పాలమూరు యూనివర్సిటీలో సమస్యల తిష్ఠ

ABN , First Publish Date - 2022-06-26T04:44:13+05:30 IST

మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్శిటీలో ఏ విభాగాన్ని పరిశీలించినా, ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి.

పాలమూరు యూనివర్సిటీలో సమస్యల తిష్ఠ
పాలమూరు యూనివర్సిటీ

 గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యనందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లో సమస్యలు పేరుకుపోయాయి. యూనివర్సిటీ ఏర్పాటై 14 ఏళ్లు గడుస్తున్నా కనీస వసతులు కరువయ్యాయి.  సహనం నశించిన విద్యార్థులు ఏకంగా యూనివర్సిటీ వద్ద ఆరు గంటల పాటు నిరవధికంగా ధర్నాకు దిగడమే ఇక్కడ నెలకొన్న సమస్యల తీవ్రతను తెలియజేస్తోంది. విద్యార్థుల ధర్నా సందర్భంగా వైస్‌ఛాన్సలర్‌ ఇచ్చిన హామీ మేరకు జూలై 15లోగా అయినా యూనివర్శిటీకి అవసరమైన సదుపాయాలు కల్పిస్తారా.. లేదా? అనే సందిగ్థత విద్యార్థుల్లో కనిపిస్తోంది. 

  - మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతిప్రతినిధి

మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్శిటీలో ఏ విభాగాన్ని పరిశీలించినా, ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. విజ్ఞాన భాండాగారంగా ఉండాల్సిన పీయూ లైబ్రరీ పాతపుస్తకాలకే పరిమితమైంది. ఇక్కడ ప్రస్తుతం పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడే కొత్త పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలు అందుబాటులో లేవు. దాతలు సమకూర్చిన కొన్ని పుస్తకాలు మాత్రమే ఉండడంతో విద్యార్థులు ప్రైవేట్‌ పబ్లికేషన్స్‌ నుంచి పుస్తకాలు తెచ్చుకొని చదవాల్సి వస్తోం ది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ-లైబ్రరీ నామమాత్రంగా ఉన్నది. ఈ-లైబ్రరీలో సైతం ఆన్‌లైన్‌లో అన్ని రకాల పుస్తకాలు లేవని, కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు వాపోతున్నారు. వీటన్నింటికీ మించి యూనివర్సిటీలో ఉచిత వైపై కూడా అందుబాటులో లేదని వాపోతున్నారు. ఆధునిక సమాజంలో ఉన్నత విద్యకు ఇంటర్నెట్‌ వినియోగం ఆవశ్యకమని, అలాంటి చోట్ల వైఫై లేకుంటే, ప్రైవేట్‌ నెట్‌ద్వారా ఫీజులు చెల్లించి నెట్‌ సదుపాయం పొందాల్సిరావడం భారం గా మారిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.  పోలీసు పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ శిక్షణ కోసం ట్రైనర్లను అందుబాటులో ఉంచాలని కోరినా, ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 హాస్టళ్లలో అంతంతే..

పీయూలోని పురుష, మహిళల హాస్టళ్లలోనూ అనేక సమస్యలు పేరుకుపోయాయి. మహిళలకు సంబంధించి, అడ్మిషన్లు పెరగడంతో హాస్టల్‌ గదులు సరిపోకపోవడంతో గతంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో సమీపంలోని కేజీబీవీ వద్ద 12 గదులు అద్దెకు తీసుకొని కొందరు విద్యార్థినులను అందులో సర్దుబాటు చేశారు. యూనివర్సిటీలో ఉన్న పురుషుల, మహిళల హాస్టల్‌ గదులకు కిటీకీలు, తలుపులు సక్రమంగా లేవని, దీంతో రాత్రివేళల్లో ఈదురుగాలులు వీస్తుండడంతో చలికి, వానాకాలంలో వర్షపునీరు లోపలకు వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. అదేవిధంగా యూనివర్సిటీలోపల రోడ్ల వెంబడి లైట్లు లేవని, దీంతో రాత్రివేళ అత్యవసర సమయంలో బయటకు రావాలంటే భయమేస్తోందని, నిత్యం యూనివర్సిటీ ప్రాంగణంలో పాములు, తేళ్లు సంచరిస్తున్నాయ ని, ఈ సమస్యను పరిష్కరించకపోతే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోననే ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. యూనివర్సిటీలో సెక్యూరిటీ సక్రమంగా లేదని, నిఘా కొరవడిందని, దీంతో రాత్రివేళ నాన్‌బోర్డర్లు యూనివర్శిటీల్లోకి వస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సరైన నిఘా లేకపోవడంతో విద్యార్థుల సెల్‌ఫోన్లు కూడా చోరీ జరుగుతున్నాయని వాపోయారు. యూనివర్శిటీలో  ఫ్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంటు నెలరోజుల నుంచి  పనిచేయకపోవడం తో బోరునీరే తాగాల్సి వచ్చిందని విద్యార్థులు వాపోతున్నారు. 

 









Updated Date - 2022-06-26T04:44:13+05:30 IST