సుప్రీం జడ్జిలు లక్ష్మణరేఖ దాటారు

ABN , First Publish Date - 2022-07-06T08:41:36+05:30 IST

నూపుర్‌ శర్మ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా చేసిన వ్యాఖ్యలు లక్ష్మణ రేఖను దాటాయని ఆందోళన వ్యక్తం చేస్తూ 117 మంది ప్రముఖులు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు బహిరంగ లేఖ రాశారు.

సుప్రీం జడ్జిలు లక్ష్మణరేఖ దాటారు

నూపుర్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా వారి వ్యాఖ్యలు తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేశాయి


న్యాయవ్యవస్థపై చెరగని మచ్చ లాంటి వ్యాఖ్యలవి

సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు 117 మంది  లేఖ

న్యూఢిల్లీ, జూలై 5: నూపుర్‌ శర్మ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా చేసిన వ్యాఖ్యలు లక్ష్మణ రేఖను దాటాయని ఆందోళన వ్యక్తం చేస్తూ 117 మంది ప్రముఖులు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు బహిరంగ లేఖ రాశారు. వారిలో 15 మంది మాజీ న్యాయమూర్తులు, 77 మంది మాజీ ఉన్నతాధికారులు, 25 మంది సాయుధ దళాలకు చెందిన మాజీ అధికారులు ఉన్నారు. పిటిషన్‌లో నూపుర్‌శర్మ లేవనెత్తిన అంశాలకు.. జడ్జిలు చేసిన వ్యాఖ్యలకు.. న్యాయశాస్త్రం ప్రకారం ఎలాంటి సంబంధమూ లేదని.. న్యాయమూర్తులు మునుపెన్నడూ లేని విధంగా న్యాయపరిపాలనలోని అన్ని నిబంధనలనూ అతిక్రమించారని అభ్యంతరం వెలిబుచ్చారు.  వేరే రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను బదిలీ చేయడానికి, ఒకటిగా చేసే అధికార పరిధి (జ్యూరి్‌సడిక్షన్‌) హైకోర్టులకు లేదనే విషయం పూర్తిగా తెలిసి కూడా..


హైకోర్టుకు వెళ్లాలని సూచించిందంటూ ధ్వజమెత్తారు. ‘‘రాజ్యాంగం ప్రకారం అన్ని వ్యవస్థలూ తమ విధులు నిర్వర్తిస్తేనే ఏ దేశ ప్రజాస్వామ్యమైనా చెక్కుచెదరకుండా ఉంటుందని నమ్మే బాధ్యులైన పౌరులం మేము. ఇటీవల సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు లక్ష్మణరేఖను దాటాయి. అందుకే మేం ఈ బహిరంగ ప్రకటన విడుదల చేయాల్సి వస్తోంది. నూపుర్‌శర్మ పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా మునుపెన్నడూ లేనివిధంగా చేసిన దురదృష్టకర  వ్యాఖ్యలు దేశంలోపల, వెలుపల అందరినీ దిగ్ర్భాంతికి గురిచేశాయి. వారు చేసిన వ్యాఖ్యలకు న్యాయవ్యవస్థలో ఏ విధంగానూ స్థానం లేదు. ఆ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థలోని అన్ని నిబంధనలనూ అతిక్రమించినట్టుగా పిటిషన్‌తో సంబంధం లేకుండా.. నూపుర్‌శర్మను దోషిగా నిర్ధారిస్తూ న్యాయనిర్ణయం చేసినట్లుగా ఉన్నాయి. ‘దేశంలో ప్రస్తుత పరిస్థితులకు ఆమే పూర్తిగా కారణం’ అన్న ధర్మాసనం వ్యాఖ్యలకు ఎలాంటి హేతుబద్ధతా లేదు. ఈ వ్యాఖ్యల ద్వారా.. ఉదయ్‌పూర్‌లో పట్టపగలు జరిగిన దాడి కేసులో నిందితులకు వర్చువల్‌గా నిర్దోషిత్వాన్ని ప్రసాదించినట్లయిం ది. ఎఫ్‌ఐఆర్‌ దాఖలైతే అరెస్టు ఎందుకు చేయలేదంటూ కోర్టు చేసిన వ్యాఖ్యలతో మొత్తం న్యాయసమాజం విస్మయానికి, తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. ఈ దురదృష్టకర వ్యాఖ్యలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంలోని న్యాయవ్యవస్థపై చెరగని మచ్చలాంటివి. కోర్టు ముందు లేని అంశాలపై తీర్పు ఇచ్చినట్టుగా ఉన్న ఈ వ్యాఖ్యలు.. భారత రాజ్యాంగ స్ఫూర్తికి, సారానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. అలాంటి తీవ్ర వ్యాఖ్యలతో పిటిషనర్‌పై ఒత్తిడి తేవడం.. విచారణ లేకుండానే దోషిగా తేల్చడం.. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై న్యాయాన్ని నిరాకరించడం.. ఇవేవీ ప్రజాస్వామిక సమాజం లక్షణాలు కాబోవు. ఈ తరహా వ్యాఖ్యలను ఉపసంహరించుకోదగినవి. అలా జరిగినప్పుడే..  న్యాయాన్ని కాపాడాలనుకునేవారి మనసులు ప్రశాంతంగా ఉంటాయి. సుప్రీంకోర్టు పిటిషనర్‌(నూపుర్‌శర్మ) ప్రాథమిక హక్కు ను కాపాడడానికి బదులు.. పిటిషన్‌ను విచారించడానికే తిరస్కరించింది. అంతేకాదు, ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేసింది. సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరు ప్రశంసార్హం కాదు’’ ..అని వారు లేఖలో తమ ఆవేదన వెలిబుచ్చారు. మరోవైపు.. జమ్ముకశ్మీర్‌కు చెందిన ‘ఫోరమ్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ సోషల్‌ రైట్స్‌’ కూడా ఈ అంశంపై జస్టిస్‌ ఎన్వీ రమణకు లేఖ రాసింది. నూపుర్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆ జడ్జిలను ఆదేశించాలని కోరింది.

Updated Date - 2022-07-06T08:41:36+05:30 IST