సమ్మె పాక్షికం

ABN , First Publish Date - 2020-11-27T05:45:40+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మె ప్రభావం నగరంలో పాక్షికంగా కనిపించింది.

సమ్మె పాక్షికం
అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలో మహా ర్యాలీ

నేవల్‌ డాక్‌యార్డు, హెచ్‌పీసీఎల్‌, కోరమండల్‌ కర్మాగారాల్లో

కాంట్రాక్టు కార్మికులు గైర్హాజరు

ఉద్యోగుల్లో మాత్రం 40 శాతం మంది విధులకు హాజరు

ఎల్‌ఐసీ కార్యాలయంలో శతశాతం సమ్మె

స్టీల్‌ప్లాంట్‌లో 85 శాతం

స్టేట్‌బ్యాంక్‌లో యథావిధిగా లావాదేవీలు

మిగిలిన బ్యాంకులు తెరుచుకున్నప్పటికీ జరగని లావాదేవీలు

వామపక్షాల ఆధ్వర్యంలో మహా ప్రదర్శన

సమ్మెకు అంగన్‌వాడీలు, కలాసీలు మద్దతు


విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మె ప్రభావం నగరంలో పాక్షికంగా కనిపించింది. నేవల్‌ డాక్‌యార్డు, హెచ్‌పీసీఎల్‌, కోరమండల్‌ ఎరువుల కర్మాగారాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కార్మికులు విధులను బహిష్కరించినప్పటికీ, ఉద్యోగుల్లో 40 శాతం మంది హాజరయ్యారు. స్టీల్‌ప్లాంట్‌లో కేవలం 15 శాతం మంది కార్మికులు మాత్రమే విధులకు హాజరయ్యారు. అయితే అధికారులు శత శాతం హాజరయ్యారు. ప్లాంట్‌ శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనడంతో స్టీల్‌ప్లాంట్‌తో పాటు ప్రధాన రహదారులు బోసిపోయాయి. షిప్‌యార్డులో చాలామంది ఉద్యోగులు సమ్మెకు సంఘీభావంగా విధులకు గైర్హాజరయ్యారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కోరమండల్‌ గేటు నుంచి శ్రీహరిపురం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్‌ఎస్‌టీఎల్‌లో సివిల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. ఎల్‌ఐసీ కార్యాలయంలో ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొనడంతో కార్యాలయం బోసిపోయింది. కార్యాలయం ఎదుటే ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తూర్పారబట్టారు. అయితే బ్యాంకింగ్‌ రంగంలో సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు. దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచీలన్నింటిలోనూ యథావిధిగా సేవలందాయి. మిగిలిన బ్యాంకులన్నీ తెరుచుకున్నప్పటికీ లావాదేవీలు మాత్రం జరగలేదు. పూర్ణామార్కెట్‌ ముఠా కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మెకు తమ సంఘీభావం తెలిపారు.


జోరు వర్షంలోనూ మహా ప్రదర్శన

తుఫాన్‌ ప్రభావంతో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ వామపక్షాల ఆధ్వర్యంలో నగరంలో కార్మికులు మహా ప్రదర్శన నిర్వహించారు. డీఆర్‌ఎం కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకూ ఈ ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు, సీఐటీయూ నేత సీహెచ్‌ నరసింగరావు మాట్లాడుతూ ఎడతెరిపిలేని వర్షంలో కూడా వేలాది మంది నిరసన ప్రదర్శనలో పాల్గొనడం కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలు, కార్మికుల్లో నెలకొన్న వ్యతిరేకతకు తెలియజేస్తున్నదన్నారు.  సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కార్మికులు ఎన్నో పోరాటాలతో సాధించుకున్న చట్టాలను కార్పొరేట్‌లకు మేలుచేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. ప్రదర్శనలో ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ, ఇఫ్టూ నాయకుడు వై.కొండయ్య తదితరులు పాల్గొన్నారు.


గ్రామీణ జిల్లాలో విజయవంతం

సార్వత్రిక సమ్మె జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో విజయవంతమైంది. మండల, పట్టణ కేంద్రాల్లో వామపక్షాలు, కార్మిక, కర్షక, గిరిజన సంఘాల ప్రతిని ధులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజెపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 46 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్‌ కంపెనీలకు కొమ్ముకాస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీ, రైతు కూలీ సంఘం, ఐద్వా నాయకత్వంలో జరిగిన ఈ సమ్మెలో ఆయా పార్టీలు, సంఘాల నేతలతోపాటు అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, పారిశుధ్య, భవన నిర్మాణ, ముఠా కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఇతర కాంట్రాక్టు, అసంఘటిత రంగాల కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T05:45:40+05:30 IST