అంతులేని ఆటోనగర్‌ కథ

ABN , First Publish Date - 2022-05-28T05:20:03+05:30 IST

అన్నమయ్య జిల్లాలో అతి పెద్ద పట్టణం మదనపల్లె. దీంతో పాటు చుట్టుపక్క ప్రాంతాల నుంచి నిత్యం లక్షకు పైగా ద్విచక్ర వాహనాలు, 48 వేలకు పైగా ప్యాసింజర్‌ ఆటోలు, లగేజి ఆటోలు తిరుగుతున్నాయి. వీటితో పాటు లారీలు, ప్రైవేటు బస్సులకు మదనపల్లె ప్రసిద్ధి. ఇలాంటి కేంద్రంలో ఆటోనగర్‌ ఏర్పాటు ఒక ప్రహసనంగా మారింది.

అంతులేని ఆటోనగర్‌ కథ
జాతీయ రహదారి పక్కన ఆటోనగర్‌ ఏర్పాటుకు కేటాయించిన స్థలం

రాజకీయ కారణాలతో ఎక్కడి గొంగళి అక్కడే

15 ఏళ్లుగా ఎదురుచూస్తోన్న వైనం


మదనపల్లెలో ‘ఆటోనగర్‌’.. ఈ మాటలు వింటే చాలు ఇక్కడి ప్రజలు, మెకానిక్‌లు, ఆటోమొబైల్‌ దుకాణాల వారు, వాహన యజమానులు వేడి నిట్టూర్పు వదులుతారు. ఆటోనగర్‌ ఏర్పాటు కళ్లకు కట్టినట్లే కనిపించినా.. సవాలక్ష కారణాలతో ప్రారంభం అంతులేని కథలాగే మిగిలిపోతోంది. 15 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారై నిరుత్సాహానికి గురి చేస్తోంది. 


మదనపల్లె టౌన్‌, మే 27: అన్నమయ్య జిల్లాలో అతి పెద్ద పట్టణం మదనపల్లె. దీంతో పాటు చుట్టుపక్క ప్రాంతాల నుంచి నిత్యం లక్షకు పైగా ద్విచక్ర వాహనాలు, 48 వేలకు పైగా ప్యాసింజర్‌ ఆటోలు, లగేజి ఆటోలు తిరుగుతున్నాయి. వీటితో పాటు లారీలు, ప్రైవేటు బస్సులకు మదనపల్లె ప్రసిద్ధి. ఇలాంటి కేంద్రంలో ఆటోనగర్‌ ఏర్పాటు ఒక ప్రహసనంగా మారింది. పట్టణంలోని వేలాది వాహనాల మరమ్మతులు, సర్వీసింగ్‌కు ఆటోనగర్‌ ఏర్పాటు తప్పని సరి. 2007 సంవత్సరంలో మదనపల్లెలో ఆటోనగర్‌ ఏర్పాటు ఆవశ్యకతపై అప్పటి అధికార పార్టీ నాయకులు పట్టణ శివారులో పుంగనూరు రోడ్డులోని ప్రైవేటు స్థల సేకరణకు నాంది పలికారు. కానీ పలు కారణాలతో ఇక్కడ ఆటోనగర్‌ ఏర్పాటుకు అడుగులు పడలేదు. దీంతో పట్టణ నలుమూలలా కొన్ని ప్రైవేటు స్థలాల్లోనే మెకానిక్‌ షెడ్డులు పెట్టుకుని, వేలల్లో బాడుగలు చెల్లిస్తూ, రాత్రిళ్లు రక్షణ కోసం వాచ్‌మెన్ల ఖర్చులు వెరసి మెకానిక్‌లు, అనుబంధ విభాగాల వ్యాపారులు అవస్థలు పడుతున్నారు.


ఆటోనగర్‌కు అడుగులు..

మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీ పరిధిలో ముంబై-చెన్నై జాతీయ రహదారి పక్కన ములకలదిన్నె వద్ద ఆటోనగర్‌ ఏర్పాటుకు 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో బసినికొండ సర్వే నెంబర్లు 874, 816, 1122/3, 1123/1, 2పార్ట్‌, ములకలదిన్నె గ్రామం సర్వే నెంబర్లు 16, 17/1,3, 18 లో 58.91 ఎకరాల విస్తీర్ణంలో భూమి సేకరించారు. ఏపీ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ ఐఐసీ) ఆధ్వర్యంలో ఆటోనగర్‌తో పాటు స్మాల్‌స్కేల్‌ ఇండస్ట్రీస్‌ (ఎంఎస్‌ఎంఈ) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో పరిశ్రమలశాఖ మంత్రిగా వున్న అమరనాథరెడ్డి శంకుస్థాపన చేయగా, నిధులు కూడా మంజూరయ్యాయి. ఇందులో ఆటోనగర్‌కు 580 ప్లాట్లు, ఎంఎస్‌ఎంఈకి 55 ప్లాట్లు కేటాయించారు. అప్పట్లోనే లబ్ధిదారులను గుర్తించి ఈ ప్లాట్లను కేటాయించేందుకు నివేదిక సిద్ధం చేశారు. 24 మీటర్ల వెడల్పుతో ప్రధాన రోడ్లు, 12 మీటర్ల వెడల్పుతో అంతర్‌ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇది జరిగి నాలుగేళ్లవుతున్నా ఇంత వరకు ఆటోనగర్‌ ప్రారంభం కాలేదు.


కారణాలు ఎన్నెన్నో..?

మదనపల్లె ప్రజలు 15 ఏళ్లుగా ఎదురుచుస్తూన్న ఆటోనగర్‌ ఏర్పాటుకు అనేక రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. కర్ణుని చావుకు కారణాలు ఎన్నెన్నో అనేలా ఆటోనగర్‌ ప్రారంభానికి అడుగడుగునా అడ్డంకి ఏర్పడుతోంది. అప్పట్లో రెవెన్యూ అధికారులు సేకరించిన భూముల్లో ఓ ప్రైవేటు వ్యక్తి భూమి వుందని, ఆటోనగర్‌కు భూమి అప్పగింతలో వివాదం ఏర్పడి కోర్టులో కేసులు నడుస్తున్నట్లు తెలిసింది. ఈ స్థలం వదిలేసి నిర్మాణాలు చేపట్టాలని 2019లో ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఏపీఐఐసీ అధికారులతో పలుమార్లు చర్చించడంతో పాటు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించారు. దీంతో ఆటోనగర్‌లో తారు రోడ్ల నిర్మాణం ప్రారంభమైంది. మూడు నెలల అనంతరం ఏం జరిగిందో కానీ ఆటోనగర్‌ నిర్మాణం ఒక్కసారిగా నిలిచిపోయింది. ఇందులో 580 మంది లబ్ధిదారుల్లో ఎక్కువగా టీడీపీ సానుభూతిపరులు వున్నారనే అనుమానంతో ఆటోనగర్‌ నిర్మాణం నిలిచిపోయిందని కొందరు, కోర్టు కేసులతో నిలిచిపోయిందని మరికొందరు ఆరోపిస్తున్నారు. కాగా ఆటోనగర్‌కు కేటాయించిన నిధులు ఏమయ్యాయి? అవి అలాగే వున్నాయా.. వెనక్కి వెళ్లిపోయాయా? అన్నదే ప్రధాన ప్రశ్నగా మిగులుతోంది.

Updated Date - 2022-05-28T05:20:03+05:30 IST