కథ సుఖాంతం!

ABN , First Publish Date - 2022-08-11T07:59:57+05:30 IST

కథ సుఖాంతం!

కథ సుఖాంతం!

‘డర్టీ పిక్చర్‌’ను మలుపు తిప్పిన పోలీసులు

ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపకుండానే కొత్త స్ర్కిప్టు

ఇప్పుడున్నది ‘ఒరిజినల్‌’ వీడియో కాదని వెల్లడి

అసలు వీడియో దొరికితేనే పరీక్షలకు పంపిస్తారట!

ఎంపీ లేదా ఆ మహిళ ఫోన్లు పరిశీలించరా?

మరి... సోర్స్‌ వీడియో ఉందో లేదో తెలిసేదెలా?

ఇప్పుడున్న క్లిప్‌ ఫోరెన్సిక్‌కు ఎందుకు పంపరు?

మహిళ చేసిన ఫిర్యాదుపై నిగ్గు తేల్చరా?

అనంత ఎస్పీ ప్రకటనలో అనేక సందేహాలు

పరస్పర విరుద్ధ ప్రకటనలు... జవాబులేని ప్రశ్నలు

గోరంట్ల మాధవ్‌ను కాపాడటమే అసలు లక్ష్యమా?

అసలు సంగతి వదిలేసి... ఐ-టీడీపీపై గురి


‘పుర్రె’ దొరికితే చాలు... అది పురుషుడిదా, మహిళదా... ఎన్నాళ్ల కిందట చనిపోయి ఉండొచ్చు, ఎలా చనిపోయి ఉండొచ్చు అంటూ తీగలాగి డొంకను కదిలించే స్థాయిలో ‘ఫోరెన్సిక్‌ సైన్స్‌’ అభివృద్ధి చెందింది.


వెంట్రుకలు, గోర్లు, వేలిముద్రల ఆధారంగా దర్యాప్తు సాగించి అసలు హంతకులను పట్టుకున్న సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. 


కానీ... ‘ఒక వీడియో క్లిప్‌లో ఉన్నది ఎంపీయో కాదో, అది ఎడిట్‌ చేశారో లేదో, మార్ఫింగ్‌ అయ్యిందో లేదో చెప్పలేం’ అని మన రాష్ట్ర పోలీసులు చేతులెత్తేశారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ‘డర్టీ పిక్చర్‌’ కథను ప్రభుత్వ పెద్దలు కోరుకున్న విధంగా ‘సుఖాంతం’ దిశగా తీసుకెళ్తున్నట్లు చెప్పకనే చెప్పారు.



(అమరావతి - ఆంధ్రజ్యోతి)

జనులారా వినండి! ఒక ఫోన్‌లో ప్లే అవుతున్న వీడియోను మరో ఫోన్‌ ద్వారా రికార్డు చేస్తే... దానిని ‘ఒరిజినల్‌’ అనరట! అలా రికార్డు చేసిన వీడియోలో కనిపించేది ‘ఫలానా’ వ్యక్తో, కాదో  చెప్పలేరట! ఆ వీడియోను ఫోరెన్సిక్‌ పరీక్షలకూ పంపించలేరట! ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో ఒక ఫోన్లో ప్లే అవుతుండగా మరో ఫోన్‌ ద్వారా రికార్డు చేశారని... సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది అదే కాబట్టి, దానిని ‘ఒరిజినల్‌’ అనలేమని పోలీసులు తేల్చేశారు. వెరసి... ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ‘ఊహించిన విధంగానే’ భారీ ఊరట కల్పించారు. ‘ఆ వీడియో ఒరిజినల్‌ కాదని ఎస్పీ చెప్పేశారు’ అంటూ గోరంట్ల మాధవ్‌ కూడా తనకు క్లీన్‌చిట్‌ వచ్చేసినట్లుగా కలరింగ్‌ ఇచ్చారు. కానీ... ఇదంతా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా పోలీసులు నడిపించిన కథ అని రాజకీయ విశ్లేషకులు, ఫోరెన్సిక్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


ఎన్నెన్ని మలుపులో...

‘ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో మార్ఫింగ్‌ కాదని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మొదట్లోనే చెప్పారు. దీంతో... వీడియో మార్ఫింగ్‌ చేసిందో, లేక అసలుదో త్వరలోనే తేల్చేస్తారని అంతా భావించారు. కానీ... బుధవారం తమ మేధాశక్తి మొత్తం ప్రయోగించి ‘డర్టీ పిక్చర్‌’ను ఎవ్వరూ ఊహించని మలుపు తిప్పారు. ‘‘అది అసలు వీడియో కాదు. అలాగని మార్ఫింగ్‌ చేశారనీ చెప్పలేం. అసలు విషయం తేలాలంటే ఫస్టు రికార్డు చేసిన ఫోన్‌లోని వీడియో దొరకాలి. దానిని మాత్రమే పరీక్షకు పంపగలం’’ అంటూ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు కూడా పంపకుండానే ‘కేసు’ను దాదాపుగా మూసేశారు. గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో ఒక ఫోన్‌లో ప్లే అవుతుండగా మరొకరెవరో ఇంకొక ఫోన్లో రికార్డు చేశారు. ఈ విషయం మొదటి రోజునే స్పష్టంగా తెలిసిపోయింది. అసలు వీడియో ‘తొలుత రికార్డు అయినది) ఎంపీ గోరంట్ల మాధవ్‌ లేదా ఆ మహిళ ఫోన్లలోనే రికార్డు అయి ఉండాలి. వీరి ఫోన్లను పరిశీలించే ఉద్దేశం, అవకాశం లేదని ఎస్పీ మాటల్లోనే తేలిపోయింది. పైగా... ఇదంతా ఐ-టీడీపీ చేసిన పనే అన్నట్లుగా ఆ వీడియో పోస్ట్‌ చేసిన టైమ్‌, ఫోన్‌ నంబర్లు చెప్పడం గమనార్హం. ‘మా నాయకుడి ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు’ అంటూ గోరంట్ల మాధవ్‌ అభిమాని చేసిన ఫిర్యాదు మేరకు సాగిన ఈ దర్యాప్తు ఆయన చెబుతున్న కోణంలోనే సాగడం విశేషం.


ఫోరెన్సిక్‌ తేల్చలేదా?

ఒక ఫోన్‌లో స్ట్రీమ్‌ అవుతున్న దృశ్యాలను మరో ఫోన్‌లో రికార్డు చేశారు కాబట్టి అది ‘ఒరిజినల్‌’ కాదని అనంతపురం పోలీసులు ఒక సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు. ‘ఒరిజినల్‌’ దొరికితేనే ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపిస్తామని చెప్పారు. అయితే... ఒక డివైజ్‌లో స్ట్రీమ్‌ అవుతున్న దృశ్యాలను మరో ఫోన్‌లో రికార్డు చేసినంత మాత్రాన అది ‘మార్ఫింగ్‌’ అని నిర్ధారించలేమని నిపుణులు స్పష్టం చేశారు. ఎంపీ నగ్న వీడియో సోషల్‌ మీడియాలో చాలాసార్లు రీఫార్వర్డ్‌ అయ్యిందని, ఇతర దృశ్యాలు జోడించి (మీమ్స్‌) ఎడిట్‌ చేశారని... ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపకపోవడానికి ఇది కూడా ఒక కారణమని పోలీసులు ఓ వింత కారణం చెప్పారు. నిజానికి... ఎలాంటి యాడింగ్స్‌లేని వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో తిరిగాయి. ఆ వీడియో క్లిప్‌ను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపిస్తే అది అసలుదేనా, ఎంపీ ముఖాన్ని మార్ఫ్‌ చేశారా, ముఖం ఎంపీదే అయినా కింది భాగాన్ని వేరే వీడియో నుంచి ‘యాడ్‌’ చేశారా అని నిపుణులు నిర్ధారించే అవకాశముందని చెబుతున్నారు. ఒరిజినల్‌ వీడియో దొరికితేనే ఈ పరీక్షలు చేసే వీలుంటే... ఆ విషయాన్ని ఫోరెన్సిక్‌ నిపుణులే అధికారికంగా చెప్పవచ్చు. కానీ... పోలీసులే ఆ పని చేసేయడంపై అటు సైబర్‌ నిపుణులు, ఇటు రాజకీయ విశ్లేషకులు విస్తుపోతున్నారు.


మరి... ఆ ఫిర్యాదు సంగతేమిటి?

‘‘ఎంపీ మాధవ్‌ వీడియోలో ఉన్నది నేను కాదు. అయినప్పటికీ... టీడీపీ నేతలు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోండి’’ అని సత్యసాయి జిల్లా కదిరికి చెందిన అనితారెడ్డి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వీడియోలో తన ఫోటో పెట్టి కావాలనే ఎవరో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తన పరువుకు భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసుల్ని కోరారు. ఈ ఫిర్యాదుపైనైనాపోలీసులు స్పందించాలి! అంతేకాదు... తమ నాయకుడి పరువు తీసేందుకు కొందరు పనిగట్టుకుని ఈ వీడియో సృష్టించారని గోరంట్ల మాధవ్‌ అభిమాని ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాంటప్పుడు అసలు వీడియోను గుర్తించి నిజం తేల్చాల్సిన బాధ్యత పోలీసులదే కదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ఏపీ సీఐడీ పోలీసులు సుమోటోగా  దేశద్రోహం కేసు నమోదుచేసి అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని... ఆయన సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఎంపీ మాధవ్‌ ‘డర్టీ పిక్చర్‌’ ఆరోపణల విషయంలో ఆ ఉత్సాహం ఎక్కడా కనిపించలేదు. ‘అది ఒరిజినల్‌ కాదు. ఒరిజినల్‌ దొరికితేనే ఫోరెన్సిక్‌ సైన్స్‌ పరీక్షలకు పంపిస్తాం’ అని మాత్రమే ఎస్పీ చెప్పారు.


సైబర్‌ నిపుణులు ఏమంటున్నారంటే...

ఎంపీ నగ్న వీడియో ఎక్కువసార్లు షేర్‌ అయినందున అది నిజమైనదో, కాదో పసిగట్టడం కష్టంగా మారిందని ఎస్పీ చెప్పడాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. ఇంత టెక్నాలజీ యుగంలో ఒక చిన్న వీడియో ఎక్కడ పుట్టిందో.. ఎటు నుంచి సోషల్‌ మీడియాలోకి వచ్చిందో కనుక్కోలేరా.? అంటున్నారు. వీడియోలో తల తప్ప ఇతర భాగాలను మార్ఫింగ్‌ చేయడం దాదాపు అసాధ్యమని, కటింగ్‌-యాడింగ్‌ చేసే అవకాశాలే ఉంటాయని చెబుతున్నారు. ముఖం నుంచి వీడియో చిత్రీకరణ మొదలై... కిందికి దిగినప్పుడు వేరే వీడియోను అతికించి ఉంటే డిజిటల్‌ ఫోరెన్సిక్‌లో తేలుతుందని స్పష్టం చేస్తున్నారు. అలా చేస్తే ఫోరెన్సిక్‌ పరీక్షల్లో ఈజీగా గుర్తించవచ్చు. అనంతపురం ఎస్పీ చెబుతున్నట్లుగా ఆ వీడియో ‘ఒరిజినల్‌’ కాకపోయినప్పటికీ... అందు లో ఉన్న వ్యక్తి ముఖ కవలికల ఆధారంగా నిజం తేల్చవచ్చని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఒక మాజీ పోలీసు అధికారి తెలిపారు. ‘పోలీసులు ఒక విషయాన్ని తేల్చాలనుకుంటే... అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటారు. మాధవ్‌ వీడియో నిజమని అంగీకరించే పరిస్థితి లేదు. అలాగని... మార్ఫింగ్‌ అని చెప్పేస్తే... ఇతరులు అదే వీడియోను స్వతంత్రంగా పనిచేసే ల్యాబ్‌కు పంపించి అసలు విషయం తేల్చే అవకాశముంది. అందుకే... ఒరిజినల్‌ వీడియో కావాలంటూ కథ అల్లినట్లు కనిపిస్తోంది’’ అని ఒక మాజీ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు.


మంత్రిదో మాట... ఎస్పీదో మాట!

‘వీడియోను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపించాం. అసలు విషయం తేల్చేస్తాం’ అని హోం మంత్రి తానేటి వనిత మంగళవారం విలేకరులతో అన్నారు. కానీ... అనంతపురం ఎస్పీ మాత్రం ఆ వీడియోను ల్యాబ్‌కు పంపించలేదని, అలా పంపే అవకాశమూ లేదని స్పష్టం చేశారు. 


పక్క జిల్లాలో ఉన్నది పోలీసులు కాదా?

గోరంట్ల మాధవ్‌ వీడియోకు సంబంధించి బాధిత మహిళలెవరూ ఫిర్యాదు చేయలేదని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేశారని విలేకరులు గుర్తు చేయగా, ‘అది మా జిల్లా కాదు. ఫిర్యాదు సంగతి ఆ జిల్లా పోలీసులు చూసుకుంటారు’ అని ఎస్పీ చెప్పడం విశేషం.

Updated Date - 2022-08-11T07:59:57+05:30 IST