అస్తమించని డప్పు ‘సూర్యుడు’

Nov 26 2021 @ 00:29AM

‘‘శాస్త్రమనే ఈ తబళాలు, డోలక్‌లు ఎప్పుడు పుట్టాయి? మహా అంటే ఓ రెండుమూడు వందల యేండ్లయి ఉంటది. మరి డప్పు ఎప్పుడు పుట్టింది? మనిషి పుట్టినప్పుడు పుట్టింది’’ అని ‘మహాదిగ’ డాక్యుమెంటరీలో ఒక్క మాటలో శతాబ్దాల శబ్దసంగీత రహస్యాన్ని బట్టబయలు చేసిన డప్పు సూర్యుడు కుంపటి సూర్యభగవంతరావు. అతడు డప్పు చేతిలోకి తీసుకుంటే రణరంగంలో సోల్జర్స్‌ కమాండర్‌ గన్‌ అందుకున్నట్టే. దరువుల నిప్పులు దుముకుతుంటే ఒక మహాద్భుత ప్రదర్శన కళ్లముందుకొచ్చేది. అతడు ఈ దేశ మూలవాసుల ఆత్మగౌరవ ప్రతీక. సింధూ లోయ కేంద్రంగా విరాజిల్లిన మూలవాసీ సాంస్కృతిక వికాసానికి ఆనాటి కళలు ఎంత దోహదం చేసి ఉంటాయో డప్పును చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ దేశ వెలివాడలు ప్రపంచానికి అందించిన డప్పు శక్తి ఎంతటిదో తెలియాలంటే సూర్యభగవంతరావును చూస్తే తెలుస్తుంది. డప్పు మీద సరిగమలు వాయించడం అంటే మాటలా? శాస్త్రీయ సంగీతం, డప్పు రెండు భిన్న ధృవాలు. తమది మాత్రమే శాస్త్రీయమని విర్రవీగే వారి కన్నులు తెరిపించేది ఈ డప్పుసూర్యుని ప్రదర్శన. నోటితో దరువులు పలుకుతూ వాటిని మళ్లీ డప్పు మీద వాయిస్తుంటే చూసిన వారి బతుకు ధన్యమైపోతుందంటే అతిశయోక్తి కాదు. అంతటి ముగ్ధమనోహర ప్రదర్శన అతడికే సాధ్యమైంది.


డప్పుకు అంతర్జాతీయ గౌరవాన్ని సంపాదించిపెట్టిన కుంపటి సూర్యభగవంతరావు కృష్ణా జిల్లాలోని చెట్టూర్పు కుగ్రామంలో జన్మించారు. ఈ మహాకళాకారుడిని కన్నందుకు ఆ గ్రామం పేరు విశ్వవ్యాప్తమయ్యింది. చిన్ననాటి నుండే తన ఇంట్లో, ఇంటి చుట్టూ అంతా డప్పు వాయించే కళాకారులే. వారందరినీ చూస్తూ నిండా పదేళ్లు పూర్తికాకముందే ఈ డప్పుసూర్యుడు డప్పు విద్యను నేర్చాడు. ఈ డప్పు వల్ల చదువు ఎక్కడ ఆగుతుందోనని తల్లిదండ్రుల ఆందోళన. ఆ భయం నిజం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. సూర్యుడు డప్పు మీదే పంచ ప్రాణాలు నిలిపాడు. పుస్తకాల జ్ఞానం కన్నా డప్పు ప్రతిభే గొప్పదనుకున్నాడు. చూస్తుండగానే డప్పు కళలో పట్టు సాధించాడు. మొదట వద్దని వారించిన తల్లిదండ్రులే ఆ తరువాత అతడి కళను చూసి చప్పట్లుకొట్టి మురిసిపోయారు. అలా మొదలైన డప్పు వాయిద్య ప్రస్థానం జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశమంతా తిరిగింది. వేల ప్రదర్శనలు ఇచ్చేలా చేసింది. లక్షలమంది అభిమానం సూర్యుడిని కుదురుగా కూర్చోనివ్వలేదు.


సూర్యుడి గొప్పతనం అంతా డప్పు కళకు అతడు అదనంగా చేర్చిన నృత్యం, జతులు, దరువుల్లోనే ఉంది. సంప్రదాయంగా అందరిలాగే తాను కూడా డప్పు వాయించి ఉంటే అది అక్కడే ఆగిపోయి ఉండేది. కానీ, సంప్రదాయ రీతులను కాదని కొత్త ప్రదర్శనశైలిని ప్రయోగించాడు, ప్రవేశపెట్టాడు. సంగీతంలో ఉండే త్రిశ్రం, చతురస్రం, మిశ్రం, ఖండం, సంకీర్ణం వంటి ఐదు జతులు అతని వేళ్ల మీద సునాయాసంగా పలికేవి. ఒక్కో జతిలో ఏడు తాళాలు, మొత్తం 35తాళాలతో అతడు ప్రదర్శన ఇస్తే జనం ఊగి ఆడాల్సిందే. తనువులే కాదు, మనసులు కూడా చిందేసి అలసిపోవాల్సిందే. డప్పంటే అప్పటివరకు ఉన్న చావుడప్పు అనే చిన్నచూపును మార్చేసినవాడు ఈ సూర్యుడే. డప్పును ప్రచార ప్రదర్శన ఆయుధంగా మార్చాడు. 1976లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో సూర్యుడు ఇచ్చిన ప్రదర్శన ఆయనను ఆకాశానికెత్తింది, విదేశాలకు ద్వారాలు తెరిచింది. అమెరికా, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చేలా చేసింది. సూర్యభగవంతరావు డప్పు వాయిస్తే విదేశీయులు ఆయన్ను ముద్దులతో ముంచెత్తారంటే అతడి కళ వారిని ఎంతగా మంత్రముగ్ధులను చేసిందో ఊహించుకోవచ్చు. అలా 1996లో ‘నాంటీస్ ఫెస్టివల్‌’ ఫ్రాన్స్‌లో జరిగినపుడు భారతదేశం నుండి డప్పుతో హాజరైన కళాకారుడు సూర్యభగవంతరావు మాత్రమే. ఇలాంటి మైలురాళ్లు అతడి సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఉన్నాయి. సుమారు దశాబ్దంన్నర కాలం పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలిలో డప్పుతో సేవలు అందించిన సూర్యభగవంతరావు ఆ తరువాత తన మకాంను హైదరాబాద్‌కు మార్చుకున్నారు.


డప్పును ఒక కోర్సుగా ప్రవేశపెట్టాలని తెలుగు విశ్వవిద్యాలయం భావించినప్పుడు, దానికి సిలబస్‌ను సిద్ధం చేసిన ఘనత సూర్యభగవంతరావుదే. అంటరాని డప్పును యూనివర్సిటీ మెట్లెక్కించి అందరి చేత ప్రశంసలు అందుకునేలా చేశాడు. అంతరించిపోతున్న కళల జాబితాలో డప్పు పేరు చేరొద్దని దానికి రెండు చేతులు అడ్డుపెట్టి కాపు కాసాడు. వేలాది ప్రదర్శనలు ఇవ్వడమే కాదు వేలాదిమంది శిష్యులను కూడా తయారు చేశాడు. సూర్యుడి దగ్గర శిష్యరికం చేయడానికి విదేశీయులు కూడా క్యూ కట్టారంటే ఈ డప్పు గురువు అసాధారణ ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన ప్రతిభకు డప్పు విద్వాన్‌, డప్పు ప్రవీణ, డప్పు జానపద రత్న, హంస గుర్తింపులు దక్కాయి. ఇప్పుడు సూర్యభగవంతరావు రెండవ కుమారుడు తండ్రి వారసత్వాన్ని భుజాన వేసుకున్నాడు. తండ్రిలాగే డప్పును వాయిస్తూ, డప్పులో తండ్రిని చూసుకుంటున్నాడు.


డప్పు ఇవాళ ప్రపంచ సంగీతంలో ఒక ముఖ్యమైన వాయిద్యంగా మారింది. డప్పును నమ్ముకున్న సినిమా సంగీత దర్శకులు దాన్ని మార్కెట్‌ చేస్తూ కోట్లు గడిస్తున్నారు. రెండువందల డప్పులు అర్జంటుగా అవసరమున్నాయని ఏ.ఆర్‌.రహమాన్‌ దగ్గరి నుంచి ఫోన్‌కాల్‌ వస్తే ఒక్కరోజులో అంతమందిని పంపించి, అందరిని ఆశ్చర్యంలో ముంచాడు సూర్యభగవంతరావు. సినిమా వాళ్లకు నేడు ఇంత కాసులు కురిపిస్తున్న డప్పును నమ్ముకున్న ఆయనను మాత్రం పేదరికం వెంటాడింది. సొంత ఇల్లు కూడా లేని దారిద్య్రంలోనే తన బతుకంతా గడిపాడు. అగ్రవర్ణ కళాకారులకు అగ్రతాంబూలాలిచ్చే వ్యవస్థ మనది. దళితులనే కాదు, దళిత కళలకు సైతం కులాన్ని ఆపాదించి నిరాదరణకు గురిచేశారు. ఈ కనిపించని వివక్ష మీద సూర్యభగవంతరావు అగ్గైమండేవాడు: ‘సంకర డప్పులు వచ్చాయి సోదరా! అర్థం కావడం లేదా... ప్లాస్టిక్‌ డప్పులొచ్చి తరాలనాటి తోలు డప్పును మూలకు నెడుతున్నాయి. డప్పుకు పట్టిన గతే డప్పు కళాకారులకూ పట్టింది. విదేశాల్లో నేను డప్పు వాయించడానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజల ఆదరణను ఇప్పటికీ మరచిపోలేను. కొందరైతే వేల రూపాయలు వెచ్చించి డప్పు కొనడానికి ముందుకొచ్చారు. ఇక్కడేముంది... కొన్నిసార్లు వెకిలినవ్వుల్ని... అసభ్య వ్యాఖ్యానాల్ని భరించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి మారి, డప్పుకు సముచిత గౌరవం దక్కాలి’ అనేవాడు. బతుకంతా డప్పుకే ధారపోశాడు.


కులమున్నవాళ్లు ఒక కళకు జీవితాన్ని ధారపోస్తే పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు వస్తాయి. ఒకవేళ వారు మరణిస్తే కూడా వారి కుటుంబసభ్యులకైనా అందిస్తారు. మరి కులంలేని ఇలాంటి కళాకారుల దుస్థితి మారేది ఎప్పుడు అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలుస్తున్నది. సూర్యభగవంతరావు చేసిన అద్భుతమైన కృషికి అతడు బతికున్నప్పుడు ఎలాగూ సరైన గుర్తింపు, గౌరవం దక్కలేదు. ఇప్పటికైనా ఆయన కుటుంబాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదుకోవాలి. అతడు కలగన్నట్టు డప్పుకు గౌరవాన్ని కల్పించాలి. డప్పు కళాకారులను ప్రోత్సహించాలి. అతడి జీవితకాలపు కృషి గ్రంథస్తం కావాలి. అందుకోసం ఆయనను దగ్గరగా చూసినవారే పూనుకోవాలి. ఆయన అకాల మరణం రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు, యావత్‌ మూలవాసీ కళలకు ఒక తీరని లోటే.

అందె భాస్కర్‌

ఫౌండర్‌, అందె మ్యూజిక్‌ అకాడెమి

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.