దృక్పథాల్ని బోధించిన ఉపాధ్యాయుడు

ABN , First Publish Date - 2021-04-01T05:47:52+05:30 IST

ప్రసిద్ధ సమాజ శాస్త్ర ఆచార్యుడు, ప్రజాస్వామ్య సోషలిస్టు భావజాలకుడు, నిరంతర అధ్యయనశీలి, విద్యార్థి దశ నుంచీ పలు సిద్ధాంతాలను అధ్యయనం...

దృక్పథాల్ని బోధించిన ఉపాధ్యాయుడు

నివాళి : ప్రొ. జె.వి.రాఘవేంద్రరావు (1.6.1939–16.3.2021)

ప్రసిద్ధ సమాజ శాస్త్ర ఆచార్యుడు, ప్రజాస్వామ్య సోషలిస్టు భావజాలకుడు, నిరంతర అధ్యయనశీలి, విద్యార్థి దశ నుంచీ పలు సిద్ధాంతాలను అధ్యయనం చేసి వాక్పటిమతో అకడమిక్‌ రంగంలో నిష్ణాతుల ప్రశంసలందుకున్న మహా మేధావి, వరంగల్‌ ముద్దుబిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో ఆచార్యులు ప్రొఫెసర్‌ జె. వి. రాఘవేంద్ర రావు ఇక లేరు. జూన్‌ 1, 1939న హన్మకొండలో జన్మించిన రాఘవేంద్ర రావు సారు విద్యార్థి దశ నుంచే ఉపన్యాసాల ద్వారా విద్యార్థి సంఘాల, ఉపాధ్యాయుల గుర్తింపు పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేషన్‌ విద్యార్థిగా పలు విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించి, ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థి యూనియన్‌ జనరల్‌ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీని వీడిన తర్వాత నాగ్‌పూర్‌ యూనివర్సిటీలో ఎం.ఎ. సోషియాలజీ, లక్నో యూనివర్సిటీలో ఎం.ఎం. పొలిటికల్‌ సైన్స్‌ పట్టాలను పుచ్చుకొని నాటి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ లక్ష్మన్న సూపర్‌విజన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్‌.డి. పొందారు. 


లక్నో యూనివర్సిటీలో చదువుతున్న రోజులలో నాటి ప్రజాస్వామ్య సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్‌ లోహియా సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. లోహియా భావజాలాన్ని జీవితాంతం ఆచరించి, నిరాడంబరంగా జీవించారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్టుమెంటు ఆచార్యులుగా 1970లో చేరి, నాటి సోషలిస్టు భావజాల ప్రముఖులైన భద్రి విశాల్‌పిట్టి, ప్రొ. కేశవరావు జాదవ్‌, ప్రొ. తిప్పారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, డా. వెలిచాల కొండలరావు, జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి, బాబురావు, గోపాల్‌ సింగ్‌, కె.ప్రతాప రెడ్డి, రావెల సోమయ్య, రావెల అరుణ, పటోళ్ళ ఇంద్రారెడ్డి మొదలగువారితో మమేకమై సమైక్యాంధ్రలో సోషలిస్టు భావజాలవ్యాప్తికి కృషి చేశారు. ఇదే క్రమంలో 1969 తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్‌ కేంద్రంగా యాక్షన్‌ కమిటీ చైర్మన్‌గా నాటి ముఖ్య నాయకులైన ముచ్చర్ల సత్యనారాయణ, డా.చిరంజీవి మొదలగు వారితో కలిసి ఉద్యమ నిర్మాణంలో చురుకుగా పాల్గొన్నారు.


జె.వి.ఆర్‌. కెనడా, యుఎస్‌ఎ, జర్మనీ మొదలగు దేశాల్లో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా పర్యటించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి పుస్తక ప్రచురణలు కూడా చేశారు. పాపులేషన్‌ శాస్త్రములో పిహెచ్‌.డి. పట్టా పొందారు. ‘హైదరాబాదులో ప్రాస్టిట్యూషన్‌’ అనే పరిశోధనాత్మకమైన పుస్తకం ప్రచురించారు. ఇవేగాక తెలుగు మీడియం విద్యార్థుల సౌలభ్యం కోసం కఠిన సమాజ శాస్త్ర విభాగాలపై సులభరీతిలో పుస్తకాలు రచించారు. సమకాలీన సమస్యలపై వ్యాసాలు రాసి ప్రచురించారు. 1970 నుంచి నేటి వరకు ఆరు దశాబ్దాల విద్యార్థులను, అధ్యాపకులను ప్రభావితం చేసారు. రాయడం, చదవడమే ఊపిరిగా, దినచర్యగా జీవించారు. వృత్తిపరమైన పుస్తకాలు, వ్యాస రచనలతోపాటు లోహియా, గాంధీ, అంబేడ్కర్, కార్ల్ మార్క్స్ మొదలగు తాత్వికులపై అనర్గళంగా ఉపన్యసించేవారు. దేశవ్యాప్త ఉద్యమాలను అధ్యయనం చేసి బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చేవారు. అంబేడ్కర్ తాత్వికత, రిజర్వేషన్స్‌, ప్రజా సమస్యలపై అధ్యయనం నిరంతరం కొనసాగించారు. 


అన్ని ఫ్యాకల్టీల విద్యార్థులతో, మేధావులతో, ఆచార్యులతో సంపర్కం కొనసాగించినప్పటికినీ ఎవ్వరినీ ఎప్పుడూ ఏ విధమైన సహాయ సహకారాలను కోరేవారు కాదు. నేను తాత్కాలిక ఆచార్యునిగా కష్ట కాలంలో ఉన్నప్పుడు ఆదరించారు. వారి సహాయం జీవితాంతం మరువలేనిది. దాదాపు 40 ఏండ్ల వయస్సు వరకు బ్రహచర్య జీవితం గడిపి, గ్రామీణ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడమేగాక, ఆర్థిక సహాయం కూడా చేసేవారు. తరువాత తన విద్యార్థి దశలో పరిచయమున్న ప్రొఫెసర్‌ పద్మావతిని వివాహమాడారు. ఒకరికొకరు ఊపిరిగా జీవిస్తూ తమ అభిమానులు ఎప్పుడు సందర్శించినా సంతోషంగా ఆహ్వానిస్తూ, క్షేమ సమాచారాలను తెలుసుకునేవారు. 


జె.వి.ఆర్‌. ప్రతిభకు గుర్తింపుగా నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘బెస్ట్‌ టీచర్‌’ అవార్డును ప్రదానం చేసింది. తనను ఎవరు విమర్శించినా, బాధపెట్టినా పట్టించుకోకుండా స్వేచ్ఛగా జీవించి, స్వేచ్ఛను బోధించారు. ఏ ఉపాధ్యాయుడైనా బోధించడమే కాదు, సమాజ ప్రగతికి దోహదపడే తాత్విక దృక్పథాన్ని కలిగించాలన్నదే ఆయన జీవిత సందేశం. గత 50 ఏండ్లుగా ప్రగతివాద సోషలిస్టు భావజాలం కలిగిన అందరినీ ప్రభావితం చేసిన మహా మేధావి, ఆచార్య రాఘవేంద్ర రావుగారు.

గట్టు సత్యనారాయణ

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషియాలజీ

Updated Date - 2021-04-01T05:47:52+05:30 IST