పాలకుల పాపం... నిన్న నెత్తురు, నేడు కన్నీరు!

ABN , First Publish Date - 2022-07-14T06:07:22+05:30 IST

మేరీలాండ్‌లోని రాక్‌విల్‌లో ఒక స్టోర్స్‌లో పనిచేసే శ్రీలంక కార్మికురాలితో ఒక భారతీయ కస్టమర్ ఇట్లా చెబుతున్నాడు. ‘‘ఇండియా చేయగలిగినంతా చేసింది, ఇంకా ఏమి...

పాలకుల పాపం... నిన్న నెత్తురు, నేడు కన్నీరు!

మేరీలాండ్‌లోని రాక్‌విల్‌లో ఒక స్టోర్స్‌లో పనిచేసే శ్రీలంక కార్మికురాలితో ఒక భారతీయ కస్టమర్ ఇట్లా చెబుతున్నాడు. ‘‘ఇండియా చేయగలిగినంతా చేసింది, ఇంకా ఏమి చేయగలుగుతుంది, సారీ, మీ వాళ్ల పరిస్థితి ఇట్లా అయినందుకు..’’ బాగుంది. అమెరికాలో ఒక ప్రవాసిని సహచర ప్రవాసి ఓదార్చడం, అందులోనూ పెద్దన్న బాధ్యతతో ఓదార్చడం.


ఆశ్చర్యంగా, అమెరికాలో చాలామంది పత్రికా రచయితలు కూడా, శ్రీలంక సంక్షోభంలో భారతదేశ నిస్సహాయత గురించి ఎంతో సానుభూతితో రాశారు. ఆహారపదార్థాలు, మందులు, ఇంధనం మొదలైన అత్యవసరాలను ఇండియా పంపిస్తూనే వచ్చింది. ఇంకా ఎంతకాలం అందించగలదు? ఔదార్యానికి కూడా ఒక హద్దుంటుంది కదా?– అంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. శ్రీలంకలో ఇటువంటి పరిస్థితులున్నప్పుడు, అంత సమీపంలో ఉన్న భారతదేశం ఏమి చేస్తున్నదన్న ప్రశ్న సహజంగా వస్తుంది. శ్రీలంకలో పట్టు కోసం భారత్, చైనాలు పోటీపడతాయి కదా, పరిస్థితిని ఇంతదాకా ఎందుకు రానిచ్చాయన్న సందేహమూ కలుగుతుంది. ఆ సందేహాలకు, ప్రశ్నలకు ఎవరికి తోచిన వివరణలు, ఎవరికి అనువైన సమాధానాలు వారు ఇస్తున్నారు.


ఇండియా పాత్ర, ప్రమేయం, సహాయం వంటి విషయాలు కాసేపు పక్కన బెడితే, భారతదేశంలోని ప్రజలు, ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రజలు, అందులోనూ ప్రభుత్వ వ్యతిరేకతల మీద అత్యంత కుతూహలం కలిగిన జనం, శ్రీలంక సన్నివేశాలను నిగూఢ ఆనందంతో గమనిస్తున్నారు. తమిళుల అణచివేతలో క్రూరంగా వ్యవహరించినందుకు తగిన శాస్తి జరిగిందని కొందరు సంతోషిస్తున్నారు. ప్రధానమంత్రి విక్రమసింఘే సొంత ఇంటిని తగులబెట్టడం సరే, అధ్యక్ష ప్రాసాదంలోకి వేలాది జనం చొచ్చుకుపోవడం ప్రత్యేకమైన ఉత్సుకతను రేకెత్తించింది. అధికారాన్ని ధిక్కరిస్తూ జనం పెద్ద ఎత్తున గుమిగూడడం ఎప్పుడైనా కన్నుల పండుగే. జాస్మిన్ విప్లవాలని పిలిచిన సందర్భాలలో ఇటువంటి జనసందోహాన్ని చూశాము. ప్రభుత్వ వ్యతిరేకతలు అనేక రూపాలలో వ్యక్తమవుతాయి. ప్రభుత్వాలు మారవలసిన పరిస్థితులలో కూడా అధికార భవనాల ముట్టడి, ఆక్రమణ తప్పనిసరిగా జరగాలని లేదు. కానీ, ప్రజాగ్రహం ప్రత్యక్ష రూపంలో, భౌతిక రూపంలో అధికార కేంద్రాల స్వాధీనం రూపంలో వ్యక్తమయినప్పుడు దాని దృశ్య విలువ వేరు. అధ్యక్ష భవనంలోని ఈతకొలనులో పిల్లలతో సహా జలకాలాడడాన్ని, వంటగదిలో ఆమ్లెట్లు వేసుకుని తినడాన్ని, పరుపుల మీదకెక్కి దొర్లడాన్ని ఫోటోలలో, వీడియోలలో చూసినప్పుడు వాటిలోని ప్రతీకాత్మకత ఉద్వేగపరుస్తుంది.


అధ్యక్షుడు గొటబయ రాజపక్సే మాల్దీవులకు పారిపోయాడు. ప్రధానమంత్రి తాత్కాలిక అధ్యక్షుడయ్యాడు. మహింద ఆచూకీ తెలియదు. అధికార భవనాలన్నీ జనాక్రమణలో ఉన్నాయి. ప్రాణభయంతో ఉన్న పాలకులకు రక్షణ ఇవ్వడం తప్ప, ప్రజాందోళనలో సైన్యానిది ప్రేక్షక పాత్ర. ఇప్పుడు ఏలికలను తరలించిన తరువాత, శాంతిభద్రతల స్థాపనలో నిజ స్వరూపం చూపిస్తారేమో తెలియదు. లంకలో ఆర్థికవ్యవస్థ ఏడాది నుంచి మరణశయ్యపైనే ఉన్నది. ప్రమాదసూచికలు ఎగురుతున్నా, రాజపక్సే సోదరులు పరిస్థితి తమ చేతుల్లోనే ఉన్నదని నమ్మించచూశారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులను గూండాలతో నిరోధించాలని చూశారు. పీకల మీదకు వచ్చినప్పుడు మహింద రాజపక్సేను తప్పించారు. అంతా ఉత్తినే. సుమారు రెండు దశాబ్దాల నుంచి లంకను ఏకఛత్రంగా ఏలుతున్న రాజపక్సే కుటుంబం, ఇంతటి కల్లోలంలోనూ తన మనుగడను సురక్షితం చేసుకోవడం మీదనే ప్రధానంగా దృష్టి పెట్టింది. మహింద రాజపక్సే కుమారుడు నామల్ రాజపక్సే, తనను తాను రాజకుటుంబం నుంచి ఎడంచేసుకుని కొత్త తరం ప్రతినిధిగా కొత్త మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. రాజపక్సేకు రాజపక్సే ప్రత్యామ్నాయం అన్నమాట.


శ్రీలంక పరిణామాల విషయంలో భారతదేశం నుంచి అధికారికంగా పెద్ద హడావుడి కనిపించడం లేదు. ఇన్ని కష్టాల్లో ఉన్న లంకలో తన మిత్రుడు అదానీకి ప్రాజెక్టులు ఇప్పించాడని భారత ప్రధాని మోదీ మీద దుమారం చెలరేగినప్పటి నుంచి, ఆ దేశం వ్యవహారాలు పెద్దగా ప్రచారంలోకి రాకపోవడం గమనించవచ్చు. మరే దేశంలో అయినా ప్రధానమంత్రి మీద అంతటి ఆరోపణ వస్తే, మీడియాకు పండగే అయ్యేది. ఎందుకో మనవాళ్ళు పండగ చేసుకోలేదు. కానీ, ప్రభుత్వం నుంచి వెళ్ళిన లేఖలూ అవీ ఆధారాలుగా శ్రీలంక మీడియాలో కనిపించాయి. మా కల్లోలం నుంచి లబ్ధిపొందాలని చూడవద్దు అని మోదీని సంబోధిస్తూ, ప్లకార్డులు కొలంబోలో కనిపించాయి. శ్రీలంక జాతీయవాదంలో భారత్ మీద అనుమానం ఒక ముఖ్య అంశం. అందుకే, 1970ల నుంచి లంక, చైనా వైపు మొగ్గుతూ వచ్చింది. ఇప్పుడు రాజపక్సే కుటుంబం తప్పించుకుపోవడానికి భారతదేశమే సహాయం చేసిందని లంకలో ప్రచారం జరుగుతోంది. భారత హైకమిషనర్ దాన్ని ప్రత్యేకంగా ఖండించవలసి వచ్చింది. 1980 దశకం చివరలో ఐపికెఎఫ్ ప్రయోగం లంక తమిళులకే కాదు, సింహళ జాతీయవాదులకూ అభ్యంతరకర పరిణామమే. భారత్ విషయంలో ఉన్న సంకోచాలను తనకు అనువుగా మార్చుకోవడానికి చైనా ప్రయత్నించింది. హిందూ మహాసముద్రంలో అమెరికా ప్రాబల్యాన్ని అనుమతించకుండా ఉండాలంటే, లంక తనకు కీలకమని చైనా భావిస్తోంది. ఇండియా, అమెరికా తరఫున శ్రీలంకలో తనను అడ్డుకుంటున్నదని చైనా అభిప్రాయం. ఈ క్రమంలో తన విశ్వవ్యాప్త మహా వలయ నిర్మాణం కోసం శ్రీలంకను చైనా మరింత దగ్గరకు తీసుకుంది. ఆ అనుబంధాన్ని గాఢం చేసుకోవడానికి అడ్డగోలు అప్పులు కూడా ఇచ్చింది. అప్పు తీసుకున్నందుకు రాజపక్సే కుటుంబానికి 20 శాతం ముడుపులు కూడా చెల్లించిందని అంటున్నారు. లంక ఇప్పుడు తీర్చలేకపోతున్న వాటిలో ఐఎంఎఫ్ అప్పుతో పాటు చైనా అప్పు కూడా ఉంది. అత్యవసర పదార్థాల సరఫరాలో సహాయం చేసినందుకు గాను, ఇండియాకు ప్రాజెక్టులు ఇవ్వవలసివచ్చింది. అదానీకి దక్కిన ఒక ప్రాజెక్టు అయితే, చైనాకు కేటాయించిన తరువాత వెనక్కు తీసుకున్నది. అందుకు చైనాకు కోపంగా ఉన్నది. బాకీ చెల్లింపులకు వాయిదా ఇవ్వడం కుదరదని, వెంటనే చెల్లించాలని భీష్మించుకున్నది. అప్పుడే దేశం దివాలా తీసిందని గొటబయ ప్రకటించారు.


సింథటిక్ ఎరువులు నిషేధించినందుకని ఒకరు, ఉచిత పథకాలు అమలుచేసినందుకు అని మరొకరు లంక సంక్షోభానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. కర్ణుడి చావుకి అన్నీ కారణాలే కానీ, అసలు కారణం, జాతీయవాదంతో అహంకరించిన అధికారం అవినీతిమయమై, ప్రజల జీవన ప్రమాణాలను పాతాళానికి చేర్చడం. ఇటువంటి పాలకులు చిన్న చిన్న దేశాలలో కాస్త మొరటుగా కనిపిస్తారు. పెద్ద పెద్ద దేశాలలో బడా బాబుల్లాగా ఉంటారు. తమ నివాసాల మీదకు దండెత్తి రాకుండా, ప్రజలు వారిలో వారే కలహించుకునేట్లుగా జాగ్రత్తపడతారు.


వ్యవస్థ మీద, అధికారం మీద విమర్శనాత్మకంగా ఉండే సమూహాలలో శ్రీలంక మీద చర్చలలో ఒక నిస్సహాయ నిర్వేదం ధ్వనిస్తోంది. మనం ఇట్లా ఎందుకు చేయలేకపోతున్నాము, నిలదీయవలసిన పాలనను ఎందుకు నిరసించలేకపోతున్నాము అన్న బాధ కనిపిస్తోంది. సాధారణంగా అభ్యుదయ సినిమాలు భూస్వామి లేదా ప్రతినాయకుడి ఇంటి మీదకు జనం గుంపుగా దండెత్తడంతో ముగుస్తాయి. ప్రత్యేక చారిత్రక సందర్భాలలోనో, చిన్న చిన్న దేశాలలోనో అధికార భవనాల ముట్టడితో కథ ముగుస్తుంది తప్ప అన్ని చోట్లా కాదు. ఇటువంటి జనాక్రమణలు అనివార్యంగా జనరాజ్యానికి దారితీస్తాయన్న నమ్మకమూ లేదు. మరికొందరు నిరాశావాదులు అప్పుడే ఆ సత్యాన్ని శ్రీలంకకు అన్వయించి, పోరాటమే వ్యర్థమనే సందేశాన్నీ ఇస్తున్నారు. శ్రీలంక పరిణామాల గురించిన ఒక వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. మన దేశంలో లాగే అక్కడా రాజకీయ ప్రతిపక్షాలు సత్తువ లేక, సంకల్పమూ లేక ఉన్నాయి. మునుపు రాజకీయ గుర్తింపు లేని కొందరు యువకులు, మేధావులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతిపక్షాలను, పోరాట సంస్థలను, వ్యక్తులను సమీకరించగలిగారు. ఆర్థిక సంక్షోభం జనజీవనాన్ని దుర్భరం చేయడం, ఫలితంగా కలుగుతున్న అసమ్మతిని క్రమబద్ధం చేయగలిగే సంధానకర్తలు ఉండడం శ్రీలంక ఉద్యమాన్ని సానుకూలం చేశాయి. రాజపక్సే కుటుంబ పాలన, ఆశ్రిత పోషణ, అవినీతి, అవకతవక ఆర్థిక విధానాలు, రుణగ్రస్తత వంటి అంశాల మీద మాత్రమే ఈ ఉద్యమం నిర్మితమైంది. టైగర్లను సమూలంగా నిర్మూలించడంతో సంపాదించుకున్న ‘జాతీయ’ ప్రతిష్ఠ ఆధారంగా రాజపక్సేలు నిర్మించుకున్న సామ్రాజ్యం ఇప్పుడు పతనమైంది. ఎంతటి తీవ్రవాద జాతీయత అయినా, వాస్తవ జీవన సంక్షోభం ముందు అప్రధానం కాక తప్పదని లంక పరిణామాలు చాటి చెబుతున్నాయి. సింహళ మెజారిటీవాదం, మైనారిటీ వ్యతిరేకత, బౌద్ధ మతతత్వం వంటి అవలక్షణాలు లంక సమాజంలో ప్రస్తుతానికి నిద్రాణమై ఉండవచ్చును కానీ, సజీవంగానే ఉన్నాయి. ఇక, ఈ ఉద్యమంలో నిజాయితీ కలిగిన శ్రీలంక దేశభక్తులతో పాటు, భారత్, చైనా, అమెరికా సానుకూలతలు కలిగిన శక్తులు కూడా భాగస్వాములుగా ఉండి ఉండవచ్చు. ఐఎంఎఫ్ షరతుల అప్పుని, చైనా అవినీతి అప్పును, భారత ‘ఔదార్యపు’ సహాయాన్ని గ్రహించి, దేశాన్ని తన కాళ్ల మీద నిలబెట్టే నాయకత్వం వస్తుందా, ప్రస్తుత సంక్షోభానికి విరామం మాత్రమే ఇచ్చే పాలన వస్తుందా అన్నది రానున్న రోజులు చెబుతాయి.


కె. శ్రీనివాస్

Updated Date - 2022-07-14T06:07:22+05:30 IST