అదే సారాంశం

ABN , First Publish Date - 2022-01-28T05:30:00+05:30 IST

ప్రాచీన జెన్‌ (చైనాకు చెందిన) గురువులలో ప్రముఖుడు జోషు జుషిన్‌. ‘‘జోషు లాంటి గురువు పూర్వం లేడు, మునుముందు రాబోడు’’ అని ఆయన గురించి సుప్రసిద్ధ జపాన్‌ జెన్‌ గురువు డోజెన్‌ పేర్కొన్నాడు. అంతటి విఖ్యాతుడైన జోషుకు బాల్యం

అదే సారాంశం

ప్రాచీన జెన్‌ (చైనాకు చెందిన) గురువులలో ప్రముఖుడు జోషు జుషిన్‌. ‘‘జోషు లాంటి గురువు పూర్వం లేడు, మునుముందు రాబోడు’’ అని ఆయన గురించి సుప్రసిద్ధ జపాన్‌ జెన్‌ గురువు డోజెన్‌ పేర్కొన్నాడు. అంతటి విఖ్యాతుడైన జోషుకు బాల్యం నుంచీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఎప్పుడూ ఏకాంతంగా, ఆలోచనా నిమగ్నుడై ఉండేవాడు. పద్దెనిమిదేళ్ళ వయసులో... సన్యాసిగా, దేశ సంచారిగా మారాలనుకున్నాడు. తన నిర్ణయాన్ని తల్లితండ్రులకు తెలిపాడు. వారు అంగీకరించకపోవడంతో... చెప్పకుండానే ఇంటినుంచి వెళ్ళిపోయాడు. గురువు కోసం అన్వేషించాడు. ఎందరితోనో చర్చించాడు, వాదించాడు, ఎందరినో పరిశీలించాడు. చివరకు నాన్‌సేన్‌ అనే జెన్‌ గురువును ఆశ్రయించాడు. ఆయనతోపాటు 40 సంవత్సరాలు కలిసి ఉన్నాడు.


నాన్‌సేన్‌ మరణం జోషును బాగా కుంగదీసింది. తేరుకోవడానికి రెండేళ్ళు పట్టింది. అప్పటికి ఆయన వయసు 60 సంవత్సరాలు. ఇక దేశ సంచారం చేద్దామనుకున్నాడు. కేవలం ఒక మంచి నీటి సీసాను, ఒక కట్టెను చేతపట్టి బయలుదేరాడు. అప్పుడే... ..ఏడేళ్ళ బాలుడైనా నాకన్నా ఎక్కువ జ్ఞానం ఉంటే, అతని వెంటపడి, ప్రాధేయపడి, నాకు బోధించాల్సిందిగా కోరుతాను. నూరేళ్ళ వ్యక్తికి నాకన్నా తక్కువ తెలిసిఉంటే... అతని వెంటపడి, నాకు తెలిసినదంతా బోధిస్తాను’’ అని జోషు ప్రతిజ్ఞ చేశాడు. 


అలా ఇతరులకు బోధిస్తూ, ఇతరుల నుంచి గ్రహిస్తూ... ఇరవయ్యేళ్ళ పాటు జోషు సంచార జీవనం గడిపాడు. ఆయనకు 80 ఏళ్ళు వచ్చాయి. అప్పుడు ఒక చోట స్థిరపడాలనుకొని, తన సొంత ఊరైన గాన్యినుయాన్‌తు చేరుకున్నాడు. అది చైనాలోని జో ప్రావిన్స్‌లో ఉంది. అక్కడ ఒక శిథిలాలయంలో ఆయన జీవించాడు. వయసు పెరిగేకొద్దీ, ఆధ్యాత్మిక ప్రగతి పొందే కొద్దీ... ఇతరులకు బోధంచగలిగే జ్ఞానం తనకు లేదని గ్రహించాడు. ఆ విషయాన్ని పలుసార్లు బాహాటంగా ప్రకటించాడు. అయినా... ఎందరో ఆయనను దర్శించడానికి, ప్రశ్నించడానికి వచ్చేవారు. జోషు మాటలు వెలుగు కిరణాల్లా ఉండేవి. ఆయన చెప్పిన విషయాలు గ్రంథస్తం అయ్యాయి కూడా. వాటిలో ఉన్న అంశాలను ‘కోన్స్‌’ అంటారు. ‘కోన్‌’ అంటే ప్రశ్న, ప్రకటన, సంభాషణ, కథ... ఇలా ఏదైనా కావచ్చు. 


జోషు గొప్పతనాన్ని విన్న సన్యాసి ఒకరు ఆయనను కలుసుకున్నాడు. ‘‘మీ బోధలోని సారాంశం ఏమిటో చెబుతారా?’’ అని ప్రశ్నించాడు.

‘‘మీరు భోజనం చేశారా?’’ అని అడిగాడు జోషు. ఔనన్నాడు ఆ సన్యాసి.

‘‘అయితే వెళ్ళి ఆ పాత్రలు కడగండి’’ అన్నాడు జోషు.


కట్టెలు కొట్టడం, చెప్పులు కుట్టడం, కుండలు చేయడం, వంటపాత్రలు తోమడం... ఇలాంటి సాధారణ పనుల ద్వారా కూడా లక్ష్యాన్ని చేరడం, సత్యాన్ని దర్శించడం సాధ్యమేనన్నది ఆయన బోధ. ఈ విధంగా 120ఏళ్ళు జోషు జీవించాడు. ఆయన ‘కోన్‌’లలో భావాలు జిజ్ఞాసువులను ఆకర్షిస్తూనే ఉన్నాయి.

రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2022-01-28T05:30:00+05:30 IST