వేసవిని తలపిస్తున్న ఎండలు

ABN , First Publish Date - 2022-09-24T05:59:32+05:30 IST

జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. నిత్యం వర్షపు జల్లులతో చల్లటి వాతావరణం ఉండాల్సిన ఈ సమయంలో వేసవిని తలపించే రీతిలో ఎండలు మండిపోతున్నాయి.

వేసవిని తలపిస్తున్న ఎండలు
మధ్యాహ్న సమయంలో నిర్మానుష్యంగా ఉన్న ఒంగోలులోని పాతమార్కెట్‌ సెంటర్‌

రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు

ఎక్కువ చోట్ల 38 డిగ్రీలపైనే నమోదు

ఉక్కపోతతో జనం ఇక్కట్లు

ఒంగోలు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. నిత్యం వర్షపు జల్లులతో చల్లటి వాతావరణం ఉండాల్సిన ఈ సమయంలో వేసవిని తలపించే రీతిలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కన్నా అత్యధిక చోట్ల నాలుగైదు డిగ్రీలు అధికంగా ఉంటుండగా పలుచోట్ల 38డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదుతోపాటు పగటిపూట అధిక సమయం ఎండలు మండుతున్నాయి. దీనికితోడు ఉక్కపోత కూడా పెరిగి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాధారణంగా జిల్లాలో ప్రస్తుత సమయం వానాకాలం. అందులోనూ నిత్యం వర్షపుజల్లులతో కూడిన చల్లటి వాతావరణం ఉంటుంది. అధిక ప్రాంతాల్లో 30 నుంచి 33 డిగ్రీలు, కొన్నిచోట్ల 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి. అలాంటిది ప్రస్తుత వాతావరణాన్ని పరిశీలిస్తే ఎండకాలాన్ని తలపిస్తోంది. గత పదిరోజులుగా జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి రాష్ట్రంలోనే అధిక ఉష్ణోగ్రతలు కాగా ఉదయం 9 గంటల నుంచే ఎండల తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నం 12గంటల సమయానికల్లా మరింత పెరుగుతోంది. సాయంత్రం వరకు అలాగే వేడి వాతావరణం ఉంటోంది. జిల్లాలో శుక్రవారం ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఉదయం 11గంటల ప్రాంతంలో చాలాచోట్ల 36 డిగ్రీల వరకూ నమోదయ్యాయి. మధ్యాహ్న ఒంటిగంట సమయంలో రాష్ట్రంలోనే అత్యధికంగా హెచ్‌ఎంపాడు మండలం వేములపాడులో 39 డిగ్రీల ఎండ కాచింది. ఆ సమయంలో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన తొలి పదిస్థానాల్లో నాలుగు జిల్లాలోనే ఉన్నాయి. అలాగే మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో వరుసగా తొలి మూడు స్థానాలు జిల్లాలోనే ఉన్నాయి. ఆ సమయంలో కురిచేడులో రాష్ట్రంలోనే అత్యధికంగా 38.82 డిగ్రీలు  నమోదు కాగా, అది వైపాలెం మండలం గోళ్ళవిడిపిలో 38.51 డిగ్రీలు, పొన్నలూరులో 38.45 డిగ్రీలుగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రాష్ట్రంలో మూడో స్థానంలో ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలోని త్రోవగుంటలో 38.81 డిగ్రీలు, చీమకుర్తిలో 38.71 డిగ్రీలు నమోదైంది. జిల్లాలో 103 కేంద్రాల్లో ఉష్ణోగ్రతలను ప్రభుత్వం నమోదు చేస్తుండగా అందులో ఇంచుమించు 60చోట్ల 35డిగ్రీల కన్నా అధికంగానే ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. కాగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతోపాటు ఎండల తీవ్రత పెరగడంతో ఉక్కపోత వాతావరణం నెలకొని జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు మారిన వాతావరణం ప్రజల ఆరోగ్య పరిస్థితిపైనా తీవ్రంగానే ప్రభావం చూపుతోంది.  జ్వరాలు ఇతర వ్యాధులు విజృంభిస్తున్నాయి. 


Updated Date - 2022-09-24T05:59:32+05:30 IST