సీటు వదలట్లేదు..!

ABN , First Publish Date - 2022-08-18T05:10:16+05:30 IST

నంద్యాల చిన్న నీటిపారుదల శాఖలో ఇనచార్జిలుగా వ్యహరిస్తున్న ఇద్దరు ఇంజనీర్లు సీట్లు వదలకపోవడం హాట్‌ టాఫిక్‌గా మారింది.

సీటు వదలట్లేదు..!
నంద్యాల మైనర్‌ ఇరిగేషన కార్యాలయం

  1. మైనర్‌ ఇరిగేషనశాఖలో ఇద్దరు ఇంజనీర్ల నిర్వాకం
  2. బదిలీపై వచ్చిన అధికారులకు బాధ్యతలు అప్పగించని వైనం
  3. తెరవెనుక ముఖ్య ప్రజాప్రతినిధులు ఉన్నారన్న ఆరోపణలు 


నంద్యాల టౌన, ఆగస్టు 17: నంద్యాల చిన్న నీటిపారుదల శాఖలో ఇనచార్జిలుగా వ్యహరిస్తున్న ఇద్దరు ఇంజనీర్లు సీట్లు వదలకపోవడం హాట్‌ టాఫిక్‌గా మారింది. వీరి స్థానంలో ఇద్దరు ఇంజనీర్లు బదిలీపై వచ్చినా బాధ్యతలు అప్పగించపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నారు. చిన్న నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నీరు - చెట్టు పనుల్లో రూ.కోట్లలో పనులు చేసిన కాంట్రాక్టర్ల మేలు కోసమే ఫెవికాల్‌ ఇంజనీర్లు సీటు వదలడం లేదన్న విషయం ఆ శాఖలో గుప్పుమంటోంది. నంద్యాల పార్లమెంట్‌ పరిధిలోని ముఖ్య ప్రజా ప్రతినిధులు వీరి వ్యవహారంలో తెర వెనుక చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.

సీటు వదిలేందుకు డీఈ ససేమిరా

నంద్యాల మైనర్‌ ఇరిగేషన డివిజనలో నాలుగు సబ్‌ డివిజన్లు ఉన్నాయి. ఇందులో నంద్యాల సబ్‌ డివిజన, సర్వే అండ్‌ ఇన్వెస్టిగేషన (ఎస్‌ఐ) సబ్‌ డివిజన నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు సబ్‌ డివిజన్లు ఉన్నాయి. గత కొంతకాలంగా నందికొట్కూరు సబ్‌ డివిజనకు చెందిన డీఈ ఎస్‌ఐ సబ్‌ డివిజనకు అడిషనల్‌ ఇనచార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో (జూలై 6) ఎస్‌ఐ సబ్‌ డివిజనకు వెలుగోడు నుంచి డీఈని రెగ్యులర్‌ ప్రతిపాదికన బదిలీ చేశారు. అయితే ఇనచార్జిగా వ్యవహరిస్తున్న నందికొట్కూరు డీఈ ఎస్‌ఐ సబ్‌ డివిజనకు సంబంధించిన ఫైళ్లను, ఎంబుక్కులు తదితర సాంకేతిక పరమైన, విధులకు సంబంధించిన బాధ్యతలను బదిలీపై వచ్చిన కొత్త అధికారికి అప్పగించలేదు. ఎస్‌ఐ సబ్‌ డివిజనకు బదిలీపై వచ్చిన డీఈకి విధి నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు అప్పగింతలో ఇనచార్జిగా వ్యవహరిస్తున్న డీఈ ససేమిరా అంటుండడం వెనుక అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

తనకో నీతి.. ఎదుటివారికో నీతి

నంద్యాల మైనర్‌ ఇరిగేషన జేఈగా వ్యవహరిస్తున్న ఓ ఇంజనీర్‌ అదనపు బాధ్యతలతో బనగానపల్లె సెక్షనకు కూడా జేఈగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో నంద్యాల జేఈని నందికొట్కూరు సబ్‌ డివిజన ఆత్మకూరు సెక్షనకు రెగ్యులర్‌ ప్రతిపాదికన నియమించారు. అప్పటి వరకు ఆత్మకూరు ఇనచార్జిగా వ్యవహరిస్తున్న ఓ మహిళా అధికారి నుంచి బాధ్యతలను పట్టుబట్టి తీసుకున్న ఈ అధికారి, తాను ఇనచార్జిగా వ్యవహరిస్తున్న బనగానపల్లె సెక్షనను మాత్రం వీడడం లేదు. బనగానపల్లెకు కొత్త జేఈగా ఆళ్లగడ్డ ఎంఐ సబ్‌ డివిజన రుద్రవరం సెక్షన నుంచి  ఓ అధికారి నియమితులయ్యారు. తనకో నీతి, ఎదుటివారికో నీతి అన్నచందంగా ఈ జేఈ వ్యవహరం ఎంఐ శాఖలో తీవ్ర విమర్శలకు తెరలేపింది. 

   నెలన్నర అవుతున్నా..

జూలై 6న సాధారణ బదిలీలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్‌ ప్రతిపాదికన బదిలీలు జరిగినప్పటికీ కొత్తవారికి మైనర్‌ ఇరిగేషన శాఖలో సాంకేతికపరమైన, విధి నిర్వహణకు సంబంధించిన పైళ్లను అప్పగించకుండా ఫెవికాల్‌ ఇంజనీర్లు తమ వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నట్లు ప్రచారం చేసుకుంటూ తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బదిలీపై వచ్చిన ఇంజనీర్లు కేవలం కుర్చీలకే పరిమితమయ్యారే తప్ప విధి నిర్వహణలో పర్యవేక్షణ బాధ్యతలు లేకపోవడంతో ఫెవికాల్‌ ఇంజనీర్ల భాగోతం ఆ శాఖలో అలజడి రేపుతోంది. 

ముఖ్య ప్రజాప్రతినిధుల అండతోనే..?

 మైనర్‌ ఇరిగేషన శాఖలో జరిగిన నీరు - చెట్టు పనుల్లో భాగంగా రూ.కోట్ల పనులు జరిగాయి. ఇందుకు సంబంధించి బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొందరు కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీరు - చెట్టు పనుల బిల్లులకు సంబంధించి ఎక్కువగా అధికార పార్టీకి చెందిన నాయకుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నంద్యాల పార్లమెంట్‌ పరిధిలోని ముఖ్య ప్రజా ప్రతినిధులు తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నీరు-చెట్టు పనులకు సంబంధించిన బిల్లులు వచ్చేంతవరకు బదిలీపై కొత్తగా వచ్చిన ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించకుండా చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నీరు - చెట్టు బిల్లుల అప్‌లోడ్‌ కోసమే 

నీరు - చెట్టు బిల్లులకు సంబంధించి అప్‌లోడ్‌ కోసమే ఇనచార్జిలుగా వ్యవహరిస్తున్న అధికారులు కొత్తవారికి ఎం బుక్కులు, సీఎఫ్‌ఎంఎస్‌ వివరాలు ఇవ్వలేదు. కొత్తగా వచ్చిన ఇంజనీర్లు సాధారణ విధి నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. 

- రఘురామిరెడ్డి, ఈఈ, చిన్న నీటిపారుదల శాఖ, నంద్యాల 


Updated Date - 2022-08-18T05:10:16+05:30 IST