కబళిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-04-22T05:32:19+05:30 IST

కరోనా బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు మృత్యువాతపడుతున్నారు.

కబళిస్తున్న కరోనా

పెరుగుతున్న మరణాలు

నిర్లక్ష్యం కొంతవరకూ కారణమంటున్న వైద్యులు 

మొదటి వారం రోజులు సాధారణ లక్షణాలు

మందుల వినియోగంతో తగ్గుముఖం

ఎనిమిదో రోజు నుంచి 14వ రోజు వరకూ కూడా 

జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు 

ఆ సమయంలోనే వైరస్‌పై బదులుగా...

శరీరంలోని అవయవాలపై దాడి చేస్తున్న వ్యాధి నిరోధక వ్యవస్థ

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

కరోనా బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు  మృత్యువాతపడుతున్నారు. అయితే, నిర్లక్ష్యం కూడా ఇందుకు కొంత కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. సాధారణంగా వైరస్‌ బారినపడితే...ఒకటో రోజు నుంచి ఏడో రోజు వరకు సాధారణ లక్షణాలైన జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటివి మాత్రమే కనిపిస్తాయి. ఆయా లక్షణాలను బట్టి మందులను వాడుతుంటారు. దీంతో లక్షణాలు మెల్లగా తగ్గిపోతాయి. అయితే, లక్షణాలు తగ్గిపోగానే చాలామంది తాము పూర్తిగా కోలుకున్నామని భావించి బయటతిరగడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం చేస్తుంటారు. అదే ప్రాణాల మీదకు తెస్తున్నదని వైద్యులు పేర్కొంటున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తి శరీరంలో రెండో దశ ఎనిమిదో రోజు నుంచి 14వ రోజు వరకూ వుంటున్నట్టు చెబుతున్నారు. ఎనిమిదో రోజు తరువాత నుంచి శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ క్రియాశీలకంగా మారి వైరస్‌పై పోరాటానికి సిద్ధమవుతుంది. అయితే, అప్పటికే వినియోగించిన మందులు, ఇతర స్టెరాయిడ్స్‌ వల్ల వైరస్‌ చాలా వరకూ తగ్గుతుంది. ఈ తరుణంలో క్రియాశీలకమైన వ్యాధి నిరోధక వ్యవస్థ శరీరంలోకి వచ్చిన వైరస్‌పై యుద్ధం చేయడానికి బదులు ఇతర అవయవాలపై పోరాటం చేసి వాటిని డ్యామేజ్‌ చేస్తుంది. ఈ క్రమంలో పలు ఆర్గాన్స్‌ దెబ్బతిని రోగి ప్రాణాపాయానికి దారితీస్తుంది. 


శ్వాస ఇబ్బందులు

వ్యాధి నిరోధక వ్యవస్థ తప్పిదం వల్ల ఊపిరి తిత్తులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. సాధా రణంగా మనం ముక్కు ద్వారా తీసుకునే గాలి ఊపిరి తిత్తుల నుంచి ఒక లేయర్‌ ద్వారా రక్తంలోకి వెళ్లాలి. అయితే, వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థ చేసిన యుద్ధం వల్ల ఈ లేయర్‌ గట్టిపడిపోతుంది. దీనిని ఎక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ర్టెస్‌ సిండ్రోమ్‌ (ఏఆర్డీఈఎస్‌) అంటారు. దీనివల్ల వైరస్‌ బారినపడిన వ్యక్తి సాధారణంగా గాలి తీసుకున్నప్పటికీ...రక్తంలోకి గాలి వెళ్లదు. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ ఒక్కసారిగా పడిపోయి, ఆయాసం పెరిగి రోగి ప్రాణాపాయ స్థితికి చేరు కుంటాడు. ఎక్కువ మంది ఈ తరహా ఇబ్బందులతోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వైద్యులు పేర్కొం టున్నారు. 


వారిలో ఎక్కువ

ఏఆర్‌డీఎస్‌ సమస్య ఎవరినైనా వేధించవచ్చునని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వైరస్‌ బారినపడి లక్షణాలు తగ్గాయని భావించి నిర్లక్ష్యం చేసే వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ముఖ్యంగా 14వ రోజు వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గుతున్నట్టు అనిపించినా, ఆయాసం పెరిగినా అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. సాధారణంగా 50 ఏళ్లు పైబడిన, స్మోకింగ్‌ చేసే వారిలో, షుగర్‌తో బాధపడే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు. ఈ సమస్యలతో ఇబ్బందులుపడే ప్రతి పది మందిలో ఐదుగురు, యుక్త వయస్కుల్లో ప్రతి 25 మందిలో ఒకరు ఈ సమస్యతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, సెకండ్‌వేవ్‌ ప్రారంభమైన తరువాత యుక్త వయస్కుల్లోనే ఈ సమస్య బారినపడుతున్న వారి సంఖ్య పెరిగిందంటున్నారు. 



ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.. 

వైరస్‌ బారినపడిన వారిలో ఏఆర్‌డీఎస్‌ సమస్యతో ఎక్కువ మంది ప్రాణాలను పోగొట్టుకుం టున్నారు. లక్షణాలు తగ్గిన వెంటనే ఎక్కువ మంది కరోనా తగ్గిందని భ్రమించి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అది సరికాదు. వైరస్‌ లక్షణాలు తగ్గిన తరువాత కూడా మరికొన్ని రోజులపాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ చూసుకుంటూ ఉండాలి. ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా ఆస్పతిలో చేరడం ఉత్తమం. వైరస్‌ సోకిన వ్యక్తులకు మొదటి వారం రోజుల్లో స్టెరాయిడ్స్‌ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. రెండో దశలో అంటే వైరస్‌ సోకిన వారం తరువాత స్టెరాయిడ్స్‌ తగినంత మోతాదులో ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.   

- డాక్టర్‌ ఫణీంద్ర, పల్మనాలజిస్ట్‌, కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రి




సెకండ్‌వేవ్‌లో రికార్డు 

అత్యధికంగా 810 కేసులు నమోదు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైన తరువాత బుధవారం అత్యధికంగా 810 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 70,497కు చేరింది. ఇందులో 64,890 మంది కోలుకోగా, మరో 5,033 మంది చికిత్స పొందుతున్నారు.చికిత్స పొందుతూ బుధవారం ఇద్దరు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. వీటితో జిల్లాలో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 574కు చేరింది. 

Updated Date - 2021-04-22T05:32:19+05:30 IST