అదే శ్రీరాముడి ఔన్నత్యం!

ABN , First Publish Date - 2021-04-16T05:30:00+05:30 IST

ఎంతోమంది భారతీయులు శ్రీరాముణ్ణి కొలుస్తారు. జీవితంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులనూ, జీవితం ఆయనకు

అదే శ్రీరాముడి ఔన్నత్యం!

ఎంతోమంది భారతీయులు శ్రీరాముణ్ణి కొలుస్తారు. జీవితంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులనూ, జీవితం ఆయనకు విసిరిన సవాళ్ళనూ గమనిస్తే... శ్రీరాముడు ఎల్లప్పుడూ వివత్తుల వలయంలో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది. ఆయన తనదైన రాజ్యాన్ని కోల్పోయాడు. అడవుల పాలయ్యాడు. ఇది చాలదనట్టు... తన భార్యను అపహరించిన వాడితో... తనకు ఏమాత్రం ఇష్టంలోని ఘోరమైన యుద్ధం చేశాడు. తీరా అర్థాంగిని రాజ్యానికి తీసుకు వచ్చిన తరువాత, ఆమె గురించి తన రాజ్య ప్రజలే అనుచితంగా మాట్లాడడం విని నొచ్చుకున్నాడు.


విషాద హృదయంతో... తనకు ప్రాణప్రదమైన సీతను నిండు చూలాలని కూడా చూడకుండా అడవుల్లో విడిచిపెట్టాడు. చివరకు తనకు తెలియకుండానే సొంత పుత్రులతో యుద్ధం చేశాడు. ఆఖరికి భార్యను కోల్పోయాడు. ఇలా ఆయన జీవితమంతా ఎడతెగని అనర్థాలే! 


శ్రీరాముని ఔన్నత్యం ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల్లో లేదు. తన జీవితాన్ని ఎంతో సామరస్యంగా, హుందాతనంతో ఆయన నిర్వహించుకున్న తీరులో ఉంది. ఎంతటి విపత్తు వచ్చినా ఆయన సహనాన్ని కోల్పోలేదు. ఎవరినీ దూషించలేదు. పరిస్థితి విషమించిందని అందరిమీదా విరుచుకుపడలేదు. ఏ వైపరీత్యం వచ్చినా చెక్కుచెదరకుండా నిలబడ్డాడు. సత్య మార్గాన్ని వీడలేదు. స్వధర్మాన్ని ఆచరిస్తూ వచ్చాడు. జీవితాన్ని అత్యంత సమతుల్యతతో నిర్వహించుకున్నాడు. 


ముక్తినీ, అనుగ్రహ పూర్వకమైన జీవితాన్నీ ఆకాంక్షించేవారు శ్రీరాముణ్ణి ఆరాధించాలి. బాహ్య పరిస్థితులు అన్ని వేళలా మన చేతిలో ఉండవనీ, అవి ఎప్పుడైనా, ఎలాగైనా తారుమారు కావచ్చనే జ్ఞానం దీనివల్ల ఏర్పడుతుంది. మనం బాహ్య పరిస్థితులను ఎంతో నైపుణ్యంతో నిర్వహించుకున్నప్పటికీ ఏదో పొరపాటు జరుగుతుంది. ఉదాహరణకు, ఏ క్షణాన్నైనా తుపాను రాబోతోందని తెలిసి, ఇంట్లో కావలసినవన్నీ ముందుగా అమర్చుకున్నామనుకోండి. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా, తుపాను వచ్చి ఇంటిని ఊడ్చుకొని పోతే? అలా జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ‘మా విషయంలో ఇలాంటి దుర్ఘటనలు జరగవు’ అని అనుకోవడం అవివేకం.


‘ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైనా నేను దాన్ని స్థైర్యంగా , సౌమ్యంగా ఎదుర్కొంటాను’ అని అనుకోవడం వివేకవంతుల లక్షణం. ఇటువంటి అద్భుతమైన వివేకాన్నీ, సుజ్ఞానాన్నీ రాముడిలో చూశారు గనుకనే ఎందరో ఋషులూ, ద్రష్టలూ, మహా కవులూ శ్రీరాముడిని ఆశ్రయించారు. ఆయనను కొలిచారు. తన బాహ్య పరిస్థితులను చక్కగా నిర్వహించుకోడానికి  శ్రీరాముడు ఎంతో ప్రయత్నించాడు. కొన్ని సార్లు ఆయనకు ప్రతికూలతలు కూడా ఎదురయ్యాయి. ఆపత్కాలంలో పరిస్థితులు చేయిదాటిపోతూ ఉన్నప్పుడు కూడా ఆయన తన శాంతాన్ని కోల్పోలేదు.




మన ఆంతర్యం పరిమళాలు వెదజల్లే పుష్పంలా వికసించాలంటే నిరంతరం అనుగ్రహపూర్వకమైన వాతావరణాన్ని మనమే సృష్టించుకోవాలి. జీవితంలో మనం ఏం చేశాం, ఎంత సంపాదించాం, కోరుకున్న వాటిలో ఏది జరిగింది, ఏది జరగలేదు... ఇలాంటి విషయాలకు ఎలాంటి విలువా లేదు. కష్టమైన సమయాల్లో ఎలా నిలదొక్కుకున్నాం అనేదే ప్రధానం. శ్రీరాముడిలా హుందాగా ఈ జీవితాన్ని సాధ్యమైనంత అవలీలగా ఎలా దాటామన్నదే అన్నిటికన్నా ముఖ్యం. 


 సద్గురు జగ్గీవాసుదేవ్‌


Updated Date - 2021-04-16T05:30:00+05:30 IST