనసు స్వచ్ఛందంగా అన్ని దిశలలో పరుగెత్తడం వల్ల బుద్ధి అనే అంకుశం లేనపుడు, ఒక ఆలోచన నుంచి వేరొక ఆలోచనలోకి వెళుతుంది. బుద్ధి, వివేకాల నియంత్రణలో ఉన్న మనసు మన వశంలో ఉంటుంది. మనసు యొక్క ఏకాగ్రతలో, తన్మయత్వంలో సంకల్ప శక్తి ఉంటుంది. భగవద్గీతలో చెప్పబడిన ‘స్థితప్రజ్ఞ స్థితి’.. ఆనందమయకోశ గుణ కర్మల యొక్క స్వభావము. ఈ ఆనందమయకోశానుభూతిలోనే మహాత్ములు సమాధి అవస్థను పొందుతారు. ప్రాణమయ కోశంలోని ఆకలిదప్పులు, మనోమయ కోశంలోని శోకమోహాలు అన్నింటినీ అధిగమించగలిగినపుడే ఆత్మానుభూతి లభిస్తుంది.



యతోవాచోనివర్తన్తే అప్రాప్య మనసా సహ! 

ఆనందం బ్రహ్మణో విద్వాన్‌ న భిభేతి కుతశ్వనేతి

అని ‘తైత్తిరీయోపనిషత్తు’లోని ‘ఆనందవల్లి’ నిర్వచనం అనగా ‘‘ఎవరిని పొందడం సాధ్యంకాక మనసు, వాక్కు మరలుతున్నాయో ఆయనే భగవంతుడు. ఆత్మానుభూతిలో బ్రహ్మానందాన్ని తెలుసుకున్నవాడు దేనికీ భయపడడు. అతడు ద్వంద్వాతీతుడై సర్వం భగవన్మయంగా దర్శించి తరిస్తాడు.

‘‘చావు పుట్టుకలతో కూడిన శరీరం నీవు కావు. ఆకలి దప్పికలు కలిగించే ప్రాణం నీవు కావు. శోక మోహాదులతో కూడిన మనసు నీవు కావు. ఇష్టమైనవి లభించినప్పుడు ఆనందించే ఆనందమయ శోకం నీవు కావు. వీటన్నింటినీ తెలుసుకుంటూ సాక్షిగా నిర్వికారంగా ఉన్న పరమాత్మ చైతన్యమే నీవు’’ అని అనుభూతి చెందడమే ఆత్మానుభూతి. అదే పంచకోశాలకు అతీతమైన స్థితి. అదే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ.

- మేఘశ్యామ (ఈమని), 8332931376

Updated Date - 2020-12-10T09:01:11+05:30 IST