వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం

ABN , First Publish Date - 2022-05-23T05:10:39+05:30 IST

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మాజీఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో శ్రీకాకుళం నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌

హిట్లర్‌, రాజపక్సేల కంటే సీఎం జగన్‌ గొప్పోడు
టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌
ఉత్సాహంగా మినీ మహానాడు
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మే 22:
వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మాజీఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో శ్రీకాకుళం నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్‌ మాట్లాడుతూ.. ‘హిట్లర్‌, రాజపక్సేల కంటే సీఎం జగన్మోహన్‌రెడ్డి గొప్పవ్యక్తి. జర్మనీని హిట్లర్‌, శ్రీలంకను రాజపక్సే పరిపాలించి నాశనం చేశారు. జగన్‌ కూడా వారిని మరిపించేలా ఈ మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను సర్వనాశనం చేశారు. ప్రజలే దేవుళ్లగా... సమాజమే దేవాలయమన్న లక్ష్యంతో ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారు. ఓ అవినీతి, అసమర్థ నాయకుడి చేతిలో టీడీపీ ఓటమిపాలైంది. జగన్మోహన్‌రెడ్డి రాజకీయ నాయకుడు కాదని.. పారిశ్రామికవేత్తని అప్పట్లో ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇప్పుడు అదే పారిశ్రామికవేత్త వద్ద ఆయన మంత్రిగా  పని చేస్తున్నారు. రంగు రుచి వాసన లేని పార్టీ వైసీపీ. అత్యంత అవినీతిపరుడు జగన్మోహన్‌రెడ్డి’ అని అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను ఆదానీకి, పదవు లను తెలంగాణ వారికి, అప్పులు మాత్రం రాష్ట్ర ప్రజలకు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ మోసం చేయని వర్గం గానీ, ఉద్యోగులు గానీ లేరన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా సీపీఎస్‌ను రద్దు చేయలేదని, జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించలేదని విమర్శించారు. నాడు-నేడు పేరుతో పాఠశాలలు, ఇతర భవనాలకు నాలుగు రంగులు వేసి చేతులు దులుపుకొంటున్నారని విమర్శించారు. 73 ఏళ్ల చంద్రబాబునాయుడును స్ఫూర్తిగా తీసుకుని కార్యకర్తలు సైతం పార్టీ విజయం కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. సమష్టిగా పార్టీని విజయంలోకి తీసుకువద్దామని స్పష్టం చేశారు.

చెప్పేదొకటి.. చేసేదొకటి
వైసీపీ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి అని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. పేదల కోసం అన్న క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తే వైసీపీ నాయకులు వాటిని మూసేసి ఆ భవనాలను  సొంతానికి  వాడుకుంటు న్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై.. ఇప్పుడు వైసీపీ సర్కారు చేపట్టిన పనులపై చర్చకురావాలని సవాల్‌ విసిరారు. రైతులకు రుణాలు, విత్తనాలు, ఎరువులను అందించడం లేదన్నారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావాలంటే మళ్లీ సామాజిక విప్లవం రావాల్సిన అవసరముందన్నారు.  

చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి
రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే, నియోజవర్గ ఇన్‌చార్జి గుండ లక్ష్మీదేవి అన్నారు. టీడీపీతోనే బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. టీడీపీ పాలనలోనే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రక్షణతోపాటు, గ్రామీణ విద్యార్థులకు రెసిడెన్షియల్‌ విద్యా విధానం అందిందని చెప్పారు.  టీడీపీ అనుబంధ విభాగ నాయకులు మాట్లాడుతూ.. వైసీపీ సర్కారులో వీధికో ఉన్మాది పుట్టుకొస్తున్నారన్నారు. అణగారిన కులాలకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా పది తీర్మానాలను ప్రవేశపెట్టారు.  కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, తెలుగురైతు నాయకుడు సింతు సుధాకర్‌, పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, జల్లు రాజీవ్‌, శ్రీకాకుళం, గార మండలాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T05:10:39+05:30 IST