రణన్నినాదం నాటి రంగస్థలం!

Published: Mon, 15 Aug 2022 00:07:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రణన్నినాదం నాటి రంగస్థలం!

ఎవ్వని శాంతమూర్తియని యెల్లరనారతమున్‌ భజింతురో యెవ్వడధర్మమార్గమున నించుకయేనియు కాలుబెట్టడో యెవ్వడు లోకమంతట నహింసయె యుత్తమమంచు జాటెనో అవ్వరమూర్తి గాంధి ఋషి కంజలి మోడ్చి నమస్కరించెదన్‌.


- సత్యాహింసల శాంతి మార్గంలో కోట్లాదిమంది భార తీయుల్ని ముందుకు నడిపించి, రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని మన దేశం నుండి తరిమి వేసిన మహాత్మా గాంధీజీ ప్రధాన పాత్రగా దామరాజు పుండరీకాక్షుడు రచించిన ‘గాంధీవిజయం’ నాటకంలోని, నాంది పద్యం ఇది. 


స్వాతంత్య్ర పోరాటం మన దేశ చరిత్రలో గొప్ప ఉద్యమం. లక్షలాదిమంది వీరుల బలిదానంతో, ఆత్మార్పణతో, నిండిన స్వాత్రంత్య్ర సమరమది. దాదాపుగా రెండు వందలేళ్లు సాగిన ఈ పోరాటం, గాంధీ మహాత్ముడి ప్రవేశంతో కొత్త బాట పట్టింది. ఆయన నాయకత్వంలో కోట్లాదిమంది భారతీ యులు, హృదయపూ ర్వకంగా భాగస్వాములయ్యారు. చిత్త శుద్ధితో పోరాటంలో పాల్గొన్నారు. అడుగడుగునా అహింసా మార్గంలోనే సాగి చరితార్థులయ్యారు. 


బానిసత్వంలో కుములుతున్న భారతీయుల్లో స్వాతంత్య్ర వాంఛని ప్రజ్వరిల్ల చేయడంలో సాహిత్యం, కళలు ఎంతో కృషి చేశాయి. అందులోనూ, నాటకం చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. అన్ని భాషలతోపాటుగా తెలుగు భాష లోనూ స్వాతంత్ర్యోద్యమ నేపథ్యంలో ఎన్నో గొప్ప నాటకాలు వెలువడ్డాయి. కొన్ని ప్రత్యక్షంగా స్వాతంత్య్ర కథని చెబుతే, మరికొన్ని పరోక్షంగా స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించాయి. 


స్వాతంత్ర్యోద్యమంలో తెలుగు నాటకాన్ని శక్తివంతంగా ప్రయోగించిన రచయితల్లో ఎన్నతగిన వ్యక్తి దామరాజు పుండరీకాక్షుడు. దామరాజు పుండరీకాక్షుడు గొప్ప దేశ భక్తుడు. మహాత్ముడి మారా ్గన్ని త్రికరణశుద్ధిగా విశ్వసించి, మహాత్ముడి శాంతిమార్గాన్ని ప్రజలకు వెల్లడిచేసే ప్రయ త్నంలో ఆయన రచించిన నాటకాలు ఘన విజయం సాధిం చాయి. 1896వ సంవత్సరం జులై 6వ తేదీన గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం, పాటిబండ్ల గ్రామంలో జన్మించిన పుండరీకాక్షుడు ఇరవై రెండవ ఏటనే అద్భుత మైన నాటకం రచించాడు. అదే ‘గాంధీ విజయం’. దేశ మంతా సహాయ నిరాకరణ ఉద్యమం ఉవ్వెత్తున సాగు తున్న కాలంలో, బ్రిటిష్‌ ప్రభుత్వ దుర్మార్గాన్ని ఖండిస్తూ నాటకం రాయడం నిజంగా అద్భుతం. అందునా ఆనాటి సామాజిక జీవితంలో ఉన్న పాత్రల్నే యథార్థమైన పాత్ర లుగా నాటకంలో ప్రవేశపెట్టడానికి ఎంత ధైర్యం ఉండాలి! 


భారత స్వాతంత్య్ర పోరాటంలోని పాత్రలన్నీ యథాత థంగా ‘గాంధీ విజయం’ నాటకంలో దర్శనమిసా ్తయి. మహాత్మాగాంధీ, అరవింద ఘోష్‌, షౌకత్‌ అలీ, లాలాలజపతిరాయ్‌, బిపిన్‌ చంద్రపాల్‌, చిత్త రంజన్‌ దాస్‌, అనిబిసెంట్‌ వంటి వారందరూ ఈ నాటకంలో పాత్రలు. ఇరవై రెండు పురుష పాత్రలు, రెండు స్త్రీ పాత్రలతో నాటకం నడు స్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే, ఆనాడు సాగుతున్న స్వరాజ్య పోరాటానికి ఈ నాటకం ప్రత్యక్ష వ్యాఖ్యానం లాంటిది. కలకత్తా కాంగ్రెస్‌, నాగపూర్‌ కాంగ్రెస్‌ మహాసభలు, ఆ సభల్లో తీర్మానించిన సహాయ నిరాకరణ ఉద్యమం, మహా నాయకుల ఉపన్యాసాలు, ఈ నాటకం లోని ప్రధాన కథాంశాలు.


నాటక సంప్రదాయాన్ని అనుసరించి, గాంధీ విజయం నాటకం నాందితో మొదలవుతుంది. ఇష్టదేవతా ప్రార్థనతో సాగే నాందిలో రెండు పద్యాలున్నాయి. అవి రెండూ మహాత్ముడిని కీర్తించే ఆణిముత్యాల్లాంటి పద్యాలు. ‘‘ఎవ్వని శాంతమూర్తి యని’’ అన్న తొలి పద్యంలో మహాత్ముడి శాంతి, ధర్మం, అహింసల గురించి పేర్కొంటే, రెండో పద్యంలో గాంధీజీ వ్యక్తిత్వాన్ని వినూత్నమైన రీతిలో గొప్పగా వివరించారు పుండరీకాక్షుడు. 


కత్తులు లేవు, శూలమును గాండీవమున్‌ మొదలే హుళక్కి నోరెత్తి ప్రచండ వాక్పటిమ నేనియు జాటడు, వైరి మీద దండెత్తగ సేన లేదు, బలహీనము కాయము, కోప తాపముల్‌బొత్తిగ సున్న, అట్టి ఘనమూర్తి మనో బలశాలి గాంధి జేయెత్తి నమస్కరించి స్మరియించెదె నెప్డు స్వరాజ్యసిద్ధికిన్‌


- ఈ రెండు పద్యాలూ, ఆ రోజుల్లో నోటికి రాని తెలుగు వాడు లేడు. పద్యాలతోపాటు, ఈ నాటకంలో గీతాలు కూడా ప్రజల్ని ఎంతగానో చైతన్యవంతం చేశాయి. ఐదు అంకాల ఈ గాంధీ విజయం నాటకంలో రెండవ అంకంలోని ఈ గీతం జాతీయతా ప్రబోధంలో అగ్రస్థానంలో నిలబడింది:

మేలుకొనుమీ భరతపుత్రుడ

మేలుకొనుమీ సుజనమిత్రుడ

మేలుకొనుమీ సచ్చరిత్రుడ

మేలుకొనుమయ్య- వత్సా ్ఢ్ఢమేల్ఢ్ఢు

ఒక్క ప్రాణమె యందరిది మా

దొక్క మనసే యందరిది, మే

మొక్క మార్గమె దొక్కగలమని నొక్కి వక్కాణింప వడిగా మేలుకో ్ఢ్ఢవత్సా మేలుక్ఢ్ఢో


- భూపాళ రాగం, చంపుతాళంలో వినబడే ఈ గీతం పాడని సభలేని రోజులవి. ప్రతి ఊరేగింపు లోనూ ఈ గీతం వినపడాల్సిందే! కళాకారులు, హరికథకులు, గాయకులు, అన్న సంతర్పణా లలో నిర్వాహకులు అందరూ ఈ ప్రబోధ గీతాన్ని పాడే వారు. విడిగా గానం చేస్తే, బ్రిటిష్‌ ప్రభుత్వం దండిస్తుంది కనుక, అన్న సంతర్పణంలో అన్నపూర్ణాష్టకంతో కలిపి గానం చేసేవారు. చివరికి ఇల్లిల్లూ తిరిగి భిక్షాటన చేసే భిక్షకులు కూడా ఎంతో మధురంగా ఈ గీతాన్ని, నాందీ పద్యాల్ని గానం చేసేవారు. గడపదాటి బయటకు రాకూడ దని, స్త్రీల స్వేచ్ఛకు అడ్డుకట్ట వేసిన ఆనాటి సామాజిక జీవితంలో స్త్రీలను స్వరాజ్య పోరాట దిశగా నడిపించింది ఈ ‘గాంధీ విజయం’. 


బ్రిటిష్‌ ప్రభుత్వం 18-10-1921న, ప్రభుత్వ ఉత్తర్వు 435/2 తో ఈ నాటకాన్ని నిషేధించింది. ఈ నిషేధాన్ని ఎదిరించి కూడా, ఈ నాటకాన్ని ధైర్యంగా ప్రదర్శించారు. కాకినాడలో ప్రదర్శించేటప్పుడు నాటకశాలకు తాళం వేసింది ప్రభుత్వం. విశాఖపట్నంలో కళాకారులందర్నీ నిర్బంధించి జైలుకు తరలించారు. అయితే జైలు గదులు ఖాళీ లేక అందర్నీ ఒక హోటల్లో ఉంచారు. అప్పుడు కళాకారు లందరూ ఆ జైలు గోడల మధ్యనే ఈ నాటకాన్ని తెల్ల వార్లూ ప్రదర్శించారు. జైలులోని బంధీలంతా ఎంతగానో ఉత్తేజితులయ్యారు. ఇన్ని కష్టాల నెదుర్కొని వేరే వ్యక్తులు ప్రదర్శించడానికి భయపడతారు కనుక, పుండరీకాక్షుడే స్వయంగా ‘సంఘ సేవా నాట్యమండలి’ స్థాపించి నాట కాల్ని ధైర్యంగా ప్రదర్శించాడు. 


జలియన్‌వాలాబాగ్‌ మారణకాండ జరిగిన తర్వాత దామరాజు పుండరీకాక్షుడు స్వయంగా జలియన్‌వాలాబాగ్‌ వెళ్లి ఆ దారుణం జరిగిన చోట నమస్కరించి ఒక గొప్ప నాటకం రచించాడు. అదే ‘పంజాబు దురం తాలు’ లేదా ‘పాంచాల పరాభవం’. ఆ నాటకానికి బ్రిటిష్‌ ప్రభుత్వం ఎంత భయపడిందంటే ఒక్క ప్రతిని కూడా మిగల్చకుండా అన్నిటినీ తగులబెట్టింది. ఒక్క ప్రతి మాత్రం బ్రిటిష్‌ ప్రభుత్వానికి చిక్కకుండా మిగిలిపోయింది. స్వాతంత్య్రం వచ్చాక అది ఇండియా డిజిటల్‌ లైబ్రరీలో దొరికింది. భరతమాతను, గాంధీజీని, శ్రీకృష్ణుడినీ, శ్రీరాముడినీ పాత్రలుగా చేసి పుండరీకాక్షుడు రచించిన ‘గాంధీ మహోదయం’ అనే నాటకాన్నీ బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది. ఈ నాటక రచనకు దామరాజు పుండరీకాక్షుడికి ద్వీపాంతర శిక్ష వేయాలనుకొంది బ్రిటిష్‌ ప్రభుత్వం. కానీ ఎందుకో జైలుశిక్షతో సరిపెట్టింది. పోలీసుల లాఠీఛార్జిలో తీవ్రంగా గాయపడిన పుండరీకాక్షుడి ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ఆ కష్టంతోనే చివరకు ఆయన మరణించారు. 


అదే కాలానికి చెందిన మరొక గొప్ప నాటక కర్త ఇచ్ఛాపురపు యజ్ఞ నారాయణ. వారి నాటకాల్లో స్వాతం త్ర్యోద్యమ ప్రేరణతో రాసినవి ‘రసపుత్ర విజయం’, ‘రాణా ప్రతాప్‌ సింగ్‌’. ఒక నాటకంలో భారత మాతను, మరో నాటకంలో ఆంధ్రమాతను ప్రస్తుతించారు. ‘శ్రీరసపుత్ర విజయం’ నాటకం 1924లో ప్రచురితమైంది. రచయిత నిషేధానికి గురికాకుండా జాగ్రత్తపడుతూ తొలి పద్యంలో బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని కీర్తించారు. తర్వాత నాటకాన్ని ధైర్యంగా నడిపించారు. దేశభక్తిపూరితమైన ఈ నాటకం పైకి రాజ పుత్రుల కథలా నడుస్తూనే, అంతర్లీనంగా బ్రిటిష్‌ ప్రభు త్వంపై గాంధీ నాయకత్వంలో సాగుతున్న అహింసా యుత స్వాతంత్య్ర సమర గాథను స్ఫురింపజేస్తుంది. ఈ అంశాన్ని తెలుగు ప్రేక్షకులు అర్థం చేసుకొన్నారు. యజ్ఞనారాయణ రచించిన మరో నాటకం ‘రాణా ప్రతాప్‌ సింగ్‌’. చిత్తూరు ప్రభువు రాణా ప్రతాప్‌ సింగ్‌ వీరత్వాన్ని, దేశాభిమానాన్ని గొప్పగా ప్రతిబింబించిన నాటకం ఇది. నాటకం ఆదిలో ఆంధ్ర మాతను కీర్తిస్తూ, రచయిత చెప్పిన పద్యం చాలా ప్రజాదరణ పొందింది. భరత మాతను కీర్తిస్తూ ‘అలహిమాద్రియు వింధ్యమారా వళియు’ అని సాగే పద్యం కంఠతా పట్టడమే కర్తవ్యంగా భావిం చిన విశిష్టమైన సందర్భం ఆనాటిది. 


మహాత్మాగాంధీని దర్శించి, ఆయన ఆశీస్సులు అందుకొని ‘శ్రీమహాత్మాగాంధీ’ నాటకం రచించిన కొత్లాపురం మఠం రాచయ్య ఎంతో అదృష్టవంతులు. నేటి తెలంగాణలోని నవాబ్‌పేట మండలం ఇప్పటూరు గ్రామంలో 1900 సంవ త్సరంలో జన్మించారు రాచయ్య. ఆయనకు బాల్యం నుంచే గాంధీపై గొప్ప భక్తివిశ్వాసాలు ఉండేవి. ఒకసారి గాంధీజీ గుంటూరు వస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లి మహాత్ముని కలవాలనుకున్నారు. కానీ ప్రభుత్వం రైళ్లన్నీ ఆపించివే సింది. అయినా రాచయ్య నిరుత్సాహ పడలేదు. తనకు ఇష్టులైన కొందరు మిత్రుల్ని కలుపుకొని, మహబూబ్‌నగర్‌ నుండి గుంటూరు వరకూ కాలినడకనే ప్రయాణం చేసి గాంధీజీని చూశారు. ఉపన్యాసం పూర్తయ్యాక మహాత్ముని ముందుకు వెళ్లి నమస్కరించి పరిచయం చేసుకున్నారు. అప్పుడు గాంధీ ఆయన్ను దగ్గరకు తీసుకొని ‘‘అసత్య మాడ కూడదు’’ అని ఉపదేశించారట. రాచయ్య గ్రామం తిరిగి వచ్చేక ‘శ్రీమహాత్మాగాంధీ’ నాటకాన్ని రాశారు. ఆ నాటకాన్ని ఆ రోజుల్లో వంద ప్రదర్శనలు చేశారట. ఆ గ్రామస్థులే నాటకంలో ప్రాత్రధారులై గాంధీని మనసారా అర్చించారు. గ్రామీణ తెలంగాణలో గాంధీ సందేశాన్ని వ్యాప్తి చేసిన కొత్లాపురం రాచయ్య ధన్యులు. 


స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మాగాంధీ అనుచరుడైన ఉన్నవ లక్ష్మీనారాయణ 1921 జులై నెలలో పల్నాటి పుల్లరి సత్యాగ్రహ సందర్భంగా అరెస్ట్‌ అయ్యారు. ఆ జైలు శిక్షను అనుభవిస్తూ ఆయన ‘నాయకురాలు’ నాటకం రాశారు. పల్నాటి పుల్లరి సత్యాగ్రహాన్ని ఆ నాటకంలో ఎంతో హృద్యంగా ఇమిడ్చారు. 


స్వాతంత్ర్యోద్యమ కథతో నేరుగా స్పృశించకపోయినా, అదే భావాన్ని అంతర్లీనంగా ఇముడ్చుకొన్న నాటకాలు మరి కొన్ని కనిపిస్తాయి. చింతాదీక్షితులు తన ‘జటాయువు’ నాటకంలో దుర్మార్గానికి ఎదురుతిరుగుతున్న ఓ పక్షిని చూపిస్తాడు. రావణుడి దౌష్ట్యాన్ని ఖండించిన జటా యువు, భారత సమరవీరులకు ప్రతీకగా, రావణుడు చెరబట్టిన సీతమ్మ ఆవేదన భరత మాత ఆవేదనలా అనిపిస్తుంది. బ్రిటిష్‌ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభు త్వాన్ని ప్రత్యక్షంగా విమర్శించడం సాధ్యం కాదు గనుక పరోక్షంగా చేసిన ప్రయత్నం ఇది. 


అలాగే బోయి భీమన్న ‘పాలేరు’ నాటకం, సుంకర వాసిరెడ్డి రచించిన ‘మా భూమి’ నాటకంలోని భావ జాలాలు స్వాతంత్ర్యోద్యమ వేదిక నుంచి ఆవిర్భవించినవే. శ్రీపాద కృష్ణమూర్తి రాసిన వీరరస ప్రధానమైన ‘బొబ్బిలి యుద్ధం’ నాటకం తెలుగువారిలో స్వాతంత్య్ర స్ఫూర్తిని బలంగా రగిలించింది. ఆయనే 1921లో రచించిన ‘తిలకు మహరాజ నాటకం’ దేశభక్తుడైన బాలగంగాధర తిలక్‌కు అసలైన నివాళి. వీరు రాసిన ‘గాంధీ విజయ ధ్వజం’, ‘స్వరాజ్యోదయం’ నాటకాలు భారత స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని చక్కగా ప్రతిఫలించాయి. చిలకమర్తి లక్ష్మీనర సింహం, తిరుపతి వెంకట కవులూ వారి నాటకాలలో రూపుదిద్దిన పౌరాణిక కథానాయకుల పాత్రలు స్వరాజ్య పోరాట చరిత్రలోని మహావీరుల వంటివే. 

రణన్నినాదం నాటి రంగస్థలం!

స్వాతంత్ర్యోద్యమ నేపథ్యంలో తెలుగులో వచ్చిన నాటకా లను పేర్కొన్నప్పుడు- రామచంద్రుని వెంకటప్ప రాసిన ‘చిచ్చరపిగుడు’ను తప్పనిసరిగా పేర్కోవాలి. 1857లో ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటంలో దేశం కోసం ఉరికంబమెక్కిన మంగల్‌ పాండే కథని ఈ నాటికగా మలిచారు. దీన్ని 1929 మే 7వ తేదీన కాంగ్రెస్‌ పత్రికలో ప్రకటించారు. విశేషమైన స్పందన లభించడంతో బ్రిటిష్‌ ప్రభుత్వం భయపడింది. అయితే కాంగ్రెస్‌ పత్రికలో రచ యిత పేరు లేదు. అందువల్ల సంపాదకుడైన అన్నపూర్ణ య్యను పిలిచి ఇది ఎవరు రాశారో చెప్పమని బలవంతం చేశారు. ఆయన పేరు చెప్పలేదు. దాని ఫలితంగా అన్న పూర్ణయ్యను అరెస్టు చేసి 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 500రూపాయల జరిమానా విధించింది ప్రభుత్వం. వెల్లూరు, మద్రాసు, కన్ననూర్‌ జైళ్లలో ఆయన శిక్షాకాలం గడిచింది. ఇదే కాలంలో అనేక పౌరాణిక, చారిత్రక నాట కాల్లో అంతర్లీనంగా స్వాతంత్ర్యోదమ ఇతివృత్తాన్ని ఇమిడ్చి రాసిన అనేక నాటకాలు వచ్చాయి. 


ఇలా భారత స్వాతంత్ర్యోద్యమంలో తెలుగు నాటకం చిరస్మరణీయమైన పాత్రని పోషించింది. బ్రిటిష్‌ ప్రభుత్వ దౌర్జన్యాన్ని, అధికార మదాన్ని ఎదిరించి, జైలు శిక్షలకు వెరవకుండా తెలుగు నాటక రచయితలు, స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని జాతికి పంచారు.

వాడ్రేవు సుందర్రావు

93964 73287


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.