బడి సురక్షితంగా...

ABN , First Publish Date - 2021-02-02T07:52:25+05:30 IST

దాదాపు 11 నెలల విరామం తర్వాత 9 నుంచి 12వ తరగతుల పిల్లలు బడులకు వెళ్తున్నారు. అయితే కట్టుదిట్టమైన జాగ్రత్తలు పాటిస్తూ, తమ పిల్లలను కొవిడ్‌ మహమ్మారి నుంచి ఇప్పటివరకూ కాపాడుకుంటూ

బడి సురక్షితంగా...

కరోనా మహమ్మారితో మూతపడిన బడి 

తలుపులు తెరుచుకున్నాయి. కరోనా 

సోకుతుందేమోననే భయం, చదువు 

దూరమవుతుందేమోననే ఆందోళనలు ఉన్నప్పటికీ

తల్లిదండ్రులు భయం భయంగానే పిల్లలను 

బడులకు పంపించే పరిస్థితి. అయితే 

బలవర్ధకమైన పౌష్ఠికాహారం, రక్షణ చర్యలతో 

పిల్లలను కొవిడ్‌ మహమ్మారి నుంచి 

కాపాడుకోవచ్చు అంటున్నారు వైద్యులు.



దాదాపు 11 నెలల విరామం తర్వాత 9 నుంచి 12వ తరగతుల పిల్లలు బడులకు వెళ్తున్నారు. అయితే కట్టుదిట్టమైన జాగ్రత్తలు పాటిస్తూ, తమ పిల్లలను కొవిడ్‌ మహమ్మారి నుంచి ఇప్పటివరకూ కాపాడుకుంటూ వచ్చిన తల్లిదండ్రులు పిల్లలను తిరిగి బడికి పంపించాలంటే ఎంతోకొంత భయానికి లోనవడం సహజమే! బడిలో ఎలా మసలుకుంటారో? తోటి పిల్లలతో దూరం పాటిస్తారో, లేదో? లాంటి అనుమానాలు సహజమే! అయితే కరోనా నుంచి రక్షణ కల్పించే ఆయుధాలను పిల్లలకు అందిస్తే, ఆ మహమ్మారి గురించి చింతించవలసిన అవసరం ఉండదు. అవేమిటంటే....


ఈ ఏడాది కూడా!

18 ఏళ్ల కంటే తక్కువ వయసు వారికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు ఫలించి పిల్లలకు కూడా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి కనీసం మరో ఏడాది పట్టవచ్చు. ప్రస్తుతానికి తోక ముడిచిన కరోనా వైరస్‌, కొత్త రూపం దాల్చే వీలూ లేకపోలేదు. గత ఏడాది మార్చి, ఏప్రెల్‌ నెలల్లోనే కొవిడ్‌ వెలుగులోకి వచ్చింది కాబట్టి, సరిగ్గా ఏడాదికి మరోసారి విరుచుకుపడుతుందేమో అనే ప్రశ్న వెంటాడుతూ ఉంది. కాబట్టి మరో రెండు నుంచి మూడు నెలలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోక తప్పదు. ఆఫ్‌లైన్‌ క్లాసులతో పాటు ఆన్‌లైన్‌ క్లాసులను కూడా కొన్ని స్కూళ్లు కొనసాగిస్తున్నాయి. ఒకవేళ పిల్లలు చదివే స్కూల్‌ ఈ సౌకర్యాన్ని అందిస్తూ ఉంటే, ఈ ఏడాది కూడా పిల్లలను బడికి పంపించకుండా ప్రస్తుత విద్యాసంవత్సరం కూడా ఆన్‌లైన్‌ తరగతులే కొనసాగించేలా చేయడమే ఉత్తమం. ఆఫ్‌లైన్‌ తరగతులు కేవలం పాఠాలకు సంబంధించిన అనుమానాల నివృత్తికి, పరీక్షలకు సంబంధిన వివరాలు తెలుసుకోవడం కోసం మాత్రమే హాజరైతే సరిపోతుంది.



బడిలో ఇలా...

గుంపులు కూడవద్దు: పిల్లలు టీచర్ల చుట్టూ గుంపుగా కూడి, పాఠాలకు సంబంధించిన సందేహాలను అడుగుతూ ఉంటారు. ఇది సరి కాదు. కూర్చున్న చోటు నుంచి చేతిని లేపి, అడిగి, అనుమానాలు నివృత్తి చేసుకోవాలి.


లంచ్‌ టైమ్‌: ఈ సమయంలో ఇమ్యునిటీ అత్యవసరం కాబట్టి స్నాక్స్‌ లేదా లంచ్‌ బాక్స్‌లో నింపిన పదార్థాలన్నీ ఖాళీ చేయాలి. ఇంటి నుంచి తెచ్చుకున్న నీళ్లే తాగాలి.

శానిటైజర్‌: తరచుగా చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. 

దూరం: తోటి విద్యార్థులతో ఆరు అడుగుల దూరం పాటించాలి. వారి వస్తువులను తాకకూడదు.  

నిర్లక్షం వద్దు: ఏ కాస్త నలతగా ఉన్నా టీచర్ల దృష్టికి తీసుకువెళ్లాలి. జలుబు, దగ్గు, జ్వరాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.


ఫిట్‌నెస్‌ కోసం...

ఈ సమయంలో పిల్లలకు శారీరక వ్యాయామం కూడా ముఖ్యమే! అలాగని పిల్లలను జిమ్‌కు పంపించవలసిన అవసరం లేదు. అవి సురక్షితం కూడా కాదు. కాబట్టి ఇంటి చుట్టూ పరిగెత్తించడం లేదా ఇంట్లోనే ట్రెడ్‌మిల్‌ మీద పరిగెత్తించడం చేయాలి. సైకిల్‌ తొక్కడం కూడా మంచిదే! ఇంటి ఆవరణలో బ్యాట్మింటన్‌ ఆడుకోవచ్చు. స్కిప్పింగ్‌, రన్నింగ్‌, జంపింగ్‌ లాంటి ఆటలతో సరిపడా వ్యాయామం దక్కేలా చేయవచ్చు. యోగా కూడా అలవాటు చేయవచ్చు.



ఉపాధ్యాయులు చేయాల్సినవి

శానిటైజర్‌: ప్రతి తరగతి గదిలో శానిటైజర్‌ ఏర్పాటు చేయాలి.

తరగతి గదిలో: ఆరు అడుగుల దూరంతో బెంచీకి ఇద్దరు చొప్పున విద్యార్థులను కూర్చోబెట్టాలి.

హోమ్‌వర్క్‌: హోమ్‌వర్క్‌ కరెక్షన్‌ రూపంలో పుస్తకాలు చేతులు మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పట్లో హోమ్‌వర్క్‌ ఇవ్వకపోవడమే మేలు. హోమ్‌వర్క్‌ ఆన్‌లైన్‌ ద్వారా కొనసాగాలి. 

క్రీడలు: ఆటలన్నీ కొవిడ్‌ సోకే అవకాశాలను పెంచేవే! ఆట వస్తువులైన బాల్స్‌, బ్యాట్స్‌ కూడా పదే పదే పిల్లల చేతులు మారుతూ ఉంటాయి. కాబట్టి కొవిడ్‌ సోకే వీలుంది. అందుకే ఈ సమయంలో పిల్లలను ఆటలకు దూరంగా ఉంచాలి.


బడికి వెళ్లే ముందు...

ఫేస్‌ షీల్డ్‌ తప్పనిసరి: పిల్లలు కచ్చితంగా మాస్క్‌లు ధరించాలి. వాటితో పాటు ముఖాన్ని కప్పి ఉంచే ఫేస్‌ షీల్డ్‌ అదనంగా ధరించేలా చూడాలి. వీలైతే చేతులకు గ్లౌజులు కూడా వేయాలి. 

ట్రాన్స్‌పోర్ట్‌: స్కూల్‌ బస్సులకు బదులుగా సొంత ట్రాన్స్‌పోర్ట్‌ ఎంచుకోవడం ఉత్తమం. పెద్దలే పిల్లలను సొంత వాహనంలో బడికి తీసుకువెళ్లి, తీసుకువచ్చే పద్ధతి పాటిస్తే కొవిడ్‌ సోకే అవకాశం కొంతమేరకు తగ్గించుకోవచ్చు.

షేరింగ్‌: లంచ్‌ బాక్స్‌, పుస్తకాలు, పెన్నులు... ఇలా పిల్లలు తోటి విద్యార్థులు, స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. ఈ అలవాటుకు స్వస్తి చెప్పమని పిల్లలకు చెప్పాలి. ఈ వస్తువుల ద్వారా కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి అంటుకునే వీలుంటుంది.

స్కూల్‌ బ్యాగులో: శానిటైజర్‌, అదనంగా ఫేస్‌ మాస్క్‌, స్నాక్‌ బాక్స్‌, న్యాప్కిన్స్‌, టిష్యూ పేపర్లు తప్పనిసరిగా పిల్లల స్కూలు బ్యాగులో ఉంచాలి.

స్వల్ప అస్వస్థత ఉంటే: జ్వరం, జలుబు, దగ్గు... ఎంత స్వల్పంగా ఉన్నా పిల్లలను బడికి పంపించకూడదు.


ఇమ్యూనిటీ ఫుడ్‌!

పుట్టుకతో, తల్లిపాల ద్వారా, ఆహారం ద్వారా... ఇలా మూడు మార్గాల్లో వ్యాధినిరోధకశక్తి అలవడుతుంది. మొదటి రెండు రూపాల్లో ఇమ్యూనిటీనీ మనంతట మనంగా పెంచుకునే వీలు లేకపోయినా, ఆహారం ద్వారా రోగనిరోధకశక్తిని పెంచుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి తల్లులు పిల్లలకు అందించే ఆహారం పట్ల అవగాహనతో మెలగడం అవసరం. 


ఇంట్లో వండిన తాజా ఆహారం: పిల్లలను బడికి పంపించే హడావిడిలో నూడుల్స్‌, కార్న్‌ఫ్లేక్స్‌ లాంటి రెడీమేడ్‌ ఫుడ్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా గోధుమ రవ్వ ఉప్మా, ఇడ్లీ, దోశ, కిచిడి లాంటి బలవర్ధక పోషకాహారం అల్పాహారంగా ఇవ్వాలి. 

జంక్‌ ఫుడ్‌: బిస్కెట్లు, చిప్స్‌, బ్రెడ్‌ లాంటి స్నాక్స్‌కు బదులుగా తాజా పండ్ల ముక్కలు, కూరగాయ ముక్కలు, డ్రై ఫ్రూట్స్‌ కలిపి ఇవ్వాలి.

కూరగాయలు: భోజనంలో కనీసం రెండు, మూడు రకాల కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. బఠాణీ, బ్రొకొలి, తీపి మొక్కజొన్న, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, క్యాప్సికం... ఇలా భిన్న కూరగాయలను కలిపి కూరగా వండి, వడ్డించాలి.

ప్రొటీన్‌ ఎక్కువగా: ఆహారంలో ప్రొటీన్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ప్రతి రోజూ ఉడకబెట్టిన గుడ్డు తినిపించవచ్చు. రోజు మొత్తంలో ఒక గ్లాసు పాలు ఇవ్వవచ్చు. చికెన్‌, చేపలు తగుమాత్రంగా ఇవ్వవచ్చు. సోయాలో కూడా ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటుంది. పప్పుదినుసులతో కూడిన కిచిడి, జీడిపప్పు వేసిన బొంబాయి రవ్వ ఉప్మాతో కూడా ప్రొటీన్‌ అందుతుంది. 

రెండు పళ్లు: పిల్లలు రోజు మొత్తంలో కనీసం రెండు రకాల పండ్లు తినేలా చూడాలి. యాపిల్స్‌, కివి, డ్రాగన్‌ ఫ్రూట్‌ లాంటి ఖరీదైన పండ్లనే ఎంచుకోవలసిన అవసరం లేదు. పిల్లలు ఇష్టపడే అరటిపండు, జామ పండు ద్వారా కూడా సరిపడా పోషకాలు అందుతాయి.

డ్రైఫ్రూట్స్‌: రోజు మొత్తంలో కనీసం రెండు, మూడు రకాల డ్రై ఫ్రూట్స్‌ తినేలా చూడాలి. ఒకటి రెండు వాల్‌నట్స్‌, రెండు, మూడు బాదం, నాలుగైదు జీడిపప్పులు పిల్లలకు అందించాలి. వీటిని పొడిచేసి, స్నాక్స్‌లో కలిపి ఇవ్వవచ్చు. వేరుసెనగపప్పు కూడా మంచిదే! వీటన్నిటినీ కలిపి డ్రై ఫ్రూట్‌ లడ్డు తయారుచేసి, అందించవచ్చు.

స్నాక్స్‌: పిల్లలతో పాటు బడికి పంపించే స్నాక్స్‌గా డ్రై ఫ్రూట్‌ పాయసం, ఫ్రూట్‌ సలాడ్‌, పండ్ల ముక్కలు ఇవ్వవచ్చు.


డాక్టర్‌ సత్యన్నారాయణ కావలి

ఎమ్‌డి పీడియాట్రిక్స్‌,

సీనియర్‌ కన్సల్టెంట్‌,

రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌,

ఎల్‌.బి.నగర్‌, హైదరాబాద్‌.


Updated Date - 2021-02-02T07:52:25+05:30 IST