జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు దారుణం

ABN , First Publish Date - 2021-04-24T04:53:25+05:30 IST

చిత్తూరు జిల్లాకు చెందిన దళిత జడ్జి రామకృష్ణపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలో భాగంగా ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయడం దారుణమని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బండి ఈశ్వర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు దారుణం
పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న బండి ఈశ్వర్‌

మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్‌

కడప(మారుతీనగర్‌), ఏప్రిల్‌ 23: చిత్తూరు జిల్లాకు చెందిన దళిత జడ్జి రామకృష్ణపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలో భాగంగా ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయడం దారుణమని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బండి ఈశ్వర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేఖరులతో ఆయన మాట్లాడారు. కరోనా బారిన పడి మదనపల్లె హాస్పిటల్‌కు వెళ్లే సమయంలో మానవత్వం మరచి కనికరం లేకుండా ఆయనను దారిలోనే అడ్డుకొని అక్రమంగా అరెస్ట్‌ చేయడం పాలక ప్రభుత్వ రాక్షసత్వానికి పరాకాష్ట అని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై, దళిత నాయకులపై అక్రమకేసులు బనాయించి ఇబ్బందులపాలు చేయడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. వైసీపీ పాలనను విమర్శించారనే నెపంతో జడ్జిని ఇరుకునపెట్టడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా రాక్షసత్వ పాలనకు స్వస్తిపలకాలని హితవు పలికారు. సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర నాయకులు వినోద్‌కుమార్‌, కె.వి.రమణ, జిల్లా నాయకులు ఆంజనేయులు, సి.వెంకటరమణతో పాటుగా దళిత నాయకులు మల్లికార్జున, మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్‌ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:53:25+05:30 IST