- ‘మాతో శ్రీ’కి రూ.50 లక్షల వాచీ, రూ.2 కోట్ల గిఫ్ట్‌లు!
- మహా సీఎం నివాసం పేరిట రాసుకున్న శివసేన నేత
- అక్రమాలపై విచారణలో ఐటీ అధికారుల చేతికి డైరీ
ముంబై, మార్చి 27: బహుమతి గానో, ఇంకే రూపంలోనో ఎవరికైనా ఏదైనా ఇస్తే.. డైరీలోనో, మరేదైనా పుస్తకంలోనో ఫలానా.. ఫలానా అని రాసుకుంటాం..! ఆ సందర్భానికి షార్ట్ కట్లో ఏదైనా పేరుపెట్టుకుని గుర్తుంచుకుంటాం..! కానీ, మహారాష్ట్ర రాజధాని ముంబై కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్, అధికార శివసేన నేత యశ్వంత్ జాదవ్ తానిచ్చిన ‘‘గిఫ్ట్’’లకు ఏకంగా సీఎం నివాసం ‘‘మాతోశ్రీ’’ పేరునే పెట్టాడు. ‘‘మాతో శ్రీ’’కి రూ.50 లక్షల విలువైన వాచ్, రూ.2 కోట్ల బహుమతిని ఇచ్చినట్లు డైరీలో రాసుకున్నాడు. అయితే, ఆ డైరీ కాస్తా.. బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ)లో అక్రమ లావాదేవీలపై విచారణ జరుపుతున్న ఆదాయ పన్ను శాఖ అఽధికారులకు దొరికింది. ‘‘మాతో శ్రీ’’ పేరు ఉండడం రచ్చకు దారితీస్తోంది. ఇదిక్కడికి పరిమితమైతే, పెద్దగా వివాదం ఉండేది కాదు. కానీ, జాదవ్ ఇతర విషయాల్లోనూ రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉండడంతో రాజకీయంగా చర్చ రేపుతోంది. కాగా, డైరీని స్వాధీనం చేస్తున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు.. యశ్వంత్‌ను ప్రశ్నించారు. తన తల్లి పుట్టిన రోజున వాచ్‌లు పంపిణీ చేశానని, గుడి పడ్వా పండుగ నేపథ్యంలో కొందరికి బహుమతులు ఇచ్చానని, మాతోశ్రీగా వాటిని డైరీలో నమోదు చేశానని చెప్పారు. ‘‘మాతో శ్రీ’’ అంటే.. సీఎం థాక్రే నివాసం కాదని వివరణ ఇచ్చారు.
మరోవైపు న్యూషాక్ మల్టీమీడియా సంస్థ యజమాని బిమల్ అగర్వాల్‌కు రూ.30 కోట్ల కాంట్రాక్టులను జాదవ్ కట్టబెట్టినట్లు ఐటీ పన్ను శాఖ గుర్తించింది. తిరిగి అదే సంస్థ ద్వారా బైకుల్లాలోని బిల్కడీలో యశ్వంత్ 31 ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు పసిగట్టింది. మరో 40 ఆస్తులూ జాదవ్‌కు చెందినవిగానే అనుమానిస్తోంది. వీటిలో కొన్నిటికి హవాలా మార్గంలో చెల్లింపులు జరిగినట్లు ఐటీ శాఖ విచారణలో తేలింది. కాగా, జాదవ్ భార్య యామిని బైకుల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో 2018 నుంచి ఆమోదించిన కాంట్రాక్టుల వివరాలు ఇవ్వాలని బీఎంసీని ఆదాయ పన్ను శాఖ కోరింది.