రాష్ట్రానికి చట్టబద్ధంగా నీటిని అందించాలి

Jul 30 2021 @ 01:55AM
సదస్సులో మాట్లాడుతున్న బొజ్జా దశరథరామిరెడ్డి

‘సీమ’ జల సాధన సమితి కన్వీనర్‌ దశరథరామిరెడ్డి 


తిరుపతి రూరల్‌, జూలై 29: రాష్ట్రానికి 2014 విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కేటాయించిన నీటి హక్కులను అమలు చేయాలని రాయలసీమ జల సాధన సమితి కన్వీనర్‌ బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. తిరుపతిలోని యూత్‌ హాస్టల్‌లో గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. విభజన జరిగిన 60 రోజుల్లోపు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయించాల్సి ఉందన్నారు. దీని వల్ల మన రాష్ట్రానికి  చెందాల్సిన చట్టబద్ధ నీటిని ఎలాంటి వివాదాలు లేకుండా పొందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ అంశాలపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి రాయలసీమ జల సాధన సమితి అనేకమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిందని చెప్పారు. ఇక, కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ ఈనెల 15న కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లోని అంశాలు రాష్ట్ర విభజన చట్టం ప్రాతిపదికన లేవన్నారు. ఈ అంశాలను నది యాజమాన్య బోర్డులో చేర్చి సవరణలతో కూడిన నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాడు చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. రాయలసీమ జల సాధన సమితి జిల్లా కన్వీనర్‌ మాంగాటి గోపాలరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ప్రమీలమ్మ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, ఆర్పీఐ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజయ్య,  జనసేన నాయకుడు కృష్ణయ్య, రిటైర్డు ప్రొఫెసర్‌ సుందర్‌రాజన్‌, రాయలసీమ పోరాట సమితి నాయకుడు నవీన్‌కుమార్‌రెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్‌ పురుషోత్తంరెడ్డి, నాయకులు వైఎన్‌ రెడ్డి, ఎమ్వీ రమణారెడ్డి, భాస్కర్‌, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


సదస్సులో తీర్మానాలు

రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీకి 512 టీఎంసీల నీటిని కేటాయించాలి.

తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేయాలి.

కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలి.

వెనుక బడిన రాయలసీమకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి.

సీమలోని చెరువులను పునరుద్ధరించాలి.

చట్టబద్ధంగా నీటిని వినియోగించుకోవడానికి ముచ్చుమర్రి, గురురాఘవేంద్ర, సిద్ధాపురం ఎత్తిపోతలను అనుమతిచ్చిన ప్రాజెక్టులుగా నోటిఫికేషన్‌లో సవరణచేయాలి. 

తాగునీటికి ప్రథమ, సాగునీటికి ద్వితీయ, విద్యుత్‌ ఉత్పత్తికి చివరి ప్రాధాన్యత కల్పించాలి, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల, జురాల ప్రాజెక్టులను మాత్రమే కృష్ణానది యాజమాన్య బోర్డు అజమాయిషీలో పొందుపర్చాలి. 

రాయలసీమ సాగునీటి కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ చేపట్టి, వాగులు, వంకలు, నదులు, కాలువలతో అనుసంధానం చేయాలి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.