నేటి నుంచి మూడో విడత వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-03-01T06:16:22+05:30 IST

జిల్లాలో మూడో విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సోమవారం ప్రారంభం కానున్నది. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు మార్చి ఒకటో తేదీ నుంచి టీకాలు వేస్తారు.

నేటి నుంచి మూడో విడత వ్యాక్సిన్‌

60 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్‌ టీకా

45 ఏళ్లుదాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు కూడా..

జిల్లాలో 187 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు

లక్ష డోసులు సిద్ధం చేసిన ఆరోగ్య శాఖ అధికారులు

యాప్‌, వెబ్‌సైట్‌లో పేర్లు నమోదుకు అవకాశం

ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.250 ఫీజు



మహారాణిపేట, ఫిబ్రవరి 28:

జిల్లాలో మూడో విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సోమవారం ప్రారంభం కానున్నది. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు మార్చి ఒకటో తేదీ నుంచి టీకాలు వేస్తారు. జిల్లా వ్యాప్తంగా 187 పబ్లిక్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 142 ఆరోగ్య కేంద్రాలు, 45 నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వున్నాయి. జిల్లాలో సుమారు ఐదు లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్టు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ పి.ఎస్‌.సూర్యనారాయణ తెలిపారు. సుమారు లక్ష డోసుల వ్యాక్సిన్‌ సిద్ధం చేసినట్టు ఆయన వెల్లడించారు. 

జిల్లాలో తొలి విడతలో వైద్యులు, వైద్య సిబ్బంది, ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుధ్య సిబ్బంది, ఆశా వర్కర్లకు కొవిడ్‌ టీకాలు వేశారు. వీరికి రెండోసారి టీకా వేసే ప్రక్రియ కూడా దాదాపు ముగింపు దశకు వచ్చింది. రెండో విడతలో పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులకు టీకాల ప్రక్రియ పది రోజుల క్రితం మొదలైంది. తాజాగా మార్చి ఒకటో తేదీ నుంచి 60 ఏళ్లు పైబడినవారికి, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు, రుగ్మతలతో బాధపడుతున్న వారికి మొదటి విడత కొవిడ్‌ టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అఽధికారులు వ్యాక్సినేషన్‌కు చర్యలు చేపట్టారు. జిల్లాలో 60 ఏళ్లపైబడిన వారు 4.5 లక్షల మంది, 45 ఏళ్లు నిండి... దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు 50 వేల మంది వరకు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం మీద ఐదు లక్షల మందికి టీకా వేస్తారు. జిల్లాలోని కోల్డ్‌ చైన్‌ సెంటర్‌ల ద్వారా వ్యాక్సిన్‌ అందిస్తున్నామని, ఇందుకోసం లక్ష డోసులు సిద్ధం చేశామని, అవసరమైతే మరిన్ని డోసులు తెప్పించేందుకు ఏర్పాట్లు చేశామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సూర్యనారాయణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కాగా కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్నందున రోజూ కనీసం మూడు వేల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఆయన చెప్పారు.


ఒక్కో కేంద్రంలో రోజూ వంద మందికి టీకా

జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలు, నెట్‌వర్క్‌ ఆస్పత్రులు కలిపి మొత్తం 187 కేంద్రాల్లో మూడో విడత కొవిడ్‌ టీకా వేస్తారు. ఒక్కో కేంద్రంలో రోజుకి వంద మందికి వ్యాక్సిన్‌ వేస్తారు. వ్యాక్సినేషన్‌ను సాఫీగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. 


యాప్‌, వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సిన్‌కు అర్హులైన వారు ఆరోగ్య సేతు యాప్‌, కోవ్యాక్సిన్‌ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. టీకా ఎప్పుడు వేస్తారో స్లాట్‌ వస్తుంది. ఆ తేదీన సమీపంలోని ఆరోగ్య కేంద్రం లేదా నెట్‌వర్క్‌ ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్‌ పొందచ్చు. ఆరోగ్య సేతు, కొవిన్‌.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లను ఓపెన్‌ చేశాక మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తే ఖాతా ఓపెన్‌ చేసేందుకు ఓటీపీ వస్తుంది. ఖాతా ఓపెన్‌ అయ్యాక వివరాలు పూర్తిచేసి అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం వ్యాక్సినేషన్‌ కేంద్రం, తేదీని ఎంచుకోవాలి. ఒక మొబైల్‌ నంబర్‌ ద్వారా నలుగురి పేర్లు నమోదు చేసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని వారు మీసేవా కేంద్రాల్లో, అవసరమైతే 1507 నంబర్‌కు ఫోన్‌చేసి కాల్‌ సెంటర్‌ సేవలు పొందవచ్చునని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సూర్యనారాయణ తెలిపారు. 


ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.250 

కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన నిబంధనల ప్రకారం ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.250లకే వ్యాక్సిన్‌ వేస్తారు. దీనిలో రూ.150 వ్యాక్సిన్‌ ధర కాగా, రూ.100 సర్వీస్‌ చార్జిగా వసూలు చేస్తారు. ఇంతకన్నా ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయడానికి వీలులేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆధార్‌ కార్డు చూపించి వ్యాక్సిన్‌ పొందవచ్చు. 

Updated Date - 2021-03-01T06:16:22+05:30 IST