Pakistan: పాకిస్తాన్‌లోని కరాచీలో హిందూ ఆలయం ధ్వంసం.. విగ్రహాలను పగలగొట్టి..

ABN , First Publish Date - 2022-06-10T00:59:58+05:30 IST

పాకిస్తాన్‌లో హిందూ దేవాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. కరాచీలోని సింధూ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. కరాచీ నగరంలోని Korang Number 5 ప్రాంతంలో..

Pakistan: పాకిస్తాన్‌లోని కరాచీలో హిందూ ఆలయం ధ్వంసం.. విగ్రహాలను పగలగొట్టి..

కరాచీ: పాకిస్తాన్‌లో హిందూ దేవాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. కరాచీలోని సింధూ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. కరాచీ నగరంలోని Korang Number 5 ప్రాంతంలో శ్రీ మారి మాత మందిర్ ఉంది. ఈ ఆలయంలో హనుమాన్‌ విగ్రహంతో పాటు శివలింగం, మరికొన్ని దేవుళ్ల పటాలున్నాయి. బైక్‌లపై గుంపుగా ఆ ఆలయానికి వెళ్లిన కొందరు దుండగులు ఆ విగ్రహాలను, పటాలను ధ్వంసం చేశారు. అంతేకాదు.. ఆలయానికి సమీపంలో ఉన్న హిందువుల ఇళ్లపై కూడా దాడి చేశారు. ఈ ఘటన బుధవారం పొద్దుపోయాక జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అరెస్ట్‌లు జరగకపోవడం గమనార్హం. నిర్మాణంలో ఉన్న ఈ ఆలయంలో ఒక పూజారి కొన్ని రోజుల క్రితం విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారు. విగ్రహాలు దుండగుల దాడిలో పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఎవరు, ఎందుకు ఈ దాడులకు పాల్పడ్డారో తమకు తెలియదని స్థానికంగా ఉన్న హిందువులు చెప్పారు. ఈ ఘటనను కళ్లారా చూసిన ప్రధాన సాక్షి స్పందిస్తూ.. ఆరు నుంచి ఎనిమిది మంది వరకూ మోటార్‌సైకిల్స్‌పై వచ్చి ఆలయంపై దాడి చేశారని మీడియాకు చెప్పాడు.



పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ.. ఆధారాలను సేకరిస్తున్నామని, ఆ ప్రాంతంలో ఉన్న హిందువులకు భద్రత కల్పిస్తామని తెలిపారు. పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాలపై ఈ తరహా దాడులు తరచుగా జరుగుతుండటంతో అక్కడ నివసిస్తున్న మైనార్టీలైన హిందువులు ఆందోళన చెందుతున్నారు. ఈ మూక దాడుల్లో గతేడాది అక్టోబర్‌లో కూడా ఒక చారిత్రక దేవాలయం ధ్వంసమైంది. పాకిస్తాన్‌లో ఉన్న మానవ హక్కుల సంఘం కార్యకర్తలు మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లో మహిళలకు, మైనార్టీలకు, చిన్నారులకు, మీడియా ప్రతినిధులకు కనీస రక్షణ కరువైందని చెప్పారు. సింధ్ ప్రావిన్స్‌లో హిందూ, సిక్కు, క్రైస్తవ బాలికలపై బలవంతంపు మత మార్పిడులకు పాల్పడుతున్న ఘటనలు కూడా రోజురోజుకూ పెరిగిపోతుండటం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది.

Updated Date - 2022-06-10T00:59:58+05:30 IST