ఇకపై సుప్రీం విచారణ ప్రత్యక్ష ప్రసారం.. తొలి అడుగు ఎన్వీ రమణదే..

ABN , First Publish Date - 2022-09-21T17:20:52+05:30 IST

ఇకపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ ప్రత్యక్ష ప్రసారం (Live Proceedings) కానుంది.

ఇకపై సుప్రీం విచారణ ప్రత్యక్ష ప్రసారం.. తొలి అడుగు ఎన్వీ రమణదే..

న్యూఢిల్లీ : ఇకపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ ప్రత్యక్ష ప్రసారం (Live Proceedings) కానుంది. సుప్రీంకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి వచ్చారు. మంగళవారం సాయంత్రం జరిగిన సుప్రీంకోర్టు ఫుల్ కోర్టు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే వారం నుంచి కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సుప్రీం కోర్టు సిబ్బంది సిద్ధమైంది. తొలుత రాజ్యాంగ ధర్మాసనం కేసుల ప్రత్యక్ష ప్రసారంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీజేఐ యూయూ లలిత్ (Justice UU Lalith) నేతృత్వంలో మంగళవారం జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు వర్గాల వెల్లడించాయి. 


అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ప్రజలకు చేరువ చేసే క్రమంలో కీలక ముందడుగు గతంలోనే పడింది. కోర్టు చరిత్రలోనే తొలిసారిగా ఎన్వీ రమణ (NV Ramana) సీజేఐగా పదవీ విరమణ చేయనున్న సందర్భంగా ప్రొసీడింగ్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేశారు. సీజేఐ ధర్మాసనం విచారణ ప్రత్యక్ష ప్రసారానికి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. నిజానికి ఎన్వీ రమణ తాను సీజేఐగా ప్రమాణం చేసిన నాటి నుంచి కూడా సుప్రీం విచారణ ప్రత్యక్ష్యంగా సాగాలని కోరుకున్నారు. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై ఒక కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ కూడా సానుకూలంగా నివేదిక ఇచ్చింది. కానీ అప్పట్లో ఇతర న్యాయమూర్తులు దీనికి అంగీకరించలేదు. ఇలా ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తే తమపై ఒత్తడి పెరుగుతుందని వెనుకడుగు వేశారు. దీంతో కనీసం తన పదవీ విరమణ ఒక్కరోజైనా లైవ్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని భావించిన ఎన్వీరమణ.. ప్రొసీడింగ్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేసి తొలి అడుగు వేశారు. 




Updated Date - 2022-09-21T17:20:52+05:30 IST