మళ్లీ నిఘా.. నిషేధాలా?

Aug 18 2021 @ 00:00AM

1996- అఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్‌ ఆక్రమించుకున్న సంవత్సరం.. అప్పటి నుంచి ఐదు సంవత్సరాలు తాలిబన్‌ పాలనలో మహిళలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిపై షరియా పేరిట అనేక అత్యాచారాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. 2001లో అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్‌ పాలన అంతమయిన తర్వాత- ఆ దేశంలో మహిళలు ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ రెండు దశాబ్దాల  తర్వాత తాలిబన్‌ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఈ ప్రభుత్వ పాలనతో  మహిళల పరిస్థితి ఏమిటి? తాలిబన్‌ పరిపాలించిన సమయంలోని పరిస్థితులనే మళ్లీ ఆ దేశ మహిళలు ఎదుర్కోవాల్సి వస్తోందనే భయం వ్యక్తమవుతోంది. 1996లో తాలిబన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు సంబంధించిన అనేక విషయాలపై నిషేధాలు విధించారు. 

ఇస్లాం చట్టం- షరియా పేరిట వారు ఈ నిషేధాలను చాలా కఠినంగా అమలుచేసేవారు. మహిళలకు సమాజంలో ఎటువంటి పాత్ర లేకుండా చేయటంలో వారు విజయం సాధించారు. తాలిబన్‌ అధికారంలో ఉన్న సమయంలో- కాబూల్‌లోని అపార్ట్‌మెంట్స్‌లోని మొదటి, రెండో ఫ్లోర్లకు ఎటువంటి కిటికీలు ఉండేవి కాదు. ఇంట్లోని మహిళలను బయటవారు చూడకూడదనే ఉద్దేశంతో అన్ని అపార్ట్‌మెంట్‌లకు కిటికీలు మూయించేశారు. మొత్తం పట్టణంతా తాలిబన్ల నిఘాలో ఉండేది. 


ఇదే విధంగా విద్య, వైద్య రంగాల్లో వారిని పూర్తిగా తొలగించారు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌లో ఈ రెండు రంగాల్లో మహిళలు గణనీయంగా ఉండేవారు. మహిళా విశ్వవిద్యాలయాన్ని మూసివేయటం, మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించటం.. అమ్మాయిల చదువులపై నిషేధం వల్ల 2001లో తాలిబన్‌ దేశం వదిలివెళ్లే సమయానికి - విద్యావంతులైన మహిళలు ఎవరూ లేకుండా పోయారు. ఈ రెండు రంగాల్లోనే కాకుండా- ఇతర రంగాలకు  సంబంధించి కూడా మహిళలపై అనేక నిషేధాజ్ఞలు ఉండేవి. ఆ సమయంలో మగతోడు లేకుండా మహిళలు బయటకు వెళ్లటానికి వీలుండేది కాదు. ఎవరైనా పొరపాటున కాళ్లు కనిపించేలా బట్టలు వేసుకొని బయటకు వస్తే వారిని కొరడా దెబ్బలు కొట్టేవారు. అక్రమ సంబంధం ఉందనే అనుమానం వస్తే- ఆ మహిళను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపేవారు. ఇక రాజకీయాలలోకి మహిళల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. తాలిబన్‌ ప్రభుత్వం పతనమయిన తర్వాత కూడా మహిళలు రాజకీయాల్లోకి రావటానికి తీవ్రంగా భయపడ్డారంటే- ఆ నాటి పరిస్థితులను ఊహించుకోవచ్చు. ఆ సమయంలో మహిళలపై జరిగే అత్యాచారాలకు సంబంధించిన నివేదికలు, కొన్ని వీడియోలు బయటకు రావటంతో మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళనలు చేపట్టాయి. కానీ అవేమి మహిళల పట్ల తాలిబన్‌ వైఖరిని మార్చలేకపోయాయి. తాజాగా అధికారంలోకి వచ్చిన తాలిబన్‌ మళ్లీ మహిళల పట్ల అంత కఠినమైన వైఖరి ప్రదర్శిస్తుందా? లేక కాలంతో పాటుగా ముందుకు కదలి.. వారిని కలుపుకొని అభివృద్ధి వైపు ప్రయాణిస్తుందా అనే విషయం వేచి చూడాలి.


పాకిస్తాన్‌కి పారిపోతా..

ఖుర్బా బెహ్రాజ్‌ అఫ్ఘాన్‌ జాతీయ సైనిక అధికారి.  వచ్చే తరాలను సరికొత్త ఆధునిక ప్రపంచంలోకి తీసుకెళ్లాలని కల కన్నది. ఇప్పుడు ఆమె కల చెదిరింది. 

ఆ రోజు ఉదయం ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లా. అక్కడంతా సహోద్యోగుల్లేరు. ఆఫీసులన్నీ ఖాళీ. రోడ్డు మీద పోలీసులు లేరు. అర్థంకాక  ఇంటికెళ్లిపోయా. జనాలెక్కడ చూసినా పరిగెత్తుతున్నారు. వారి కుటుంబాలకోసం వెతుక్కుంటున్నారు. అక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి. బ్యూటీ పార్లర్ల అద్దాలు పగిలిపోయాయి. మ్యూజిక్‌ షాప్‌ల్లోని పరికరాలన్నీ చిందరవందర. క్షణాల్లో రాజ్యాన్ని తాలిబన్లు ఆక్రమించారనే విషయం అర్థమైంది. భయం కమ్ముకుంది. 

చంపేస్తారేమోననే భయం..

‘కనపడితే మహిళా సైనికుల తలలు నరికేస్తార’ని కొందరు మాట్లాడుతున్నారు. కిడ్నాప్‌ చేయటం, జైల్లో బంధించడం, అత్యాచారం చేసి చంపేస్తారనే భయం వెంటాడుతోంది. తోటి మహిళా సైనికులు ఇదే భయంతో వణికిపోతున్నారు. నాకిద్దరు పిల్లలు. మా కుటుంబం, భవిష్యత్‌ ఏమవుతుందో తెలీదు. మా అన్న కూడా సైనికుడే. అతను గత వారం ఘనీ ప్రాంతంలో గాయపడ్డాడు. నాలుగేళ్ల కిందట ఇద్దరు మహిళా పోలీసుల తలల్ని తాలిబన్లు నరికేశారని. మిమ్మల్ని వదలరని మా అన్న చెప్పాడు. పెళ్లి పేరుతో అమ్మాయిల్ని, మహిళలను తాలిబన్లు తీసుకెళ్లి ఆత్యాచారం చేశాక చంపేస్తున్నారని కొందరు అంటున్నారు. 


అదే శరణ్యం...

ఇప్పుడు సైన్యంలో మహిళల సంఖ్య ఎక్కువే. 2014 సంవత్సరంలో నేను పని మీద ఉన్నప్పుడు కొందరు ఫోన్లు చేసేవారు. చంపేస్తామని బెదిరించేవారు. భయపడకపోవడంతో మా ఇళ్లు వాకిలి, ఇంట్లో వస్తువులు పగలగొట్టారు. ఇంటిని ధ్వంసం చేశారు. భయపడి కుటుంబంతో సహా కాబూల్‌కు పారిపోయా. అయితే అక్కడ ఏ ఉద్యోగం దొరక్క మళ్లీ వచ్చి మిలిటరీలో చేరా. ఇప్పుడు మాకు ఏ దారి లేదు. దొరికితే మా కుటుంబాల్ని నరికేస్తారు. పాస్‌పోర్టుల్లేవు. ఎలాగైనా సరే అక్రమంగా అయినా సరే సరిహద్దు దాటి పాకిస్తాన్‌ వెళ్లిపోతా.


నన్ను చంపడానికి వాళ్లు వస్తారు!

‘‘తాలిబన్లు నన్ను చంపడానికి వస్తారని ఇక్కడ కూర్చుని ఎదురుచూస్తున్నాను. నాకు, నా కుటుంబానికి సహాయం చేయడానికి ఎవరూ లేరు. నేను నా భర్తతో కలిసి ఎదురుచూస్తూ ఉన్నాను. వాళ్లు నన్ను, నాలాంటి ఎంతోమందిని చంపడానికి వస్తారని నాకు తెలుసు. నా కుటుంబాన్ని వదిలి నేను వెళ్లలేను. అయినా నేను ఎక్కడికి వెళతాను?’’ అఫ్ఘనిస్థాన్‌ మొదటి మహిళా మేయర్‌గా పనిచేసిన 29 ఏళ్ల జరీఫా గఫారీ అన్న మాటలివి. అప్ఘనిస్థాన్‌లో నెలకొని ఉన్న భయానక వాతావరణానికి ఆమె మాటలు అద్దం పడుతున్నాయి. జరీఫా గఫారీ 2018లో మొదటి మహిళా మేయర్‌గా ఎన్నికవ్వడం ద్వారా చరిత్ర సృష్టించారు. అంతేకాదు ఆమె 26 ఏళ్ల వయసులోనే మేయర్‌ బాధ్యతలు చేపట్టారు. 


అఫ్ఘనిస్థాన్‌ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని భయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మహిళలపై తాలిబన్లు చేసిన ఆరాచకాలు గుర్తుకు వచ్చి అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. 1996-2001 మధ్య కాలంలో బుర్ఖా లేకుండా మహిళలు బయటకు రావడాన్ని నిషేధించారు. మహిళలు పనిచేయడానికి లేదు. పాఠశాలకు వెళ్లడాన్ని అనుమతించలేదు. అమెరికా దళాలు అడుగుపెట్టిన తరువాతే పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. మహిళలు కొంత స్వేచ్ఛగా తమ పనులు చేసుకోగలిగారు. చదువుకోవడం మొదలుపెట్టారు. రకరకాల వృత్తుల్లో స్థిరపడటం ప్రారంభించారు.


 ఇప్పుడు తాలిబన్ల రాకతో పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని భయపడుతున్నారు. ఆ నేపథ్యంలోనే మొదటి మేయర్‌గా పనిచేసిన జరీఫా గఫారీ ‘‘నన్ను చంపడానికి వాళ్లు వస్తారు. నేను ఒక్కదాన్ని తప్పించుకున్నా దేశంలో ఉన్న లక్షల మంది జరీఫాల మాటేంటి? వాళ్ల కలలు ఏం కావాలి? స్వేచ్ఛగా బతికే అవకాశం వాళ్లకు లేకపోతే ఇలా? ఇవన్నీ నన్ను చాలా బాధిస్తున్నాయి’’ అని అన్నారు. గత ఏడాది మార్చిలో జరీఫా యూఎస్‌ స్టేట్‌ డిపార్టుమెంట్‌ నుంచి ‘ఇంటర్నేషనల్‌ వుమెన్‌ ఆఫ్‌ కరేజ్‌’ అవార్డును అందుకున్నారు. బిబిసి 2019లో విడుదల చేసిన ప్రపంచంలో ప్రభావవంతమైన మహిళల జాబితాలో జరీఫా పేరుంది. ఆమె చండీఘడ్‌లోని పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.