ఎండ ప్రచండం

ABN , First Publish Date - 2022-05-04T07:01:31+05:30 IST

సూర్యతాపం ముందు మనిషి నిలువలేకపోతున్నాడు.

ఎండ ప్రచండం
సోడా తాగుతూ సేద తీరుతున్న జనం

జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ఓ వైపు ఎండ.. మరోవైపు ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి

వడ దెబ్బలతో పిట్టల్లా రాలుతున్న జనం

చిన్నపాటి జాగ్రత్తలతో వడదెబ్బకు చెక్‌ పెట్టొచ్చంటున్న వైద్యులు

అప్రమత్తం అవ్వకపోతే ప్రాణనష్టం తప్పదని హెచ్చరిక

ఖానాపూర్‌, మే 3 : సూర్యతాపం ముందు మనిషి నిలువలేకపోతున్నాడు. రోజురోజుకూ భానుడు విజృంభిస్తుండడంతో ఎండతీవ్రత పెరిగిపోతోంది. జిల్లాలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఓ వైపు సూర్యుడు తనధాటికి పదును పెడుతున్నట్లుగా ఎండలు మండిపోతుం టే... తానేమి తక్కువ కాదన్నట్లు గాలి చడీచప్పుడు లేకుండా ఉండిపోయింది. తాను వస్తే ప్రళయమే అన్నట్లుగా ఈదురుగాలులు మాత్రమే వీస్తూ మాములు సమయంలో మాత్రం ఎటువంటి స్పందన లేకపోవడంతో జనం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో నానాటికీ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు జనం నానాతిప్పలు పడుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో ఉదయం తొమ్మిది గంటలు దాటితే ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. గత వారం రోజుల నుంచి జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట వడదెబ్బ మరణాలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. దీంతో వడదెబ్బను ముందస్తుగానే గుర్తించి చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మేలని వైద్యులు చెబుతున్నారు. 

వడదెబ్బను గుర్తించడం ఇలా..

ఏదో ఒక అవసరంతో ఇంట్లోంచి బయటకు వెళ్లక తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్తున్న జనం బయట ఎండవేడిమిని తట్టుకోలేక వడదెబ్బకు గురవుతున్నారు. జిల్లాలో గత వారం రోజుల వ్యవధిలోనే పదిమందికి పైగా జనం వడదెబ్బతో మృతి చెందారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రమాదకరమైన ఈ వడదెబ్బ సోకిన వ్యక్తిలో ఈ లక్షణాలను కలిగి ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ బారిన పడిన వ్యక్తి ఒంట్లో ఉష్ణో గ్రతలు తీవ్రంగా పెరిగిపోతాయి. తలతిప్పడం, వాంతులు అవ్వడం, నీళ్ల విరేచనాలవ్వడం, నోరు ఆరిపోవడం, ఎక్కవగా చమటలు పోయడం లాంటివి జరుగుతాయి. ఇలాంటి లక్షణాలు కలిగినప్పుడు వెంటనే అ ప్రమత్తం అయి వైద్యం చేయించుకోకపోతే మనిషి డీహైడ్రేషన్‌కు గుర యి ప్రాణాలు పోయే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ సోకిన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశంలో ఉంచి ప్రతి పదిహేను నిమిషాలకొకసారి తడిగుడ్డతో ఒళ్లంతా తుడువాలి. ఇక ఇంటి వద్ద వేచి చూడకుండా ఖచ్చితంగా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఐవీ ప్లూయి డ్స్‌ (సెలైన్‌బాటిళ్లు) అందించాల్సి ఉంటుంది. ఇందులో ఏమాత్రం అలసత్వం వహించినా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

వడదెబ్బ సోకకుండా పాటించాల్సిన జాగ్రతలు

ప్రస్తుతం భానుడు తన ఉగ్రరూపాన్ని చూపుతుండడంతో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. దీంతో ఏమాత్రం ఆదమర్చిన వడదెబ్బ బారిన పడి ప్రాణాలమీదకు తెచ్చుకోవడం తప్పదని వైధ్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ సోకకుండా కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎండలు మండిపోతున్న సమయంలో సాధ్యమైనంత వరకు ఎండలో తిరుగకుండా జాగ్రత్తపడాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటకు వెళ్ళాల్సి వస్తే గొడుగు లేదా టోపి, లేదా ఏదైనా రుమాలు సాయంతో తలకు ఎండ తగులకుండా కప్పేయాలని సూచిస్తున్నారు. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా తరుచుగా నీళ్లు తాగుతుండాలి. ఎండలోంచి వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా ఓఆర్‌ఎస్‌ ద్రావణం తీసుకోవాలి. ఓఆర్‌ఎస్‌ ద్రావణం అందుబాటులో లేకపోతే చక్కెర, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని తీసుకోవాలి. ఎలకో్ట్రలైట్స్‌ ఎక్కువగా ఉండే సీజనల్‌ ప్రూట్స్‌ తాటిముంజలు, ఖర్బుజా, ఫైన్‌ఆపిల్‌, మామిడి లాంటి పండ్లను అధికంగా తీసుకోవాలి. మజ్జిగను తీసుకోవడం ద్వారా శరీరం తొందరగా డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. ఎండలు అధికంగా ఉన్న ఈ సమయంలో మంసాహారం ఎక్కువగా తీసుకోకుండా తేలికగా జీర్ణం అయ్యే కూరగాయలు, పండ్లకు ప్రాధాన్యతనివ్వాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

విచ్చలవిడిగా కూల్‌పాయింట్‌లు, జ్యూస్‌సెంటర్‌లు

ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సమయంలో ఇంట్లోంచి బయటకు వెళ్లిన వారు సూర్యతాపాన్ని తట్టుకునేందుకు నానాతిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో శీతలపానీయాలు, జ్యూస్‌లు తాగి ఉపశమనం పొందేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రజల మక్కువను సోమ్ము చేసుకోవడమే లక్ష్యంగా మార్కెట్‌లో రోజురోజుకూ విచ్చలవిడిగా జ్యూస్‌సెంటర్‌లు, కూల్‌పాయింట్‌లు వెలుస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి పండ్లరసాలను యాధావిధిగా కాకుండా రుచి కోసం జ్యూస్‌ సెంటర్‌లలో నానా రకాల పుడ్‌కెమికల్స్‌ కలుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చల్లని నీటితో కాకుండా పండ్ల రసాలలో ఐస్‌ లాంటిది కలపడంతో అందులో ఉండే ప్రకృతి సిద్దమైన గుణాలు లేకుం డా పోతాయని నిపుణులు చెబుతున్నారు. పండ్లరసాలలో ఎటువంటి ఐస్‌ గాని కెమికల్స్‌ గాని కలుపకుండా సహజసిద్ధంగా తాగితేనే ఉప యోగంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఐస్‌క్రీంలు, కూల్‌డ్రింక్స్‌ గురించి వేరే చెప్పక్కర్లేదని అవి మనిషికి చేసే మంచికంటే చెడే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందే క్రమంలో వీటికి దగ్గరైతే ఆరోగ్యమేమోగాని కొత్త అనారోగ్యాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మార్కెట్‌లో వెలుస్తున్న ఈ వేసవి నేస్తాలపై సంబందిత శాఖాధికారులు పర్యవేక్షణ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

అప్రమత్తంగా లేకుంటే ప్రమాదమే

ఎండలు మండిపోతున్న ఈ సమయంలో సాధ్యమైనంత వరకు ఉద యం పదిగంటల లోపే పనులు ముగించుకుని ఇంటిపట్టున ఉండే ప్ర యత్నం చేయాలి. వడదెబ్బ సోకినవ్యక్తికి ఎలక్ర్టోలైట్స్‌ లోపించకుండా వెంటనే ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగించి వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. వడదెబ్బ సోకకుండా పండ్లు, కూరగాయలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఒంట్లోనీటి శాతం తగ్గకుండా ఎప్పటికప్పుడు నీటిని తీసుకోవడం, మజ్గిగ లాంటి ద్రావణం తీసుకోవడం మంచిది. మసాల, ఆయిల్‌పుడ్‌, మంసాహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. 

- డాక్టర్‌ వేణుగోపాలకృష్ణ, ఏరియా ఆసుపత్రి ఆర్‌ఎంవో, నిర్మల్‌ 

Read more