పౌల్ర్టీ .. పల్టీ!

ABN , First Publish Date - 2022-08-11T05:11:10+05:30 IST

పౌల్ర్టీ రంగం పల్టీ కొట్టేలా ఉంది. రోజురోజుకూ గుడ్డు ధర పతనమవుతుండటంతో

పౌల్ర్టీ .. పల్టీ!

  • పౌల్ర్టీ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం 
  • గుడ్డు ఉత్పత్తికి గడ్డు కాలం 
  • పెరుగుతున్న దాణా ఖర్చులు 
  • తగ్గుతున్న గుడ్ల ఎగుమతులు 
  • పొంతనలేని నెక్‌ నిర్ణయ ధరలు 
  • గుడ్డు ధరపై ట్రేడర్ల ఇష్టారాజ్యం 
  • తీవ్రంగా నష్టపోతున్న పౌలీ్ట్ర రైతులు


పౌల్ర్టీ రంగం పల్టీ కొట్టేలా ఉంది. రోజురోజుకూ గుడ్డు ధర పతనమవుతుండటంతో పౌల్ర్టీ పరిశ్రమ కుదేలవుతోంది. గుడ్ల ఉత్పత్తి పెరిగి, ధరలు పడిపోవడంతో పౌల్ర్టీ రంగానికి క్రమంగా రైతులు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. నెక్‌ నిర్ణయించిన గుడ్డు ధరను ట్రేడర్లు పక్కకు నెట్టేసి తమ ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇటు రైతులు, అటు వినియోగదారులు నష్టపోయి వ్యాపారులు లాభ పడుతున్నారు.


షాద్‌నగర్‌అర్బన్‌, ఆగస్టు 10: మనిషి ఆరోగ్యానికి కావాల్సిన పోషక పదార్థాలను అందిస్తున్న గుడ్డు ఉత్పత్తికి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. గుడ్డు ఉత్పత్తి వ్యయం పెరిగి ధర పతనం కావడంతో పౌల్ర్టీ పరిశ్రమ నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నది. దేశ వ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తి పెరిగి, గిట్టుబాటు ధర రాకపోవడంతో కోళ్ళ పెంపకం రైతులకు భారమైంది.పౌల్ర్టీ రంగానికి అనుసంధానంగా ఉన్న నెక్‌ నిర్ణయించిన గుడ్డు ధరను ట్రేడర్లు పక్కకు నెట్టేసి తమ ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం గుడ్డు ధరలను పట్టించుకోకపోవడంతో ఇటు పౌల్ర్టీ రైతులు, అటు వినియోగదారులు నష్టపోతూ వ్యాపారులు లాభపడుతున్నారు.


దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న పౌల్ర్టీ రంగం

ఒకప్పుడు దక్షణ భారత దేశానికే పరిమితమైన పౌల్ర్టీ రంగం క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. నాలుగేళ్ళ క్రితం 25 కోట్లు ఉన్న కోళ్ళ పెంపకం ప్రస్తుతం 32 కోట్లకు పెరిగిందని నెక్‌ సభ్యుల అభిప్రాయం. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న పౌల్ర్టీ రంగం వల్ల దాణా, ముడి సరుకుల ధరలు కూడ భారీగా పెరిగాయి. గుడ్ల ఉత్పత్తి పెరిగి, ధరలు పడిపోవడంతో పౌల్ర్టీ రంగానికి క్రమంగా రైతులు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనే అధికంగా పౌల్ర్టీ లు ఉండేవి. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే గుడ్లు హైదరాబాద్‌తోపాటు బాంబే, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. ఆంధ్రప్రదేశ్‌లోని గుడ్లు ఒరిస్సా, బిహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో సైతం పౌల్ర్టీ లు ఏర్పాటు కావడంతో ఎగుమతులు నిలిచాయి. ప్రస్తుతం తెలంగాణపౌల్ర్టీ  రైతులు గుడ్ల ఎగుమతికి హైదరాబాద్‌, బాంబే, మహారాష్ట్రలపైనే ఆధారపడాల్సి వస్తున్నది. బాంబే, మహారాష్ట్రలకు సైతం ఇతర రాష్ట్రాల నుంచి గుడ్లు దిగుమతి అవుతున్నాయి. దీంతో తెలంగాణాలోని గుడ్ల ఎగుమతి ప్రశ్నార్థకంగా మారుతున్నది. 


పెరుగుతున్న దాణా వ్యయం

కోళ్ళ పెంపకానికి దాణా ఖర్చులు భారీగా పెరిగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాణా తయారీకి ప్రధానంగా వినియోగించే మొక్కజొన్న క్వింటాలు ధర రూ.2,500 నుంచి రూ.2,600, సోయా రూ.5,000, నూకలు రూ.2,000, పరం రూ.1,900కు రైతులు కొనుగోలు చేస్తున్నారు. రూ.15వేల నుంచి రూ.20వేలలోపు ఉండాల్సిన దాణా టన్ను ధర రూ.27 వేలకు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా పెరిగిన దాణా ఖర్చులతో గుడ్డు ఉత్పత్తి వ్యయం దాదాపు నాలుగు రూపాయలకు చేరుకుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. గుడ్డు ధర 4.50 రూపాయలకు పైగా ఉంటేనే లాభదాయకమని, ప్రస్తుతం రూ.3.30 నుంచి రూ.3.35కు ట్రేడర్లు తీసుకువెళ్తుండడంతో భారీగా నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఇటు రైతులు - అటు వినియోగదారులు

సంక్షోభంలోకి వెళ్లున్న పౌల్ర్టీ పరిశ్రమపై ఆధారపడిన తమతోపాటు వినియోగదారులు నష్టపోతుండగా.. మధ్యలో వ్యాపారులు లాభాలు గడిస్తున్నారని పౌల్ర్టీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద రూ.3.30 నుంచి రూ.3.35కు కొనుగోలు చేస్తున్న గుడ్లు చేతులు మారి వినియోగదారుడికి రూ.5 నుంచి రూ.6కు విక్రయిస్తున్నారని గుర్తుచేస్తున్నారు. గుడ్డుకు నెక్‌ నిర్ణయించే ధరలను ట్రేడర్లు పక్కకు నెట్టేసి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్డు ఉత్పత్తిపై ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. జూన్‌లో 20రోజులు తప్ప గత ఫిబ్రవరి నుంచి నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు తెలిపారు. మే నెలలో గుడ్డు ధర రూ.2.80కు పడిపోయిందని గుర్తుచేశారు. దాణా ఖర్చులు పెరిగి గుడ్డు ధర పడిపోవడంతో ప్రతి కోడికి నిత్యం రూపాయి వరకు నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్న పౌల్ర్టీ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 


కేంద్రం ఎగ్‌ బోర్డును ఏర్పాటు చేయాలి

పౌల్ర్టీ రైతులకు అండగా నిలిచేలా కేంద్ర ప్రభుత్వం ఎగ్‌బోర్డును ఏర్పాటు చేయాలి. గుడ్డు ధర పతనం కాకుండా చర్యలు తీసుకోవాలి. గుడ్డు ఉత్పత్తి, వినియోగం, ధరలకు అనుగుణంగానే నూతన పౌల్ర్టీ ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి. అవసరమైతే రైతుల్లో చైతన్యం తీసుకువచ్చి కోళ్ల పెంపకాన్ని తగ్గించాలి. అప్పుడు దాణా వినియోగం, గుడ్ల ఉత్పత్తి తగ్గి, ధర పెరిగే అవకాశం ఉంటుంది. 

- పాతూరి వెంకటరావు, నెక్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు


గుడ్డుకు మద్దతు ధరను నిర్ణయించాలి

వ్యవసాయ ఉత్పత్తుల మాదిరిగా గుడ్డుకు సైతం కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించాలి. మద్దతు ధర లేకపోవడంతో వ్యాపారులు చెప్పిన ధరకు గుడ్లను విక్రయించి నష్టపోవాల్సి వస్తున్నది. వ్యవసాయ రంగంపై ఆధారపడి నడుస్తున్న గుడ్డుకు మద్దతు ధరను నిర్ణయించి, ప్రభుత్వం ఆదుకుంటేనే పౌల్ర్టీ  రంగానికి మనుగడ ఉంటుంది. 

- మలినేని శ్రీనివాస్‌రావు, నెక్‌ షాద్‌నగర్‌ జోన్‌ చైర్మన్‌



Updated Date - 2022-08-11T05:11:10+05:30 IST