లక్ష్యం బారెడు.. నిధులు మూరెడు

ABN , First Publish Date - 2021-01-24T05:46:08+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన లోయర్‌ పెన్‌గంగా ప్రాజెక్టు పనులు అనుకున్నంతగా ముందుకు సాగడం లేదు. మహారాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న లోయర్‌ పెన్‌గంగా ప్రాజెక్టు పనులకు నిధుల కొరతతో అడుగడుగునా ఆటంకాలే ఏర్పడుతున్నాయి.

లక్ష్యం బారెడు.. నిధులు మూరెడు
పెన్‌గంగా నదిపై నిర్మాణ దశలో కనిపిస్తున్న కోర్టా-చనకా బ్యారేజ్‌

కోర్టా-చనకా బ్యారేజి నిర్మాణానికి నిధుల కటకట

పెండింగ్‌లో రూ.160 కోట్ల బిల్లులు

అర్ధాంతరంగా నిలిచిన భూసేకరణ

4 సంవత్సరాలు గడిచినా నత్తనడకన పనులు

ఈ యేడు ఆయకట్టు పరిధిలో పంటపొలాలకు సాగునీరు అనుమానమే!!

ఆదిలాబాద్‌, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన లోయర్‌ పెన్‌గంగా ప్రాజెక్టు పనులు అనుకున్నంతగా ముందుకు సాగడం లేదు. మహారాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న లోయర్‌ పెన్‌గంగా ప్రాజెక్టు పనులకు నిధుల కొరతతో అడుగడుగునా ఆటంకాలే ఏర్పడుతున్నాయి. గత నాలుగేళ్ల క్రితం 2016 డిసెంబర్‌లో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో లోయర్‌ పెన్‌గంగా ప్రాజెక్టు పనులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ బ్యారేజి నిర్మాణం పూర్తి చేసి ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాల్లోని 51వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే లక్ష్యంతో పనులను ప్రారంభించారు. మొదటి నుంచి నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేయడంతో లక్ష్యం బారెడు.. నిధులు మూరెడు అన్న చందంగా మారింది. గడువులోగా పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు నాలుగు సార్లు గడువు సమయాన్ని పొడగించారు. ఒకటి, రెండు సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కోర్టా-చనకా బ్యారేజిని సందర్శించి పనుల్లో మరింత వేగం పెంచాలని సంబంధిత అధికారులతో పాటు కాంట్రాక్ట్‌ కంపెనీలను హెచ్చరించారు. అయితే కాంట్రాక్ట్‌ కంపెనీలకు చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు సకాలంలో అందకపోవడంతో పనులు చేయలేమంటూ చేతులెత్తెస్తున్నారు. దాదాపుగా 0.281 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజి నిర్మాణం పనులు పూర్తి దశకు చేరుకున్నా.. ప్రధాన కాల్వతో పాటు ఉపకాలువల పనులు పూర్తిగా నిలిచి పోయాయి. దీంతో అధికారులు హడావిడి చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా నేరడిగొండ మండలం కుప్టి గ్రామం వద్ద కుప్టి ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాగా పేరున్న జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పెండింగ్‌లో రూ.160 కోట్లు

లోయర్‌ పెన్‌గంగా ప్రాజెక్టు కింద చేపడుతున్న కోర్టా-చనకా బ్యారేజి, హత్తిఘాట్‌, సాగునీటి కాల్వల నిర్మాణ పనులకు చెల్లించాల్సిన రూ.160 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 2018 జూన్‌ నుంచి ప్రభుత్వం ఎలాంటి నిధులను విడుదల చేయక పోవడంతో పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కాంట్రాక్టర్లు పెండింగ్‌  బిల్లుల కోసం నెలల తరబడి హైదరాబాద్‌లోనే మకాం వేసి ప్రయత్నాలు చేసినా.. నయా పైసా కూడా చేతికి రావడం లేదంటున్నారు. తమకున్న రాజకీయ, ఆర్థిక పరపతితో ప్రయత్నాలు చేస్తున్నా.. బిల్లులు విడుదల కాకపోవడంతో విసిగి పోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో మూడేళ్లయిన ఆయకట్టుకు సాగునీరు అందించడం గగనమేనంటున్నారు.

అడుగు ముందుకు పడని భూసేకరణ

లోయర్‌ పెన్‌గంగా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సాగునీటి కాలువలకు అవసరమైన భూసేకరణ అడుగు ముందుకు పడినట్లు కనిపించడం లేదు. గత మూడేళ్లుగా భూసేకరణ కోసం నిధులను ప్రభుత్వం విడుదల చేయడం లేదు. ఇప్పటి వరకు రూ.40 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. ప్రధాన కాల్వలతో పాటు ఉపకాల్వల నిర్మాణానికి 3,200 ఎకరాల భూసేకరణ కోసం అధికారులు అంచనాలు వేశారు. ఇప్పటి వరకు 1500 ఎకరాలను సేకరించారు. మరో 1800 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. దీంతో డీ-14, 15, 16వ ఉప కాలువల నిర్మాణ పనులు నిలిచి పోవడంతో పాటు డీ-17, 18, 19వ ఉప కాలువల పనులను ఇంకా ప్రారంభించనే లేదు. గత మూడేళ్లుగా పరిహారం కోసం రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు.

భూసేకరణకు నిధులు రావాల్సి ఉంది

: శ్రీనివా్‌సరెడ్డి, లోయర్‌ పెన్‌గంగా చీఫ్‌ ఇంజినీర్‌, ఆదిలాబాద్‌

కోర్టా-చనకా బ్యారేజి ద్వారా నీటిని సరఫరా చేసే కాలువల భూసేకరణకు సంబంధించిన నిధులు విడుదల కావాల్సి ఉంది. నిధుల విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నాం. బిల్లుల చెల్లింపులు నిలిచి పోయినా.. పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వచ్చే వానాకాలం లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నాం. కనీసం 600 ఎకరాల భూసేకరణకు నిధులు విడుదల చేసి, దాదాపు 20వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే అవకాశం ఉంది.

Updated Date - 2021-01-24T05:46:08+05:30 IST