ఆ నిబంధనపై ఉపాధ్యాయులు మండిపాటు

ABN , First Publish Date - 2022-08-16T20:49:06+05:30 IST

నిమిషం ఆలస్యమైనా ఆబ్సెంట్‌ నిబంధనపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తమ విషయంలో రోజుకో రూల్‌ తెస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఆ నిబంధనపై ఉపాధ్యాయులు మండిపాటు

రాజాం, విజయనగరం, ఆగస్టు 15: నిమిషం ఆలస్యమైనా ఆబ్సెంట్‌ నిబంధనపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తమ విషయంలో రోజుకో రూల్‌ తెస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. గతంలో ఉపాధ్యా యులు, బోధనేతర సిబ్బందికి బయోమెట్రిక్‌ ఐరిస్‌ హాజరు విధానం ఉండేది. కరోనా వల్ల అది నిలిచిపోయింది. ఇప్పుడు దీని స్థానంలో పాఠశాల విద్యాశాఖ ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు) విధానా న్ని తీసుకుని వచ్చింది ఇందుకోసం సిమ్స్‌ ఏపీ అనే మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఉపాధ్యాయులు, సిబ్బంది తమ మొబైల్‌ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని లాగిన్‌ అవ్వాలి. పాఠశాలకు ఉదయం 9లోపు చేరుకుని తమ ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఒక నిమిషం ఆలస్యమైనా హాజరును యాప్‌ అంగీకరించదు. ఆ రోజు సెలవు పెట్టుకోవాల్సి ఉంటుంది. పాఠశాల ఆవరణలోకి వస్తేనే యాప్‌ హాజరు తీసుకుంటుంది. బయట ఉన్నా తీసుకోదు.


వెనక్కు తీసుకోకపోతే ఉద్యమిస్తాం

ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం రోజుకొక నిబంధన తెస్తోంది. పాఠశాలకు నిమిషం ఆలస్యం అయినా అబ్చెంట్‌ వేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం వాస్తవమే అయితే ఈ యాప్‌ డౌన్‌లోడు చేయవద్దని ఫ్యాప్టో నాయకులు సూచించారు. ఈవిషయం ఉపాధ్యాయులందనికీ తెలియజేశాం. ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేపడతాం.

    - మజ్జి మదన్‌మోహన్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా నాయకుడు, రాజాం


ప్రభుత్వం ఆదేశాలు జారీ

ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు విషయంలో నిమిషం ఆలస్యమైనా ఆబ్సెంట్‌ వేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన మంగళవారం నుంచే అమలు చేస్తాం. ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటాం.      

  - ఎంవీ ప్రసాదరావు, ఎంఈవో, రాజాం

Updated Date - 2022-08-16T20:49:06+05:30 IST