Advertisement

సలలిత స్వర రాగ గంగా ప్రవాహమే బాలు

Sep 27 2020 @ 00:13AM

బాలు పాటలు మాట్లాడుతాయి. ఆయన మాటలు పాటలై పలుకుతాయి. కొన్ని విశిష్టపాత్రల్లో బాలును చూస్తుంటే పాటల్లో, మాటల్లో ఎంత సునాయాసంగా భావాలు పలికించాడో ముఖంలో కూడా అంతే సునాయాసంగా భావాల్ని పలికించాడీ ఈ కళా మాంత్రికుడు అనిపిస్తుంది. అన్నమయ్యలో ‘నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీ నారాయణా’ అన్న ‌అన్నమయ్య కీర్తన బాలుకు అజరామరకీర్తిని తెచ్చిపెట్టింది. అన్నమయ్య తరువాత మళ్లీ బాలు రామదాసు చిత్రాన్ని, ‘‘అంతా రామమయం ఈ జగమంతా రామమయం’’ సహా అనేక భక్తరామదాసు కీర్తనలతో సుసంపన్నం చేశారు. ‘‘నను బ్రోవమని చెప్పవే’’ అని దైన్యాన్ని పలికించాడు బాలు. అటువంటి గాయకులు మళ్ళీ రారు.


ఆయన గళశ్రీపతి, సంగీత పండితారాధ్యుడు, మనసంతా బాలుడు, పాములను–పాపలను సైతం తలలాడింప చేసే సుబ్రహ్మణ్యం. బాలు సమధుర సుస్వర సురాధీశుడు. సలలిత స్వర రాగ గంగా ప్రవాహం. వెంటిలేటర్ ఆయన్ను బతికించలేదు, కళా వైవిధ్యం బతికించింది. ఎక్మో సాయం చేయలేదు. ఎక్కడికీ వెళ్లనీయక ఆ స్వరం అందరినీ కట్టిపడేసేది. తన పాట అవసరం లేదనుకున్న తెలుగు పెద్దతెరను సున్నితంగా పక్కకుబెట్టి, చిన్నతెరను సొంతం చేసుకున్న పెద్దమనిషి ఈ బాలుడు. పాడుతా తీయగా అంటూ లక్షలాది గాయక చిరుదివ్వెలను వెలిగించి ప్రపంచమంతా కోటానుకోట్ల కాంతులు నింపిన ‘దివి సూర్యసహస్రస్య’ ఆయన. ఒక్కొక్కరి పాటను ఆయన విశ్లేషించిన తీరు, ఒక్కొక్క స్వరాన్ని సవరించిన తీరు, ఒక్కొక్క వర్ధమాన గాయకుడిని భావి సంగీతజ్ఞుడిగా తీర్చిదిద్దిన తీరు, మరొకరికి రాదు. అది అనితర సాధ్యం, సంగీత సరస్వతికి ఆయన చేసిన నైవేద్యం. బాలు మెచ్చుకోలు బలంతో గొంతులు విప్పిన కోయిలలు ప్రపంచమంతా మధుర వసంతధ్వానాలు చేస్తున్నాయి, చేస్తుంటాయి. 


ఘంటసాల పాడుతూ చనిపోవాలనుకున్నాడు. అదేవిధంగా తెలుగు సినీసీమలో తీయగా పాడుతూనే పోయిన వాడు. కాని తీయగా పాడాలని ఎందరికో స్వరాలు నేర్పుతూ తీయగా పాడుతూ ఉండగా, హాయిగా పోయిన వాడు బాలసుబ్రహ్మణ్యం. 


‘ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో’ అన్న దాశరథి గేయంతో మొదలైన బాలు స్వరపథ యాత్ర ‘‘ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయలీనాలతో’’ మనోఫలకాల్లోకి, జనపథంలోకి నడిచింది. ‘‘శివరంజనీ నవరాగిణీ’’ అనీ ‘‘సాగరసంగమమే ఒక యోగం’’ అని ఘోషించింది ఆయన గొంతు. బాపు తీసిన త్యాగరాజు సినిమా కోసం అనేకానేక త్యాగరాజ కీర్తనలను అలవోకగా ఆలపించిన గొంతు అది. ‘‘మాటే రాని చిన్నదాని మనసు పలికే పాటలు’’ అంటూ పదానికి పదానికి మధ్యగానీ, చరణానికి పల్లవికీ మధ్యగానీ శ్వాసకు చోటులేని రాగస్రవంతిని అద్భుతంగా ప్రవహింపచేసిన గంధర్వుడు. ‘‘సిరిమల్లి నీవే’’ అంటూ శ్రోతల మనసుల్లో మల్లెల వాసనలు గుప్పించిన సంగీత జయంతవసంతుడు. ఘంటసాలతో గొంతు కలిపి ‘‘ప్రతిరాత్రీ వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలి’’ అని పాడుతూ ఉంటే వెన్నెల రాత్రులలో పైరులు, ప్రియులూ ఊగిపోవలసిందే కదా. 


‘‘ఏ పారిజాతమ్ము లీయగలనో సఖీ గిరిమల్లికలు తప్ప గరికపూవులు తప్ప’’ అని ఏకవీర సినిమాకు సినారె రాసిన ప్రయోగ గేయానికి స్వరాన్నిచ్చిన స్వరధుని.ఆఖరిపోరాటం అనే సినిమాకు లతామంగేష్కర్ తెలుగులో మధురంగా ‘‘తెల్ల చీరకు తకధిమి తపనలు రేగెనమ్మ సందె వెన్నెల్లో’’ అని పాడితే ఆమెతో కలిసి అంత లేతగా ‘సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ సందె నవ్వుల్లో’ అని తీయని స్వరాలూదిన వాడు బాలు.  ఒకసారి రవీంద్రభారతిలో వేటూరి సుందరరామమూర్తికి సన్మానం చేసిన సభలో బాలు వేటూరి రాసిన పాటల పల్లవులెన్నో పాడి ఆ కవి చరణాల మీద పడిన తీరు మరిచిపోలేము. కళాతపస్వి విశ్వనాథ్ చాలా అభిమానించే గాయకుడు. 


ఆయన సినీజీవన పయనం అనేకానేక వైవిధ్యపాత్రల్లో సాగింది. పాటతో పాటు బాలు అనేక బాటల్లో నడిచాడు. కమలహాసన్ డబ్బింగ్ తెలుగు సినిమాలకు బాలు గొంతు ఎంతగా నప్పేదంటే, కమల్ ఒకసారి సొంత గొంతుతో మాట్లాడినప్పుడు శ్రోతలకు నచ్చనేలేదు. ఆయన పాటలు మాట్లాడుతాయి. ఆయన మాటలు పాటలై పలుకుతాయి. కొన్ని విశిష్టపాత్రల్లో బాలును చూస్తుంటే పాటల్లో, మాటల్లో ఎంత సునాయాసంగా భావాలు పలికించాడో ముఖంలో కూడా అంతే సునాయాసంగా భావాల్ని పలికించాడీ ఈ కళా మాంత్రికుడు అనిపిస్తుంది. అన్నమయ్యలో ‘నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీ నారాయణా’ అన్న అన్నమయ్య కీర్తన బాలుకు అజరామరకీర్తిని తెచ్చిపెట్టింది. అన్నమయ్యలో బాలు విశ్వరూపం తెర వెనుక కనిపిస్తుంది. శ్రీ వేంకటేశునికి బాలు గొంతు ఇచ్చి పలికిన తీరు ఒక అద్భుతం. అన్నమయ్యకు అడ్డుతగిలి అతన్ని మార్చిన యతిగా, పెళ్లికి ఒప్పించిన కోయదొరగా, పెళ్లి చేయించిన పురోహితుడిగా, వేంకటేశుడిగా సుమన్ పాత్రకు తన స్వర వైవిధ్యంతో వన్నె తెచ్చిన మాటగాడు ఈ పాటగాడు. 


నేను ఒకసారి బెంగుళూరు విమానాశ్రయంలో బస్సులో ఆయనతో పాటు కూర్చున్నపుడు మాట కలిపాను. అన్నమయ్య పరాకాష్ఠ సన్నివేశంలో ‘అంతర్యామి అలసితి సొలసితి’ అన్న పాటకు ముందూ వెనుక, పాట సాగే సమయంలో బాలు అన్నింటా తానై భాసిల్లుతాడు. వెంకటేశునికి బాలు మాట్లాడిన మాటలతో అన్నమయ్యకు బాలు పాడిన పాట పోటీ పడే సన్నివేశం అది. ఆ విషయం గుర్తు చేస్తే, బాలు ఎంతో పొంగిపోయారు. అన్నమయ్య సినిమా క్లైమాక్స్ దృశ్యానికి నా విశ్లేషణ, మొత్తం సినిమాకు అది మణికిరీటం అన్న నా వ్యాఖ్య బాలుకు బాగా నచ్చింది. ‘‘మీ పాట గొప్పదే కాని పాట కన్న మీ మాట చాలా బాగుంటుందండీ’’ అని నేను అంటే ఆయన ఎంతో ఆనందపడిపోయి నాకు మిత్రుడైపోయారు. నేను ఇంకో మాట అన్నాను. కన్నడసీమలో మీ పాటలకు తెలుగునాట ఉన్న దాని కన్న మిన్నగా ఆదరణ, అభిమానం ఉందంటే ఆయన అవునని అనేక దృష్టాంతాలు చెప్పారు. తమిళసీమలో కూడా తనకు అంతే ఆదరణ ఉందని చెప్పారు. మీ సినీయాత్రలో అన్నమయ్య గొప్ప మజిలీ అని, మీ ప్రతిభకు తగిన అవకాశాన్ని రాఘవేంద్రరావు ఇచ్చారన్న నా మాటను మనః స్ఫూర్తిగా అంగీకరించి నాతో చేతులు కలిపారు. ఎయిర్‌పోర్ట్ దాటే దాకా ఒక అరగంట సేపు నాతోనే మాట్లాడుతూ ఉండిపోయారు. ఆ దృశ్యాలు ఇప్పుడే జరుగుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. అన్నమయ్య సినిమా దిగ్విజయానికి అనేక దిగ్గజాలు కారణం కావచ్చు. కాని బాలు పాట, మాట ఆ సినిమాకు కొండంత బలం.


అన్నమయ్య తరువాత మళ్లీ బాలు రామదాసు చిత్రాన్ని, ‘‘అంతా రామమయం ఈ జగమంతా రామమయం’’ సహా అనేక భక్తరామదాసు కీర్తనలతో సుసంపన్నం చేశారు. ‘‘నను బ్రోవమని చెప్పవే’’ అని దైన్యాన్ని పలికించాడు బాలు. 70 ఏళ్ల పైబడిన తరువాత కూడా స్టేజీ మీద, అనేకానేక స్వరాలు పలికిస్తూ మిమిక్రీ చేస్తూ అంతులేని కథ సినిమాలో ‘‘తాళికట్టు శుభవేళ’’ అనే తన అద్భుతమైన పాట తానే పాడుతూ ఉంటే ఎంత ఆశ్చర్యం. వయసు కనబడదు, బాలుడే అనిపించేది. పాత్రకు పాత్రధారికి అనుగుణంగా మారుస్తూ బాలు ఎన్టీరామారావుకు అక్కినేని నాగేశ్వరరావుకు గొంతునిచ్చినా శోభన్‌బాబుకు, కృష్ణకు ఒకే పాటలో గొంతు మార్చినా ఆయనకే చెల్లింది.


పాటల్లో రాటుదేలుతున్నప్పుడే ఆయన చిన్నచిన్న పాత్రల్లో కనిపించి నటుడుగా ఎదిగాడు. దక్షిణాది ప్రేమికుడు ఉత్తరాది ప్రియురాలు మధ్య ప్రేమకథ ఇతివృత్తంగా మరోచరిత్ర సినిమా ఆధారంగా ‘ఏక్ దూజే కే లియే’ అనే హిందీ సినిమా తీశారు. ఆ హీరోకు బాలు గొంతు ఎంతగానో అమరింది. దక్షిణాది యాసతో బాలు పాడిన హిందీ పాట ‘‘తెరే మేరే బీచ్ మే కైసాహై ఎ బంధన్ అంజానా...’’ మొత్తం భారతదేశాన్ని అప్పట్లో ఊపేసిన పాట.


తనికెళ్ల భరణి ప్రయోగ చిత్రం ‘మిథునం’లో బాలు ప్రతిభను చూడవచ్చు. అద్భుతః అనే మాటను తెలుగు నాట ప్రతినోటా నిలిపిన సినిమా అది. లక్ష్మితో కలిసి జంటగా ఆయన పాత్ర అద్భుతః. పిల్లలు అమెరికాలో ఉంటే తెలుగును, సంప్రదాయాన్ని కాపాడుతూ ఒంటరిగా బతికే జంట కథ అది. చాలా గొప్ప ప్రక్రియ. బాలు ఆ సినిమాకు జీవం పోశాడు. 


బాలు వంటి గాయకులు మళ్లీ రారు. హాస్పటల్‌కు వెళ్లే దాకా బాలు గొంతు నానాటికీ అతిశయిల్లుతూనే ఉంది. మాధుర్యం అసలు తరగలేదు. కాని తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు ఆయన ప్రతిభకు తగిన పాటల సన్నివేశాలు కల్పించకపోవడం, ఆయనతో పాడించకపోవడం బాధాకరం. అంతటి మహాగాయకుడితో ఎందుకు పాడించుకోలేదో అర్థం కావడం లేదు. కాని సమయానికి ఈటీవీ బాలుకు సరైన వేదిక కల్పించింది. ఆ చిన్నతెరను ఆయన లలిత సంగీత విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారు. ఎందరో చిన్నారులు అక్కడ పాటకు ‘పట్టా’భిషేకం చేసుకున్నారు. యువకులు గాయకులుగా ఎదిగారు. ఇవ్వాళ ఆయన స్వయంగా పాడుతూ, మాట్లాడుతూ రూపొందించిన వేలాది వీడియోలు యూట్యూబ్‌లో అందరికీ అందుబాటులో ఉంటూ బాలును ఒక్క క్లిక్‌తో సజీవంగా సాక్షాత్కరింపజేసే సాధనాలుగా మిగిలి ఉన్నాయి. సినిమాలో ఆయన పాటకు మరెవరో కనిపిస్తారు కానీ, స్వరాభిషేకం కార్యక్రమాల్లో సొంతంగా పాడుతూ బాలు మనకు ప్రతిపాటలో పలకరిస్తారు. బాలు ఈ లోకంలో లేకపోయినా ఆయన పాటలతో మాటలతో జనం పులకరిస్తారు.

మాడభూషి శ్రీధర్

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.