అదే అంతరార్థం!

ABN , First Publish Date - 2021-07-30T05:30:00+05:30 IST

చైనాలో ఒకప్పుడు ముగ్గురు సన్యాసులు ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ

అదే అంతరార్థం!

చైనాలో ఒకప్పుడు ముగ్గురు సన్యాసులు ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ కలిసే కనబడేవారు. వారు ఎలాంటి ఉపదేశాలు ఇచ్చేవారు కాదు. ఏ హితబోధా చేసేవారు కాదు. బాగా జనం గూమిగూడి ఉన్న ప్రదేశాల్లో, రద్దీగా ఉండే స్థలాల్లో అందరికీ కనిపించేలా బాగా ఎత్తైన చోట వరుసగా నిలబడి... గట్టిగా నవ్వేవారు. దీనికి ఎలాంటి కారణం కనబడేది కాదు. ‘


‘ఎవరు మీరు?’’ అని అడిగినా, ‘‘ఏ ఊరు మీది?’’ అని ఎవరయినా అడిగితే... దానికి బదులుగా తిరిగి నవ్వేవారు తప్ప మాట్లాడేవారు కాదు. ఇది చూచి వారి చుట్టూ గుమిగూడేవారు కూడా తిరిగి నవ్వేవారు. తాము నవ్వడం, ఇతరులు నవ్వేలా చేయడం.. ఇదే ఆ ముగ్గురూ చేసే పని. అదే వారు చేసే బోధ.

వారి పేర్లూ, ఊరూ ఎవరికీ తెలీదు కానీ ఆ రోజుల్లో చైనా అంతటా వారిని ‘నవ్వే సన్యాసులు’ అని పిలుచేవారు. ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్క హితబోధ చేయకుండా... దేశాన్నంతటినీ ఆనందంతో, సంతోషంతో నింపినవారు ఆ సన్యాసులు. 


అయితే కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా! వారికి వృద్ధాప్యం వచ్చింది. శరీరంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ వారి నవ్వు మాత్రం చెదరలేదు. అది గమనించిన వారందరూ ఆశ్చర్యపోయేవారు.

కొన్నాళ్ళ తరువాత... ఆ ముగ్గురు సన్యాసుల్లో ఒకరు సమీప గ్రామంలో మరణించాడు. మిగిలిన ఇద్దరికీ ఆ గ్రామస్తులు కబురు పంపారు. వారు వస్తారనీ, చనిపోయిన తమ మిత్రుడిని చూస్తారనీ, విలపిస్తారనీ, అంతటితో వారి నవ్వు ఆగిపోతుందనీ అందరూ భావించారు. 

అనుకున్నట్టే ఆ ఇద్దరూ వచ్చారు. మృతి చెందిన తమ మిత్రుణ్ణి చూసి పగలబడి నవ్వారు. ఆ మృతదేహం చుట్టూ తిరుగుతూ... కడుపు చెక్కలయ్యేలా నవ్వారు. 

గ్రామ ప్రజలకు ఇదేం అర్థం కాలేదు. ‘‘అయ్యా! ఇప్పుడైనా దయచేసి చెప్పండి. ఏమిటీ వింత చేష్టలు? మరణించిన బంధువులనూ, మిత్రులనూ చూసి ఎవరైనా దుఃఖిస్తారు. ఆవేదన చెందుతారు. కానీ నవ్వుతారా? ఇదేం వింత పని? ఎక్కడైనా ఇలా ఉంటుందా? మీరు సన్యాసులు. అన్నీ తెలిసినవారిలా కనిపిస్తున్నారు. దీని వెనుక అంతరార్థం ఏమిటి?’’ అని అడిగారు.



అప్పుడు... ఆ సన్యాసులు మొదటిసారిగా నవ్వు ఆపి, మాట్లాడారు. ‘‘మేము ముగ్గురం స్నేహితులం. కలిసి ఎన్నో ఏళ్ళు నవ్వుతూ జీవించాం. మాలో ఎవరు ముందు మరణించి... మిగిలిన ఇద్దరినీ ఓడిస్తాడు?’’ అనుకొనేవాళ్ళం. ఇప్పుడు వీడు మరణించి, మమ్మల్ని జయించాడు. వాణ్ణి నవ్వుతూ సాగనంపడమే స్నేహితులుగా మేము చేయగలిగే అత్యుత్తమ కర్మ’’ అన్నారు.

వారిద్దరూ తడ మిత్రుడి భౌతికకాయాన్ని చితిపై ఉంచి నిప్పుఅంటించారు. చితిలోంచీ మంటలు లేస్తూంటే... టపాకాయల లాంటివి ఆ మృతదేహానికి ఉన్న దుస్తుల్లోంచీ పేలుతూ పైకి ఎగసి, వెలుగులు విరజిమ్మాయి. అంతిమ క్రియల సమయంలోనూ పండుగ లాంటి వాతావరణం సృష్టించడానికి... మృతి చెందిన సన్యాసి ఆ పేలుడు పదార్థాలను తన దుస్తుల్లో దాచుకున్నాడు. 

ఆ జెన్‌ సన్యాసులకు బతుకు, మరణం... అన్నీ ఒక నవ్వులాట. నవ్వుతూ బతకాలి... అదే ప్రజలకు వారు చేసి బోధ.

ఈ ముగ్గురు సన్యాసులూ నవ్వుతూ చైనా అంతటినీ ప్రభావితం చేసినట్టే.. జపాన్‌ను తన నవ్వుతో ప్రభావితం చేసిన వాడు హోతీ. జపాన్‌లో ఆయనను ‘నవ్వే బుద్ధుడు’ అని పిలుస్తారు.

 రాచమడుగు శ్రీనివాసులు


Updated Date - 2021-07-30T05:30:00+05:30 IST