మూడేళ్లుగా.. మురిపించుడే...!

ABN , First Publish Date - 2021-12-06T05:08:58+05:30 IST

మూడేళ్లుగా.. మురిపించుడే...!

మూడేళ్లుగా.. మురిపించుడే...!
మహబూబాబాద్‌ జిల్లాలో వడ్డీలేని రుణాల బకాయిల కోసం ఎదురు చూస్తున్న మహిళా సంఘాలు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికముందు ఇస్తామని ప్రకటన

ఆ తర్వాత చెల్లింపును మరిచిన రాష్ట్రప్రభుత్వం

జిల్లా వ్యాప్తంగా రూ.53.12 కోట్ల బకాయిలు

మొత్తం 11 వేల మహిళా సంఘాలు ఎదురుచూపులు


మహబూబాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సర్కారు సంకల్పం నీరుగారు తోంది. మూడేళ్లగా మహిళా గ్రూపులకు వడ్డీ చెల్లించకపోవడంతో.. మానుకోట జిల్లా వ్యాప్తంగా రూ.53.12 కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. వారికి ఆర్థిక స్వావలంబన చేకూరేందుకు రాష్ట్రప్రభు త్వం చేపట్టిన ‘వడ్డీలేని రుణాలు’ (వీఎల్‌ఆర్‌) పథకం అమలులో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏళ్ల తరబడి బకాయిలు చెల్లించకపోవడంతో ఆ సంఘాలు వాటి కోసం నిరీక్షిస్తున్నాయి. ఇటీవల వడ్డీలేని రుణాల పథకం బకాయిలను సర్కారు ఇస్తున్నట్లు ప్రకటించి నా.. ఇప్పటి వరకు చెల్లింపులూ జరుగలేదు.


హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆగస్టు నెలలో ఆ నియోజకవర్గంతో సహా మహబూబాబాద్‌ జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల బకాయిలను చెల్లించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలో 2018–2019 ఆర్థిక సంవత్సరం నుంచి 2020–2021 వరకు 11,986 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి వడ్డీ బకాయిలు రూ.39, 94,60,624, స్త్రీనిధి లింకేజి రుణాల వడ్డీ బకాయిలు రూ.13,17, 65,093 బకాయిలు వెరసి రూ.53,12,25,717లను చెల్లించాల్సినవి ఉన్నాయని జాబితా రూపొందించారు. ఇందులో మండలాల వారీగా బకాయిల జాబితాను సైతం జిల్లా అధికారులు విడుదల చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ జాబితాల ఆధారంగా ఆయా మండలాల్లో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల బకాయిలు వస్తున్నాయని ప్రజాప్రతినిధులతో చెల్లింపు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు సైతం వెళ్లాయి. ఈ ఆదేశాలతో మండలస్థాయిలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల బకాయిలు చెల్లింపులు చేస్తున్నారని ప్రకటించారు. 


ఒక్క హుజూరాబాద్‌కే చెల్లింపు..

ఉప ఎన్నిక సమయంలో కేవలం హుజూరాబాద్‌ నియోజకవ ర్గం వరకే ఈ బకాయిలను ప్రభుత్వం చెల్లించి, మిగతా జిల్లాలను విస్మరించింది. అంతకుముందే మహిళా సంఘాలకు మండలస్థా యిలో బకాయిలు చెల్లింపులు ఉంటాయని ప్రకటించడంతో      నిత్యం మహిళలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. తమ బకాయిలు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఐకేపీ అధికారులే నిలిపివేసి, ఇవ్వడంలేదనే ఆరోపణలు సైతం వినవస్తున్నాయి. సంబురంగా కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేసి మం డలస్థాయిలో మహిళలకు బకాయిలు చెల్లించాలని ఆదేశాలు రావడం, ఆపై చెల్లింపులు చేయకపోవడంతో ఐకేపీ అధికారులు సైతం మహిళలకు సమాధానం చెప్పలేక సంకటస్థితిలో పడ్డారు.


వడ్డీలేని రుణాలు అంటే..?

మహిళా స్వయం సహాయ సంఘాల్లోని సభ్యులకు బ్యాంకు లింకేజి, స్త్రీనిధి ద్వారా రుణాలను ఇస్తారు. ఈ రుణాలకు బ్యాంకుకు నూటికి రూ.1.15 నుంచి రూ.1.25 వరకు, స్త్రీనిధి నుంచి తీసుకున్న రుణానికి నూటికి రూ.1.04 చొప్పున వడ్డీని చెల్లించాలి. అసలు, వడ్డీ కలిపి ఈ మొత్తాన్ని నెలవారీగా వాయిదాల రూపంలో మహిళలు తిరిగి చెల్లిస్తారు. గతంలో పావలా వడ్డీ పథకంలో రూ.0.25 (పావలా)ను మినహాయించి, మహిళలు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిరిగి ఇచ్చేది. ఆ తర్వాత వడ్డీలేని రుణం పథకంలో మహిళలు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి మహిళలకు ఆన్‌లైన్‌ ద్వారా తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవారు. ఇలా 2018 వరకు సక్రమంగానే చెల్లించారు. 

ఆ తర్వాత 2018–2019 ఆర్థిక సంవత్సరం నుంచి 2020–2021 వరకు చెల్లింపులు నిలిచిపోయాయి. కేవలం హుజూరాబాద్‌ ఒక్క నియోజకవర్గానికే ఇచ్చి మహబూబాబాద్‌ జిల్లాను విస్మరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా తమ బకాయిలు వెంటనే చెల్లించాలని మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.



Updated Date - 2021-12-06T05:08:58+05:30 IST