నేటి నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-02-28T05:30:00+05:30 IST

కరోనా మహమ్మారి అంతానికి చేపట్టిన వ్యాక్సినేషన్‌ మూడో విడతకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులకు టీకా ఇచ్చారు.

నేటి నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌

60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొవిడ్‌ టీకా

ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్య ఆరోగ్య శాఖ

మెదక్‌ జిల్లాలో 1, సంగారెడ్డి జిల్లాలో 3 కేంద్రాలు


మెదక్‌ అర్బన్‌/సంగారెడ్డి అర్బన్‌, ఫిబ్రవరి 28: కరోనా మహమ్మారి అంతానికి చేపట్టిన వ్యాక్సినేషన్‌ మూడో విడతకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులకు టీకా ఇచ్చారు. మూడో విడతగా నేటి నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 నుంచి 59 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేసేందుకు కార్యాచరణ రూపొందించారు. 


కొవిన్‌ 2.0 యాప్‌లో వివరాల నమోదు

టీకా వేయడం కోసం లబ్ధిదారుల వివరాలను కొవిన్‌ 2.0 వెబ్‌సైట్‌లో నమోదు చేయనున్నారు. ఆధార్‌ లేదా ఓటరు కార్డు ఆధారంగా వయస్సును గుర్తిస్తారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు డాకర్‌ ప్రిస్కిప్షన్‌ పరిశీలించి, రోగి పరిస్థితిని తెలుసుకుని నమోదు చేస్తారు. యాప్‌లో పేరు నమోదు చేసుకున్న అనంతరం ఏ రోజు టీకా వేసుకోవాలి, ఏ సెంటర్లో వేసుకోవాలనే వివరాలు మొబైల్‌ ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. ఆయా రోజుల్లో కేంద్రాలకు వెళ్లి టీకాను వేసుకోవాల్సి ఉంటుంది.


మెదక్‌ జిల్లాలో ఒకటి, సంగారెడ్డి జిల్లాలో మూడు కేంద్రాలు

మెదక్‌ జిల్లా పరిఽధిలో పేరు నమోదు చేసుకున్నవారికి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నటి నుంచి ఉచితంగా టీకాను వేయనున్నారు. ప్రతీరోజు 200 మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో మూడు కేంద్రాల్లో 200 మంది చొప్పున వ్యాక్సిన్‌ వేయనున్నారు. సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రిలో ఉచితంగా టీకా వేస్తారు. ఇస్నాపూర్‌లోని మహేశ్వర మెడికల్‌ కళాశాల, ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కళాశాలల్లో రూ.250 తీసుకుని కొవిడ్‌ టీకాను వేయనున్నారు. భవిష్యత్తులో కేంద్రాలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు.

Updated Date - 2021-02-28T05:30:00+05:30 IST